Alcohol Drinking: ఆల్కహాల్ తాగేటప్పుడు ఇవి తినకూడదు.. గుర్తుంచుకోండి!
25 May 2023, 12:30 IST
- Alcohol Drinking: ఆల్కహాల్ తాగే సమయంలో కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు. అవి తింటే ఇబ్బందులు తలెత్తుతాయి.
Alcohol Drinking: ఆల్కహాల్ తాగేటప్పుడు ఇవి తినకూడదు.. గుర్తుంచుకోండి! (File photo)
ఏదైనా సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకైనా, ఎవరైనా ప్రత్యేకంగా కలిసినా కొందరు ఆల్కహాల్ తాగుతుంటారు. ఆ సమయంలో ఏదైనా తింటూనే ఉంటారు. ముఖ్యంగా ఆల్కహాల్ తాగిన వారికి ఆకలి ఎక్కువవుతుంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ ఆకలిని పెంచుతుంది. అందుకే తాగే సమయంలో ఎక్కువగా తినేందుకు కొందరు ఇష్టపడతారు. అయితే, ఆల్కహాల్ తాగే సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు. ఆ పదార్థాలు తింటే ఇబ్బందులు ఏర్పడతాయి. అలా.. ఆల్కహాల్ తాగే సమయంలో తినకూడని ఆహార పదార్థాలు ఏవో న్యూట్రిషియన్ ఎక్స్‌పర్ట్ దివ్యాగోపాల్ వివరించారు. అవేంటో చూడండి.
చాక్లెట్లు
సాధారణంగా చాక్లెట్లు తినడం వల్ల కొన్ని అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఆల్కహాల్ తాగుతున్నప్పుడు మాత్రం చాక్లెట్లు తినకూడదు. ఆల్కహాల్ తాగే సమయంలో చాక్లెట్ తింటే పేగులకు సమస్యగా మారుతుంది. జీర్ణక్రియకు ఇబ్బందిగా ఉంటుంది. ఆల్కహాల్ సేవించే సమయంలో చాక్లెట్ తింటే జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. చాక్లెట్‍లో కెఫీన్, కోకో రెండూ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆల్కహాల్ తాగేటప్పుడు వీటిని తీసుకుంటే కడుపు సమస్యలు మరింత తీవ్రం అవుతాయి.
బ్రెడ్ వద్దు
బీర్ తాగే సమయంలో బ్రెడ్ తినకూడదని డాక్టర్ గోపాల్ చెప్పారు. బీర్, బ్రెడ్ రెండింట్లోనూ ఈస్ట్ అత్యధికంగా ఉంటుందని, అందుకే రెండూ కలిపి తింటే.. మీరు తీసుకున్న ఆల్కహాల్‍ను లివర్ ప్రాసెస్ చేయలేదని చెప్పారు. అలాగే జీర్ణ ప్రక్రియ కూడా సరిగా జరగదని అన్నారు.
పిజ్జా
ఆల్కహాల్, పిజ్జా కాంబినేషన్ కూడా అంత మంచిది కాదు. ఆల్కహాల్ తాగే సమయంలో పిజ్జా తింటే కడుపులో కాస్త నొప్పి వచ్చి, ఇబ్బందిగా అనిపించే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందులోనూ పిజ్జాతో అధిక బరువు రిస్క్ కూడా ఉంటుంది.
ఉప్పు, కారం ఎక్కువగా ఉన్నవి
ఉండాల్సిన దాని కంటే ఎక్కువ ఉప్పు, కారం ఉన్న ఆహార పదార్థాలను ఆల్కహాల్ తాగేటప్పుడు తినకూడదు. అందుకంటే ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు సంబంధిత సమస్యకు దారి తీస్తుంది. ఎక్కువగా ఉప్పు పదార్థాలు తింటే.. ఆల్కహాల్ ఇంకా తాగాలనిపిస్తుంది. అలాగే, ఆల్కహాల్ తాగే సమయంలో కారం ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తిన్నా ఇబ్బందులు తప్పవు. జీర్ణ సంబంధిత సమస్య తలెత్తుతుంది. “కడుపు ఖాళీ అయ్యే ప్రక్రియను ఎక్కువ కారం ఉన్న ఫుడ్ ఆలస్యం చేస్తుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్ కు కారణం అవుతుంది” అని డాక్టర్ గోపాల్ చెప్పారు.
బీన్స్, కాయధాన్యాలు
ఐరన్ ఎక్కువగా ఉండే బీన్స్, కాయధాన్యాలను ఆల్కహాల్ తాగే సమయంలో తినకూడదు. ఆల్కహాల్, బీన్స్ కాంబినేషన్ నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. జీర్ణక్రియకు చాలా ఇబ్బందిగా మారుతుంది.
ఆల్కహాల్ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరం. ఒకవేళ ఆల్కహాల్ తాగిన సమయాల్లో ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించడం మేలు.
టాపిక్