Air Cooler Purchase Tips : ఎయిర్ కూలర్ కొంటున్నారా? ఒక్కసారి ఇది చదివి వెళ్లండి-summer 2023 here are some air cooler purchase tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Air Cooler Purchase Tips : ఎయిర్ కూలర్ కొంటున్నారా? ఒక్కసారి ఇది చదివి వెళ్లండి

Air Cooler Purchase Tips : ఎయిర్ కూలర్ కొంటున్నారా? ఒక్కసారి ఇది చదివి వెళ్లండి

HT Telugu Desk HT Telugu
Apr 03, 2023 02:00 PM IST

Summer 2023 : వేసవి ఉష్ణోగ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇంట్లో కూర్చోవడం అసాధ్యం. ఈ సమయంలో ఎయిర్ కూలర్ ఉత్తమ ఎంపిక. ఎయిర్ కూలర్ కొనే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఎయిర్ కూలర్ ఎంపిక ఎలా చేయాలి? ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

ఎయిర్ కూలర్
ఎయిర్ కూలర్

ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. విపరీతమైన వేడితో ఇంట్లో కూర్చోవడం కష్టమే. ఇంట్లో ఫ్యాన్ పెట్టుకుని కూర్చుంటే కాసేపటికి చల్లగాలి, వేడిగాలి రావడం మొదలవుతుంది. దీంతో విసుగువస్తుంది. ఎయిర్ కూలర్(Air Cooler) నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుంది. ఎయిర్ కండీషనర్ (AC)ని అమర్చడం అందరికీ సాధ్యం కాదు. ఇది ఖరీదైనది. దిగువ, మధ్య తరగతి వారికి ఇది ఒక కల. అందుకే మీరు ఎయిర్ కూలర్‌ను ఎంచుకోవచ్చు. ఇది బడ్జెట్‌కు అనుకూలమైనది. వేసవి వేడి నుంచి చల్లగా ఉండొచ్చు.

వేసవి(Summer)లో ఇంటికి ఎయిర్ కూలర్ ఉత్తమ ఎంపిక. ఇది ఇంటి లోపల, ఆరుబయట ఉంచవచ్చు. దీని నిర్వహణ కూడా సులభం. వాటర్ కూల్డ్ కూలర్లు తాజా, చల్లని గాలిని అందిస్తాయి. పర్యావరణ అనుకూలమైనవి కూడా. కాబట్టి ఎయిర్ కూలర్ ఎంపిక ఎలా ఉండాలి? ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి.

వివిధ రకాల ఎయిర్ కూలర్లు

మార్కెట్‌లో మొత్తం నాలుగు రకాల ఎయిర్ కూలర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి బడ్జెట్‌కు అనుకూలమైనవి. తక్కువ విద్యుత్‌(Power) సరిపోతుంది. కరెంటు బిల్లు(Current Bill) పెరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నాలుగింటిలో మీ ఎంపికను బట్టి మీరు కూలర్‌ను కొనుగోలు చేయవచ్చు.

వ్యక్తిగత కూలర్

సాధారణంగా ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయవచ్చు. ఒకవైపు నుంచి మరో వైపుకు సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇది తాజా, చల్లని గాలిని అందిస్తుంది. ఉక్కపోతను తగ్గిస్తుంది. ఇది చిన్న గదిలో మాత్రమే ఉపయోగించేందుకు వీలుగా తయారు చేశారు.

టవర్ కూలర్

మీరు హాల్ వంటి పెద్ద స్థలం కోసం కూలర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, టవర్ కూలర్ ఉత్తమ ఎంపిక. ఇది తక్కువ సమయంలో పెద్ద స్థలాన్ని చల్లబరుస్తుంది. ఇది మీడియం గదులకు కూడా అనుగుణంగా తయారు అయింది.

విండో కూలర్

ఇది సాధారణంగా ఇళ్లు, కార్యాలయాల్లో కనిపిస్తుంది. కిటికీ దగ్గర ఉంచినందున దీనిని విండో కూలర్ అంటారు. ఇది కాస్త ఖరీదైనా మెయింటెయిన్ చేయడం సులభం. కరెంటు ఆదా కావడం ఇందులోని మరో ప్లస్ పాయింట్.

ఎడారి కూలర్

ఇది ఎక్కువగా అధిక ఉష్ణోగ్రత, తక్కువ తేమ ఉన్న ప్రదేశాల కోసం రూపొందించారు. ఈ ఎయిర్ కూలర్లు నీటిలోని వేడిని ఆవిరి చేసి చల్లటి గాలిని బయటకు పంపుతాయి. ఇది పెద్ద స్థలాన్ని సులభంగా చల్లబరుస్తుంది.

ఉత్తమ ఎయిర్ కూలర్‌ను ఎలా ఎంచుకోవాలి?

మీ ఇల్లు లేదా ఆఫీసు కోసం ఎయిర్ కూలర్‌ను ఎంచుకునే ముందు, కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోండి. గది వెడల్పు, గది ఎత్తు, గది తేమ, నీటి సామర్థ్యం, ​​తేమ వంటివన్నీ కూలర్ ను ఏ ప్రదేశంలో ఉంచాలనేది ముఖ్యం. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మీ అవసరాలకు సరిపోయే కూలర్‌ను ఎంచుకోండి.

నీటి సామర్థ్యం ఎంత ఉండాలి?

ఎయిర్ కూలర్‌ను ఎంచుకునే ముందు మీరు పరిగణించవలసిన ముఖ్యమైన అంశం నీటి సామర్థ్యం. 30 నుంచి 40 లీటర్ల సామర్థ్యం ఉన్న కూలర్‌ను పెద్ద గదిలో ఉంచాలనే ఉద్దేశ్యంతో కొనుగోలు చేస్తే మంచిది. గది విస్తీర్ణం చిన్నగా ఉంటే, 20 లీటర్లు ఉత్తమం.

ఎయిర్ కూలర్‌లో ఏం ఉండాలి?

సాధారణమైన వాటిలో కొన్ని తక్కువ విద్యుత్ వినియోగం, అధిక నాణ్యత కూలింగ్ ప్యాడ్‌లు, నాయిస్ ఫిల్టర్, రిమోట్ కంట్రోల్‌తో ఇన్వర్టర్ అనుకూలత, సెల్ఫ్ ఫిల్లింగ్ లేదా ఆటో-ఫిల్ ఫంక్షన్, యాంటీ మస్కిటో, డస్ట్ ఫిల్టర్, ఎక్స్‌ట్రా ఐస్ ఛాంబర్ చూసుకోవాలి. వివిధ ఎంపికల ప్రకారం ధర ఉంటుంది. రూ.3000 నుండి రూ.5000 ధరల్లో దొరుకుతాయి.

Whats_app_banner