Yoga to Control Cholesterol । కొవ్వు తగ్గించే యోగా.. చేసేయండి ఈజీగా!
31 January 2023, 17:20 IST
- శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను ఎదుర్కోవడంలో, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే మూడు యోగా ఆసనాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Yoga Asanas to Control Cholesterol -(Shalabhasanam)
ఏ వయసు వారికైనా అనుకూలమైన వ్యాయామ పద్ధతి యోగా. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనకు తెలుసు. కండరాలు, కీళ్లను బలోపేతం చేయడం మొదలైన శారీరక ప్రయోజనాల నుండి మెరుగైన నిద్రను ప్రేరేపించడం, ఒత్తిడి లక్షణాలను ఎదుర్కోవడం వంటి మానసిక ప్రయోజనాలు యోగా ద్వారా కలుగుతాయి. అంటే ఈ వ్యాయామం శారీరక బలంతో పాటు మానసిక దృఢత్వాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇతర వ్యాయామాలతో పోలిస్తే యోగాతో లభించే ప్రయోజనాలు చాలా రెట్లు ఎక్కువ. ఇది శరీరం స్థిరత్వం, సమతుల్యత, భంగిమను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
ప్రతీ ఆరోగ్య సమస్యకు యోగాలో పరిష్కారం ఉంది. ఈరోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అధిక కొలెస్ట్రాల్ సమస్యలను ఎదుర్కోవడంలోనూ యోగా సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉండే ఒక రకమైన మైనపు పదార్థం, ఇది ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి అవసరం. కానీ ఈ కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమయ్యే స్థాయి కంటే ఎక్కువ పెరిగినపుడు, అది గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. కాబట్టి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
కొవ్వు కరిగించడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు, జిమ్ లలో గంటల కొద్దీ వివిధ రకాల వర్కవుట్లు చేస్తూ శ్రమకోరుస్తారు. కఠోర సాధన చేస్తూ కొలెస్ట్రాలె తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఎక్కువగా శ్రమ పడకుండా కొన్ని సులభమైన యోగా ఆసనాలు సాధన చేయడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
Yoga Asanas to Control Cholesterol- కొలెస్ట్రాల్ నియంత్రించే యోగా ఆసనాలు
యోగా ట్రైనర్ సర్వేష్ శశి శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి మూడు యోగా ఆసనాలను సూచించారు. వాటిని రోజూవారీ దినచర్యలో భాగంగా చేర్చుకుంటే కొవ్వు తగ్గుతుందని, ఆరోగ్యకరమైన స్థితిలో ఉంటుందని తెలిపారు. మరి ఆ మూడు యోగాసనాలు ఏవో మీరూ తెలుసుకోండి.
చక్రాసనం- Wheel Pose
దీనిని ఊర్ధ్వ ధనురాసనం అని కూడా పిలుస్తారు. ఈ చక్రాసనం ఛాతీ, భుజం కండరాలను సాగదీయడంలో సహాయపడుతుంది. ఇది హామ్ స్ట్రింగ్స్ ను బలోపేతం చేయడంలో, వెన్నెముక వశ్యతను పెంచడంలో కూడా సహాయపడుతుంది.
శలభాసనం- Locust Pose
దీనిని గొల్లభామ భంగిమ అని కూడా పిలుస్తారు. శలభాసనం దిగువ వీపు, కటి అవయవాలు, కాళ్లు, తుంటి కీళ్ళు, చేతులను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది వెన్నునొప్పి, స్లిప్డ్ డిస్క్, మిల్క్ సయాటికా లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
సర్వంగాసనం- Shoulder Stand
సర్వంగాసనం థైరాయిడ్ గ్రంథిని నియంత్రించడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సర్వంగాసనం ప్రతిరోజూ అభ్యాసం చేస్తే అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
రోజూ ఈ మూడు యోగాసనాలు వేయడం ప్రాక్టీస్ చేస్తే కొవ్వు తగ్గుతుంది, ఆరోగ్యం బాగుంటుంది.