Happy Married Life। భార్యాభర్తల మధ్య ప్రేమ కలకాలం ఉండాలంటే ఇవిగో టిప్స్!-bring back good old days 6 ways to maintain love in your married life
Telugu News  /  Lifestyle  /  Bring Back Good Old Days 6 Ways To Maintain Love In Your Married Life
Happy Married Life
Happy Married Life (Pexels)

Happy Married Life। భార్యాభర్తల మధ్య ప్రేమ కలకాలం ఉండాలంటే ఇవిగో టిప్స్!

15 December 2022, 19:15 ISTHT Telugu Desk
15 December 2022, 19:15 IST

Happy Married Life: భార్యాభర్తలు కలకాలం ప్రేమగా కలిసి మెలిసి ఉండాలంటే ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని పాటిస్తూ మీ బంధాన్ని పదిలంగా ఉంచుకోండి.

ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో తనకు ఇష్టమైన వారు దూరమయ్యే పరిస్థితి తలెత్తుతుంది. భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య, స్నేహితుల మధ్య, తల్లిదండ్రులు, తోబుట్టువులతో సంబంధంలో కూడా ఒక్కోసారి చీలికలు రావడం చూస్తుంటాం. అయితే ప్రేమికుల మధ్య బ్రేకప్ అయితే మళ్లీ కలిసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మిగతా బాంధవ్యాలు నేడు విడిపోయినా, రేపు మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది. కానీ భార్యాభర్తలు విడిపోతే మళ్లీ కలవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వేరే ఏ బంధం విడిపోవాల్సి వచ్చినా, వారి నుంచి దూరంగా ఉంటే సరిపోతుంది. కానీ భార్యాభర్తలు విడిపోవాలంటే చట్టపరంగా విడాకులు అనే ఒక న్యాయపరమైన ఆయుధం ఉంది. మళ్లీ వారు కలవాలనుకున్నా, చట్టపరంగానే వెళ్లాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.

చాలా మంది భార్యాభర్తలు విడాకులు తీసుకొని ఎవరికి వారు సంబంధం లేకుండా బ్రతకడం ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. పవిత్రమైన పెళ్లి బంధంతో ఒక్కటైన వారు, చాలా కాలంపాటు అన్యోన్యంగా మెలిగిన తర్వాత కూడా విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది. చాలా సందర్భాల్లో మునుపు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు, సెట్ అవ్వడం లేదనే చాలా జంటలు ఫిర్యాదు చేస్తాయి.

Tips for Happy Married Life- భార్యాభర్తలు కలకాలం ప్రేమగా మెలగాలంటే ఇవిగో టిప్స్

అందమైన జీవితాన్ని నాశనం చేసుకోకుండా, భార్యాభర్తల ప్రేమగా ఒకరికొకరు ఎలా మెలగాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అపార్థాల వలన మీ బంధంలో చీలికలు వస్తున్నాయని మీరు భావిస్తే ఇలా ప్రయత్నించి చూడండి.

1. పరస్పర సహకారం

కుటుంబం ఒక రథమైతే, భార్యాభర్తలు ఆ రథానికి రెండు సమాన చక్రాలు అని పెద్దలు చెబుతారు. దీని ప్రకారం జీవితాంతం పరస్పర సహకారంతో కుటుంబాన్ని నడిపించడం భార్యాభర్తల ప్రాథమిక కర్తవ్యం. ఇంట్లో ఒక భాగస్వామి ఇంటి పనులు చూసుకుంటే మరొకరు సంపాదించడం, బయటి పనులు చేయాలి. ముఖ్యంగా పురుషుడు ఖాళీగా కూర్చొని, భార్యతో అన్ని పనులు చేయిస్తే అది మంచిది కాదు.

2. ఇష్టాయిష్టాలకు ప్రతిస్పందించడం

దంపతుల జీవితంలో ఒకరికొకరు సుఖ దుఃఖాలు పంచుకోవడం అందరి కర్తవ్యం. ముఖ్యంగా భాగస్వామి ఇష్టాయిష్టాల గురించి తెలుసుకోవడం, వాటికి అనుగుణంగా వ్యవహరించడం నిజమైన ప్రేమికుడి ప్రాథమిక లక్షణం. భాగస్వామి చిన్నచిన్న కోరికలు తీర్చడం. వారు అడగకుండానే వారి కోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయడం, వారికి ఇష్టమైనవి అప్పుడప్పుడూ వండిపెట్టడం చేస్తుండాలి.

3. సంతృప్తికర శృంగారం జీవితం

భార్యాభర్తల మధ్య శృంగారం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. శృంగారం అనేది కేవలం ఒక శారీరక అవసరం కాదు, అది కూడా ఒక భరోసా. ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి ఇది మార్గం. సుదీర్ఘకాల సంబంధం తర్వాత లైంగిక ఆసక్తి తగ్గుతుందనేది నిజమే అయినప్పటికీ, కొంటె మాటలు, చిలిపి చేష్టలు మీ మధ్య స్నేహపూర్వక సంబంధాన్ని ఎప్పటికీ సజీవంగా ఉంచుతాయి.

4. కలిసి టూర్ వేయడం

మీ మధ్య ప్రేమ తగ్గినట్లు అనిపించినా, మాటలు లేకపోయినా ఇద్దరూ కలిసి ఏదైనా టూర్ వేయండి. ఈ టూర్ మిమ్మల్ని మళ్లీ ఒక్కటి చేస్తుంది. సంవత్సరానికి కనీసం ఒకటి - రెండుసార్లు మీ భాగస్వామిని విహారయాత్రకు తీసుకెళ్లడం ద్వారా, మీ పాత రోజులను గుర్తు చేసుకోవచ్చు.

5. సమయం కేటాయించడం

ఆధునిక జీవనశైలిలో వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు కూడా సంబంధాలు విచ్ఛిన్నం కావడానికి కారణం అవుతాయి. అయితే ఒత్తిడిలో ఉన్నప్పటికీ, మీ భాగస్వామి కోసం రోజులో కొంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం. మీ ఆందోళనలు తెలియజెప్పడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది, వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.

6. సంరక్షణ అందిచడం

రోజువారీ జీవితంలో మీ జీవిత భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా, వారికి చేత కానపుడు వారి అవసరాలను తీర్చడం ద్వారా మీపైన ప్రేమ, గౌరవం రెండూ పెరుగుతాయి.

సంబంధిత కథనం