తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation | జీవితంలో సుఖపడితే నీది చరిత్ర.. కష్టపడితే నీదే ఒక జీవితచరిత్ర!

Friday Motivation | జీవితంలో సుఖపడితే నీది చరిత్ర.. కష్టపడితే నీదే ఒక జీవితచరిత్ర!

HT Telugu Desk HT Telugu

03 March 2023, 5:05 IST

    • Friday Motivation: జీవితంలో కష్టసుఖాలు ఉండనివారు ఎవరూ ఉండరు. కానీ కష్టాన్ని అనుభవించినవాడే సుఖపడటానికి అర్హుడు. కేవలం సుఖాలతోనే బ్రతికే బ్రతుకులో రుచి ఉండదు. ఇది కథ కాదు, వ్యధ కాదు. ఇదే నిజం. ఇది మీలో ప్రేరణ నింపే ఒక కథనం.. చదవండి.
Friday Motivation
Friday Motivation (istock)

Friday Motivation

Friday Motivation: జీవితంలో కొన్నిసార్లు చాలా దారుణమైన పరిస్థితులు ఎదురుకావచ్చు. మన జీవితంలో మనం చాలా సందర్భాల్లో పోరాడాల్సి వచ్చేది మన శత్రువులతో అనుకుంటున్నారేమో, కానే కాదు. మనం పోరాడేది మనతోనే, మన అనుకున్న వాళ్లతోనే. పరిస్థితులు తిరగబడినపుడు మనలో మనకే శత్రువులు తయారవుతారు. అప్పుడు మనతో మనమే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే, పగవారికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనిపిస్తుంది. ఈ సమయంలో మనం ఎంత సంయమనంగా ఉంటే అంతమంచిది. మనకి మనమే ధైర్యం చెప్పుకుంటూ, సానుకూలంగా ముందుకు సాగాలి.

చాలాసార్లు మనకు అనిపిస్తుంది, లోకంలో ఏమీ లేనివాళ్లు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎప్పుడూ మనకే ఎందుకు ఇలా జరుగుతుంది, మన జీవితం ఎందుకు ఇంత దుర్భరంగా ఉంది. మనశ్శాంతి అనేదే లేదు అని అనిపిస్తుంది. కానీ ఇలా ఆలోచించడం తప్పు. నిజానికి ఎవరి జీవితం సజావుగా సాగదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. వాళ్లకేంటి బాగుంటారు అనుకోవడం చాలా సులభం. కానీ వాళ్ల జీవితంలోకి వెళ్లి చూస్తేనే తప్ప, వాళ్లకి ఎలాంటి బాధలు ఉన్నాయో తెలియదు. కాబట్టి మనకి మాత్రమే కష్టాలు ఉన్నాయనుకుని కుంగిపోవడం, ఏడుస్తూ ఇతరులకు మన కష్టాలను చెప్పడం చేయకండి. ఎందుకంటే వారి ముందు మీరు చులకనవ్వడం మినహా జరిగేది ఏమి ఉండదు. మీ కష్టాలకు ఎప్పుడూ ఎదుటివారిని తిట్టుకుంటూ, దేవుడిని తిట్టుకుంటూ ఉంటే కష్టాలు తీరవు, కన్నీళ్లు ఆగవు.

కాలం మిమ్మల్ని పరీక్షపెడుతుంటే, కాలాన్ని ఎదురించండి. కాలంపై కనికరం లేకుండా కసిగా ముందుకు సాగండి. ఏం జరుగుతుందో జరగనీ చూస్కుందాం అని బలంగా ఉండండి. ఈ ఆలోచనే మీకు శక్తినిస్తుంది. మీలో ఒక తెలియని కరెంట్ పాస్ అవుతుంది.

చీకటి- వెలుగు, రాత్రి- పగలు ఉన్నట్లే మన జీవితంలో కష్టం-సుఖం రెండూ ఉంటాయి. ఇలా రెండూ ఉంటేనే జీవితం అనేది బాగుంటుంది. అయితే మనం దేనిని ఎలా స్వీకరిస్తున్నాం అనే దానిపైనే మన సంతోషం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ వెలుగు మాత్రమే ఉండాలి అంటే చీకటి అందాన్ని చూడలేవు. ఎప్పుడు పగలు మాత్రమే ఉంటే వెన్నెల వెలుగును అనుభూతి చెందలేవు. అలాగే సుఖం మాత్రమే ఉంటే కష్టంలోని గొప్పదనాన్ని ఆస్వాదించలేవు. నువ్వు కష్టాన్ని ఇష్టంగా స్వీకరిస్తే ఆ కష్టంలోనూ నీకు నచ్చే అంశాలు ఎన్నో ఉంటాయి, ఒక వ్యక్తి పడే కష్టాలే ఆ వ్యక్తి విలువను పెంచుతాయి.

కాబట్టి జీవితంలో కష్టపడండి, కష్టాలు పడండి. సుఖాలు వాటంతటవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఎల్లప్పుడూ సుఖసంతోషాలనే కోరుకుంటే మీ జీవితం ఒక చరిత్ర అవుతుంది. మీరు కష్టాల కడలిని దాటి విజేతగా నిలిచినపుడు మీ జీవితం ఒక జీవిత చరిత్ర అవుతుంది. ఏదీ కావాలో మీరే తేల్చుకోండి.