తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  బలిచక్రవర్తి రాకతో పదిరోజుల పాటు ఉత్సవాలు, ఓణం పండగ విశేషాలు తెలుసుకోండి

బలిచక్రవర్తి రాకతో పదిరోజుల పాటు ఉత్సవాలు, ఓణం పండగ విశేషాలు తెలుసుకోండి

Manda Vikas HT Telugu

30 December 2021, 18:02 IST

    • ఓణం కేరళలో నిర్వహించే వ్యవసాయ పండుగ. ప్రతీ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్ నెలల్లో మలయాళీలు కులమతాలకు అతీతంగా ఈ పండుగను చాలా ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకుంటారు.
Onam Festival
Onam Festival (HT Photo)

Onam Festival

ఓనమ్ (ఓణం) అనేది కేరళలో అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ. దీనిని తిరుఓణం అని కూడా పిలుస్తారు. ఇది పురాణాల్లో ఉన్న బలిచక్రవర్తి, వామనుడి కథను స్మరింపజేస్తుంది. ఈ పండుగ ఆ ప్రాంత ప్రజల సిరిసంపదల వృద్ధిని, సుఖసంతోషాలను కాంక్షించే మహాబలి రాజు తమ ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది. ఓణం కేరళలో నిర్వహించే వ్యవసాయ పండుగ. ప్రతీ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్ నెలల్లో మలయాళీలు కులమతాలకు అతీతంగా ఈ పండుగను చాలా ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకుంటారు. ఇది మలయాళ క్యాలెండర్ మొదటి నెలగా పిలిచే చింగం మాసంలో వస్తుంది. ఓనమ్ ఉత్సవాలు 10 రోజుల పాటు కొనసాగుతాయి. ప్రతి రోజుకి ఒక పేరు, విశిష్టత కలిగి ఉండి, ఏ రోజుకు ఆ రోజుకు అందుకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మొదటి రోజు అథమ్: 

తొలి రోజు వివిధ వర్ణాల పూలు, అందులో పసుపు వర్ణం పూలు ఎక్కువగా వినియోగిస్తారు. ఈ పూలతో అందంగా గుమ్మం ముందు రంగువల్లులను తీర్చిదిద్దుతారు. దీనిని పూకలం అని పిలుస్తారు. ఇక్కడ పూ అంటే పువ్వులు మరియు కలం అంటే అలంకరణ డిజైన్‌ లేదా రంగోలి అని అర్థం.

రెండో రోజు చితిర

పండుగ 2వ రోజు మొత్తం ఇంటిని ఆచారబద్ధంగా శుభ్రపరచడం కోసం కేటాయించబడింది, అలాగే తొలిరోజు పూకలం రంగవల్లికి మరో పొర పూలు అలంకరిస్తారు.

మూడో రోజు చోడి: 

ఉత్సవాలలో 3వ రోజును చోడిగా పిలుస్తారు. ఈరోజు కుటుంబం అంతా కలిసి షాపింగ్ చేస్తారు. కుటుంబంలో ఒకరికోసం ఒకరు కొత్తబట్టలు, మరియు ఆభరణాలను కొని బహుమతిగా ఇవ్వడం అనవాయితీ.

నాలుగో రోజు విశాఖ: 

వేడుకలలో 4వ రోజుగా చెప్పబడే విశాఖ అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడుతుంది. కుటుంబంలోని ప్రతి సభ్యుడు ఓనమ్ సాద్య తయారీలో ఎంతో కొంత సహకారం అందిస్తారు. ఈరోజున ఇంట్లో సుమారు 26 రకాల రుచికరమైన వంటకాలు వండుకొని భోజనం చేస్తారు. పండుగలో భాగంగా నిర్వహించే వివిధ క్రీడా పోటీలు కూడా ఈరోజు ప్రారంభమవుతాయి.

ఐదో రోజు అనిజామ్:

ఐదవ రోజున ప్రాచీనమైన వల్లంకాళి పడవ రేసు నిర్వహిస్తారు. ఇది పంబ నది ఒడ్డున ఉన్న పట్నంతిట్టలోని ఆరన్ముల అనే చిన్న పట్టణం నుండి మొదలవుతుంది.

ఆరో రోజు త్రికేత:

 ఆరవ రోజు నాటికి ఓనమ్ పండగ సందడి మరింత పెరుగుతుంది. పూకలం డిజైన్‌కు మరో 5 నుండి 6 పువ్వులు జోడిస్తారు. కుటుంబం అంతా కలిసి తమ పూర్వీకులు, పెద్దల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుతారు, బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

ఏడో రోజు మూలం: 

ప్రజలందరూ తమ బంధుమిత్రులను కలుసుకుంటారు, దీంతో పండగ సంతోషం రెట్టింపవుతుంది. చాలా చోట్ల సాంప్రదాయ ఓనమ్ సాద్య (ఓనమ్ ప్రత్యేక బఫే భోజనం) అందిస్తారు. ఈ రోజు నుండి చాలా దేవాలయాలు ప్రత్యేక సాధ్యాలను అందిస్తాయి. ఈరోజు ఉత్సవాలలో పులి కాళి (ముసుగు చిరుతపులి నృత్యం) మరియు కైకొట్టి కాళి వంటి సాంప్రదాయ నృత్యాలు కూడా వివిధ కార్యక్రమాలలో ప్రదర్శించబడతాయి.

ఎనిమిదో రోజు పూరదం: 

వేడుకల 8వ రోజున వామనుడు మరియు మహాబలి విగ్రహాలను శుద్ధి చేసి, పూకాలం మధ్యలో ఉంచుతారు. ఈ రోజు నుండి, విగ్రహాన్ని ఓనతప్పన్ అని పిలుస్తారు.

తొమ్మిదో రోజు ఉత్తరాదోడు: 

ఈరోజును ఓనమ్ సాయంత్రంగా చెప్తారు. 9వ రోజున మహాబలి రాజు రాష్ట్రానికి చేరుకుంటారని నమ్ముతారు. ఇది అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున తాజా కూరగాయలు, ఫలాలు కొనుగోలు చేయడానికి ఇది అత్యంత పవిత్రమైన రోజు.

పదో రోజు తిరువోణం: 

తిరువోణం ఈ పండుగలో చివరి రోజు. ఓనమ్ ఉత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకు చేసిన అన్ని కార్యకలాపాలు 10వ రోజు ఫలాలను అందజేస్తాయని నమ్మకం. కేరళ వ్యాప్తంగా చివరి రోజు తిరువోణం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రత్యేక విందులు, వినోదాలు, ప్రార్థనలు, సాంప్రదాయ నృత్యాలు, క్రీడా పోటీలతో అన్ని చోట్ల కోలాహలంగా ఉంటుంది.