Air Cooler Smell Fishy । కూలర్ నుంచి చేపల వాసన వస్తుందా? చల్లటి సువాసన వెదజల్లాలంటే చిట్కాలు!
05 April 2023, 15:58 IST
- Air Cooler Smell Fishy: కూలర్ల నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుంది కానీ, కొన్ని రోజులయ్యాక వచ్చే చేపల వాసన భయంకరంగా ఉంటుంది. ఈ వాసన రాకుండా ఉండాలంటే చిట్కాలు చూడండి.
Air Cooler Smell Fishy
Air Cooler Smell Fishy: వేసవిలో ఎండవేడిని తాళలేక చాలా మంది కూలర్లను అమర్చుకుంటారు. అందరికీ అందుబాటు ధరల్లో కూలర్లు లభిస్తాయి కాబట్టి ఎండాకాలం మొత్తం కూలర్ల వాడకం ఎక్కువ ఉంటుంది. కూలర్ వేసుకొని చల్లటి గాలిని ఆస్వాదిస్తుండగా, మెల్లగా చేపల వాసన రావడం ప్రారంభం అవుతుంది. ఇక ఆ వాసన గది మొత్తం చుట్టుముట్టి మీ గదిని చేపల మార్కెట్ చేసేస్తుంది.
కూలర్ల నుంచి వచ్చే ఈ ఘాటైన చేపల వాసన భరించలేం. ఈ వాసన పోగొట్టడానికి ఎన్నిసార్లు నీరు మార్చినా, ఎన్ని లీటర్ల సెంట్ పోసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీనికి పరిష్కార మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కూలర్ల నుంచి చేపల వాసన రావడానికి ప్రధాన కారణం బ్యాక్టీరియా. చల్లని గాలికోసం కూలర్లలో నీరు పోస్తాం కాబట్టి, కూలర్ వాతావరణం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. కూలర్‌కు మూడు వైపులా ఉండే గడ్డి ప్యాడ్లలో దుమ్ము,ధూళి, ఇతర మలినాలు అన్నీ చేరి అవి మురికిగా మారతాయి. దీంతో ఆ ప్యాడ్లలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియానే చేపల వాసనను ఉత్పత్తి చేస్తుంది.
కూలర్ల నుండి ఇలా చేపల వాసన రాకుండా చల్లటి గాలిని మాత్రమే ఆస్వాదించాలనుకుంటే అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చే టిప్స్ పాటిస్తే కూలర్లు చల్లటి గాలిని అందించటంతో పాటు, మంచి సువాసనను వెదజల్లుతాయి.
Get Rid of Fish Smell From Air Cooler - కూలర్ నుంచి వచ్చే చెడు వాసన పోగొట్టే చిట్కాలు
- మీ ఎయిర్ కూలర్ చెడు వాసన వస్తుంటే, కూలింగ్ ప్యాడ్‌లు, ట్యాంక్, ఎయిర్ ఫిల్టర్‌లతో సహా ప్రతి భాగాన్ని శుభ్రం చేయండి. నిమ్మరసంతో ఒక గుడ్డను తడిపి కూలర్ లోపల భాగాన్ని శుభ్రం చేయండి.
- ట్యాంక్‌లోని నీరు ప్రతి మూడు రోజులకు ఒకసారి మార్చండి. ఇది ట్యాంక్‌లో అచ్చు, బ్యాక్టీరియా, ఇతర శిలీంధ్రాలు పెరగకుండా నిరోధిస్తుంది.
- మీ ఎయిర్ కూలర్‌లో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన, శుభ్రమైన నీటిని మాత్రమే ఉపయోగించండి.
- ఎయిర్ కూలర్‌ను రోజంతా వాడి ఆఫ్ చేసే ముందు, 15 నిమిషాల పాటు నీటి పంపు వాడకుండా ఫ్యాన్-ఓన్లీ మోడ్‌లో రన్ చేయండి.
- కూలర్ ట్యాంక్‌లో కొద్దిగా వెనిగర్, ఎసెన్షియల్ ఆయిల్ కలిపి స్ప్రే చేసి ఆపై ఎయిర్ కూలర్‌ను నార్మల్‌గా రన్ చేయండి.
- కూలర్ వాడని సమయంలో కాసేపు ఎండలో గానీ, ఎండ తగిలేలా ఉంచండి. ఇది తేమను తొలగిస్తుంది, బ్యాక్టీరియా వృద్ధికి అవకాశం ఇవ్వదు.
- మామూలు గడ్డికి బదులు వట్టివేరు గడ్డిని కూలింగ్ ప్యాడ్లలో అమర్చడం ద్వారా కూలర్లు మరింత చల్లని గాలిని ఇస్తాయి, చందనం వాసనను వెదజల్లుతాయి.
DIY Air Cooler Perfume- ఇంట్లోనే కూలర్ సెంట్ తయారు చేసే విధానం
కూలర్లలో పోసేందుకు ఖరీదైన పరిమళాలు అవసరం లేదు. మీకు మీరుగా మీ ఇంట్లోనే సులభంగా పెర్ఫ్యూమ్ తయారు చేయవచ్చు. Homemade DIY Cooler Perfume ఎలా చేయడమో ఇక్కడ తెలుసుకోండి.
కూలర్ సెంట్ కోసం మీకు కావలసిన పదార్థాలు.. కొన్ని నారింజ ముక్కలు, కొన్ని గులాబీ రేకులు, కొన్ని మొగ్రా మల్లెలు.
పద్ధతి: ముందు పైన పేర్కొన్న పదార్థాలను విడివిడిగా కడిగి పెట్టుకోవాలి. ఆపైన ఒక గాజు బుడ్డి తీసుకొని వీటన్నింటినీ ఆ గాజు బుడ్డిలో నింపి ఆపై నీళ్ళు కలపాలి. అనంతరం గట్టిగా మూతపెట్టి ఒక రోజంతా ఫ్రిజ్ లో ఉంచండి. 24 గంటల తర్వాత గాజు బుడ్డీలోని నీరు మంచి సువాసన వస్తుంది. ఈ నీటిని మీరు కూలర్ పెర్ఫ్యూమ్‌గా ఉపయోగించవచ్చు.