Flashback Friday | సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం.. సమయం చేసుకొని మాట్లాడేది బంధం!
24 February 2023, 5:05 IST
- Flashback Friday: సమయం చాలా విలువైనది, బంధాలు అంతకంటే విలువైనవి. ఒక్కోసారి మనకు సమయం ఉంటుందేమో గానీ, మనతో గడపటానికి ఎవరూ ఉండకపోవచ్చు. గతంలోలా లేదు నేడు, ఒకసారి గతంలోకి వెళ్లి వద్దాం పదండి..
Flashback Friday
Flashback Friday: అందరికీ కుటుంబం ఉంటుంది, అందరికీ ఆత్మీయులు ఉంటారు, వారందరిపై ప్రేమాభిమానాలు ఉంటాయి. కానీ మాట్లాడేందుకు సమయమే ఉండదు. నిన్న, మొన్నటిలా కాదు.. ఈరోజుల్లో ఎవరైనా అవసరానికి మాత్రమే పలకరిస్తారు. అవసరం ఉన్నప్పుడే నీకోసం సమయం కేటాయిస్తారు. అవసరం తీరిపోయాక కనీసం కన్నెత్తి చూడరు. ఈ ధోరణి ఎక్కడి వరకు వెళ్లిందంటే, కనీసం సొంత కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా పలకరించే తీరిక లేకుండా పోయింది జనాలకి. గుండెమీద చెయ్యి వేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ వాళ్లని నోరారా ప్రేమతో పిలిచి ఎంతకాలం అయిందో గుర్తు చేసుకోండి, వారికోసం కొంత సమయం కేటాయించి ఎంతకాలం అయిందో గుర్తు చేసుకోండి.
అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్నప్పటికీ కమ్మని కబుర్లు చెప్పుకునే రోజులు పోయాయి. అంతా డబ్బు సంపాదన, ఉద్యోగం, చదువులు, ఉరుకులు, పరుగులు. వీటన్నింటి మధ్య మీకంటూ ఒక జీవితం ఉంది అనేది మరిపోతున్నారు. మీకంటూ బంధాలు అనుబంధాలు ఉన్నాయి. వారి మీ మనసును తాకేలా ఒక్కసారైనా సంభాషించారా?
సమయం చాలా విలువైనది, గడిచిన సమయం తిరిగిరాదు నిజమే, కానీ ఒక్కోసారి మీకు మీ ప్రియమైన వారితో ఇక ఎప్పటికీ గడిపే సమయమూ ఉండకపోవచ్చు. సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం.. సమయం చేసుకొని మాట్లాడేది బంధం. నిజం చెప్పాలంటే సమయం కంటే కూడా అత్యంత విలువైనది బంధం. ఒక చిన్న కథతో బంధం ఎంత విలువైనదో ఇప్పుడు తెలుసుకుందాం.
మళ్లీ రావా..
నిరంతరం తన వృత్తి వ్యాపారాలతో బిజీగా ఉండే ఓవ్యక్తికి తన ఏడేళ్ల కూతురంటే పంచప్రాణాలు. తన కూతురు ఎప్పుడు ఏదీ అడిగినా కాదనలేడు. ఎవరి కోసం ఐదు నిమిషాలు కూడా కేటాయించని ఆ వ్యక్తి, తన కూతురు మాత్రం ఎప్పుడు పిలిచినా తన పనులను మధ్యలోనే విడిచి ఎక్కడికి తీసుకెళ్లమన్నా తీసుకెళ్తాడు, తనతో ఎంతసేపైనా గడుపుతాడు. ఒకరోజు తన కూతురు స్కూలు నుంచి వచ్చాక పార్కుకు తీసుకెళ్లమని కోరితే, వెంటనే రెడీ అయిపోయి పార్కుకు తీసుకెళ్తాడు. అక్కడ పిల్లలందరూ ఆడుకుంటారు, వెళ్లిపోతారు. కానీ తన కూతురు మాత్రం అక్కడే ఇంకా ఆడుకుంటుంది. ఇక ఓసారి ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు. ఇంకో 5 నిమిషాలు డాడీ అంటూ కూతురు సమాధానం ఇస్తుంది. అరగంట దాటినా రాదు, ఇంకా ఆడుతూనే ఉంటుంది. తన కూతురును చూస్తూ ఆ తండ్రి కూడా ఆనందంగా చిరునవ్వులు చిందిస్తుంటాడు. ఇదంతా గమనించిన ఒక మహిళ, ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అడుగుతుంది.. ‘మీకు ఏ తండ్రికి లేనంత ఓపిక, కూతురిపై ప్రేమ ఉందండీ.. కూతురు ఎన్నిసార్లు అడిగినా నవ్వుతూ సరే అంటున్నారు. నేనయితే అలా కాదు, నా పిల్లపై అరుస్తాను’ అంటుంది.
అందుకు ఆ వ్యక్తి బదులిస్తూ.. 'ఇంతకు ముందు ఎప్పుడు నేను తనను తీసుకొచ్చే వాడిని కాదు, నాకసలు సమయమే ఉండేది కాదు, ఎప్పుడూ వాళ్ల అమ్మ తీసుకొచ్చేది, ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను' అంటాడు.
అతడి మాటలకు ఆశ్చర్యపోయిన ఆ మహిళ, కుతూహలంగా.. 'మరి మీరు ఇప్పుడు పనిచేయడం లేదా, కూతురుని ఆడించేందు తన తల్లి ఎందుకు రావడం లేదు' అని అడుగుతుంది. అందుకు ఆ వ్యక్తి మాట్లాడుతూ.. 'నాకు తనతో కూడా మాట్లాడే సమయం ఉండేది కాదు, పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేసినా కట్ చేసే వాడిని, కొంతకాలం కిందటే ఆమె అనారోగ్యంతో చనిపోయింది.. తను చనిపోయే ముందు ఫోన్ చేసి ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడటానికి అడిగింది, నేను అది కూడా ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఆమెతో ఒక్కసారైనా మాట్లాడాలని ఉంది, తనని ప్రేమగా పలకరించాలని, తనని సంతోషపెట్టడానికి ఎక్కడికైనా తీసుకెళ్దామని ఉంది, కానీ ఆ అవకాశమే లేదు కదా. సమయం కంటే.. బంధాలు, అనుబంధాలే ముఖ్యం, అని ఇప్పటికి తెలిసి వచ్చింది' అని చెబుతాడు. అది అసలు కథ!
ఈ కథతో చెప్పదల్చుకునేది ఏమిటంటే.. మీ వృత్తివ్యాపారాలు చేసుకోండి, మీ సమయం విలువైనదే కావచ్చు, కానీ అంతకుమించి విలువైనవి బంధాలు. కాబట్టి మనసారా మాట్లాడుతూ ఉండండి, అందరితో ఆనందంగా జీవించండి.