Benefits of Crying | ఏడుపు ఎన్నో విధాల మంచిది.. మనసారా ఏడవండి!-it is fine to breakdown sometimes crying might be good for your health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Benefits Of Crying | ఏడుపు ఎన్నో విధాల మంచిది.. మనసారా ఏడవండి!

Benefits of Crying | ఏడుపు ఎన్నో విధాల మంచిది.. మనసారా ఏడవండి!

Manda Vikas HT Telugu
Mar 09, 2022 02:31 PM IST

భావోద్వేగాలు ఏ జీవికైనా సహజం. ఆనందం వచ్చినప్పుడు చిరునవ్వు ఎలా అయితే వస్తుందో, విచారంలో ఉన్నప్పుడు ఏడుపు కూడా రావాలి. అది సహజమైన ప్రతిస్పందన. అంతేకాదు ఏడుపు ఎన్నో విధాల మంచిదని పలు అధ్యయనాలు నిరూపించాయి.

<p>Crying- ఏడుపు మంచిదే</p>
Crying- ఏడుపు మంచిదే (Shutterstock)

నవ్వుతూ బతకాలి, నవ్వని వాడు రోగి, నువు నవ్వితే అందంగా ఉంటావు.. అంటూ ఎప్పుడూ నవ్వును హైలైట్ చేస్తారు గానీ ఏ ఒక్కరు కూడా ఏడుపును ఎంకరేజ్ చేయరు. ఏడ్చేవాళ్లను అస్సలు మెచ్చుకోదు ఈ పాడు సమాజం. ముఖ్యంగా మగవారు ఏడిస్తేనైతే అదేదో నేరం-ఘోరం అన్నట్లుగా చూస్తారు. ఏడ్ఛే మగాళ్లను నమ్మొద్దు, ఏడుపును నియంత్రించుకోలేని వాడు బలహీనుడు అని చిత్రీకరిస్తారు. కానీ భావోద్వేగాలు ఏ జీవికైనా సహజం. ఆనందం వచ్చినప్పుడు చిరునవ్వు ఎలా అయితే వస్తుందో, విచారంలో ఉన్నప్పుడు ఏడుపు కూడా రావాలి. అది సహజమైన ప్రతిస్పందన. అంతేకాదు ఏడుపు ఎన్నో విధాల మంచిదని పలు అధ్యయనాలు నిరూపించాయి. ఏడ్చినపుడు మెదడులో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అది బాధ నుంచి ఊరటను, మానసిక ప్రశాంతతను కలుగజేస్తుందని సైంటిస్టులు పేర్కొన్నారు. వీటితో పాటు ఏడుపు ద్వారా ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో చూడండి.

ఏడుపు వల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలిద్దాం

శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది

దు:ఖం పొంగుకొచ్చినప్పుడు మనం కన్నీళ్లను ఆపుకోలేము. ఈ కన్నీళ్లతో మన కళ్లు శుభ్రం అవుతాయి. అయితే ఈ కన్నీళ్లలోనూ మూడు రకాలు ఉంటాయట. అవి రెగ్యులర్ కన్నీళ్లు, రిఫ్లెక్స్ కన్నీళ్లు, భావోద్వేగ కన్నీళ్లు. ఇందులో మొదటిది రెగ్యులర్ కన్నీళ్లు మన కళ్లను తడిగా ఉంచుతూ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి, రిఫ్లెక్స్ కన్నీళ్లు కళ్లలో పడిన ఏదైనా దుమ్ము, ధూళిని తీసేస్తాయి. ఇక మూడో రకం కన్నీళ్లైన భావోద్వేగ కన్నీళ్లు ఆనందం, బాధ, ఏడ్చినపుడు వస్తాయి. ఇవి శరీరంలో ఒత్తిడి, ఆందోళన కారణంగా విడుదలైన హార్మోన్లను, ఇతర టాక్సిన్లను బయటకు పంపిస్తాయి.

స్వీయ ఓదార్పుకు సహాయపడుతుంది

ఏడ్చేటపుడు మన కన్నీళ్లను తుడిచేందుకు ఏ ఒక్క చేయి లేకపోయినా, ఆ ఏడుపే మనకొక పెద్ద ఓదార్పు. ఏడ్చేకొద్దీ మన మనస్సు దానంతటదే ఊరట చెందుతుంది. శాస్తీయంగా చెప్పాలంటే ఏడుపు అనేది శరీరంలోని పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను (PNS) సక్రియం చేస్తుంది. దీని ప్రభావంతో మీ శరీరానికి విశ్రాంతి లభించిన అనుభూతి కలుగుతుంది.

నొప్పి మందగిస్తుంది

మీరు చాలాసేపుగా ఏడుస్తుంటే, మీ శరీరం ఆక్సిటోసిన్, ఎండోజెనస్ ఓపియాయిడ్లను విడుదల చేస్తుంది. వీటినే ఎండార్ఫిన్స్ అని కూడా పిలుస్తారు. అవి మన అంతర్గతంగా మంచి అనుభూతిని కలిగించే రసాయనాలు. ఇవి విడుదలైనపుడు మానసిక బాధనే కాకుండా శారీరక నొప్పుల నుండి కూడా కాస్త ఉపశమనం కలుగుతుంది. నేచురల్ పెయిన్ కిల్లర్లుగా ఇవి పనిచేస్తాయి.

మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది

ఏడుపు మీ మానసిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది. మిమ్మల్ని మానసికంగా దృఢంగా మారుస్తుంది. ఈ సమయంలో మీరు చల్లగాలిని తీసుకోవడానికి ఇష్టపడతారు. దీంతో మీ బాడీ, మైండ్ శాంతపడి మీ మూడ్ మారుతుంది. మంచి మూడ్ లోకి వస్తారు.

అపరాధ భావం నుంచి బయటపడతారు

మీరు ఏదైనా అపరాధ భావంతో కుమిలిపోతున్నపుడు వచ్చే ఏడుపు మీకు నైతికంగా మద్ధతును చేకూరుస్తుంది. ఇది మిమ్మల్ని నెగెటివ్ ఆలోచనల నుంచి మరల్చి, పాజిటివ్ దృక్పథంతో ఆలోచించేలా చేస్తుంది. ఈ క్రమంలో అపరాధ భావం నుంచి బయటపడవచ్చు.

ఇవే కాకుండా ఏడుపు ద్వారా ఇతర సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీ ఏడిపును గ్రహించి ఇతరులు మీ బాధను అర్థం చేసుకోవచ్చు, మీకు మద్ధతుగా నిలవవచ్చు. కష్టసుఖాల జీవితంలో నవ్వు ఎంత ముఖ్యమో ఏడుపు అంతే ముఖ్యం. అప్పుడే భావోద్వేగాల్లో ఒక సమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడూ LOL అనే కాదు అప్పుడప్పుడూ COL అని కూడా పంచుకోండి, మనసారా ఏడవండి.

Whats_app_banner