Cool Your Eyes | మీ కళ్లు చల్లబడాలంటే ఇలా చేయండి!
06 April 2023, 10:15 IST
- Cool Your Eyes: వేసవిలో అధిక వేడి, పెరిగిన స్క్రీన్ టైమ్ కారణంగా మీ కళ్లు అలసిపోతే ఈ చిట్కాలతో చల్లబరచండి, కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందండి.
Cool Your Eyes
Cool Your Eyes: ఒక్కోసారి కళ్లు చాలా అలసిపోయినట్లుగా, భారంగా అనిపిస్తాయి. సుదీర్ఘమైన స్క్రీన్ టైమ్, సరైన నిద్ర లేకపోవడం వలన ఈ పరిస్థితి తలెత్తుతుంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో నిరంతరంగా పెరిగే ఉష్ణోగ్రతలు కంటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. బయటకు వెళ్తే ఎండవేడి, లోపల ఫ్యాన్లు, ఎయిర్ కండిషనింగ్‌లతో కళ్లలోని కన్నీళ్లు ఆవిరై పొడికళ్లు (Dry Eyes) ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ సమయంలో కళ్లు కాంతిని చూసినపుడు సున్నితత్వానికి లోనవుతాయి. కళ్లు ఎర్రగా మారి మండుతాయి. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కళ్లు మూసుకొని విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది, కానీ అది సరిపోదు. మండుతున్న కళ్లను శాంతపరిచేందుకు చల్లగా ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది.
Tips to Cooldown Your Tired Eyes- కళ్లను చల్లబరిచే చిట్కాలు
మీ కళ్లు చల్లబడాలంటే ఇక్కడ కొన్ని చిట్కాలు అందిస్తున్నాం. వీటిని అనుసరించడం మీరు చల్లని అనుభూతి పొందుతారు, ఇంత అద్భుతమైన చిట్కాలు అందించినందుకు ధన్యవాదాలు కూడా చెప్తారు. ఇంకా ఆలస్యం ఎందుకు ఆ చిట్కాలేమిటో తెలుసుకోండి మరి.
చల్లని స్పూన్ చిట్కా
ఇది చాలా ప్రసిద్ధమైన చిట్కా. మీరు రెండు టీస్పూన్లు తీసుకొని వాటిని ఒక 10 నిమిషాల పాటు ఫ్రీజర్‌లో ఉంచండి. ఆపైన చల్లగా మారిన ఆ స్పూన్లను బయటకు తీసి మీ కళ్లపై ఉంచండి. మీరు కళ్లుమూసికొని బోలుగా ఉన్నవైపు స్పూన్ ఉంచండి. ఈ చెంచా చిట్కా మీ కళ్లకు చల్లటి అనుభూతిని అందిస్తుంది. చెంచాలోని చల్లదనం మీ కళ్లవద్ద చర్మాన్ని బిగుతుగా చేస్తుంది, రక్త నాళాలను సంకోచింజేస్తుంది, మీ కళ్లలో ఉబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఐస్ క్యూబ్స్
ఐస్ క్యూబ్స్ ఫార్ములా మీ కళ్లమంటను తగ్గిస్తుంది, ఉబ్బిన కళ్లను మామూలు స్థితికి తేవడంలో కూడా పనిచేస్తుంది. అయితే ఐస్ ముక్కలను నేరుగా కళ్లపై వర్తించవద్దు. ఈ ఐస్ క్యూబ్‌లను ఒక రుమాలులో చుట్టి, ఆపై కళ్లపై సున్నితంగా మర్ధన చేయండి. మీకు బాగా అనిపించే వరకు దీన్ని పునరావృతం చేయండి.
చల్లని పాలు
పంచమి రోజున మీరు పాలతో కళ్లు కడిగించుకోవడం గుర్తుందా? అదే చిట్కాను మీ కళ్లను శాంతింపజేస్తుంది. పాలలో అమైనో ఆమ్లాలు, లాక్టిక్ ఆమ్లాలు, కాల్షియంతో వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి పాలు మీ కళ్ళను చల్లబరచడానికి ఉపయోగించవచ్చు. కొంచెం దూదిని పాలలో వేసి నానబెట్టండి, ఆపై ఫ్రిజ్‌లో 15 నిమిషాలు ఉంచి చల్లబరచండి. అనంతరం పాలలో నానబెట్టిన చల్లని దూది తీసి మీ కళ్ళపై 15 నిమిషాల పాటు ఉంచుకోండి. ఈ రెమెడీ కేవలం కంటినొప్పి, కళ్లమంట, కంటి ఉబ్బరం మీద పనిచేయడమే కాకుండా నల్లటి వలయాలను లేత రంగులోకి మార్చడంలో కూడా సహాయపడుతుంది.
దోసకాయ ముక్కలు
దోసకాయ సహజంగానే చలువ గుణాలను కలిగి ఉంటుంది. అదనంగా ఇందులో విటమిన్ సి, కెఫిక్ యాసిడ్ వంటి పోషక మూలకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయపడతాయి, నల్లటి వలయాలను కాంతివంతం చేయడంలో కూడా సహాయపడతాయి. దోసకాయను గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకొని, వాటిని మీ కళ్లపై 10 నిమిషాలు ఉంచుకోండి. కళ్లుమూసుకొని, హాయిగా విరామం తీసుకోండి. ఈ వేసవిలో రోజుకు ఒకటి, రెండు సార్లు దోసకాయ ముక్కలను మీ కళ్లపై ఉంచుకోండి.
కలబంద జెల్
తాజాగా తీసిన అలోవెరా జెల్‌ను మీ కనురెప్పలపై, కళ్ల కింద అప్లై చేసి 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇది కంటి మంటను నయం చేస్తుంది, కళ్లకు ఉపశమనం కలిగిస్తుంది. కళ్ల కింద వాపు (Eye Puffiness) ను తగ్గిస్తుంది , కంటి ప్రాంతం చుట్టూ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
టొమాటో గుజ్జు
టొమాటో గుజ్జును మీ కనురెప్పల మీద , మీ కళ్ల కింద రాయండి. ఆపై మసాజ్ చేయడానికి శుభ్రమైన ఐ-రోలర్‌ను సున్నితంగా ఉపయోగించండి. ఇది మీ కళ్ళకు కలిగే ఒత్తిడిని తగ్గిస్తుంది, నల్లటి వలయాలను (Dark Circles) తొలగిస్తుంది. టొమాటోలు అనామ్లజనకాలు, లైకోపీన్ సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. చర్మ సంరక్షణకు చాలా ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
టీబ్యాగ్స్
టీబ్యాగ్‌లలో సహజమైన టానిన్‌లతో కూడిన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగాఅ ఉంటాయి. ఇవి కళ్లకింద వాపును తగ్గించడంలో తక్షణమే పని చేస్తాయి. రెండు నానబెట్టిన టీ బ్యాగ్‌లను 15 నిమిషాలు ఫ్రీజర్‌లో ఉంచి, ఆపై వాటిని మీ కళ్లపై కాసేపు ఉంచండి. మీ కళ్లకు మంచి ఉపశమనం లభిస్తుంది.
మీ కళ్ళు అలసిపోయినట్లుగా అనిపించినపుడు, పనిచేస్తూ ఎక్కువ స్క్రీన్ సమయం కలిగి ఉన్నప్పుడు లేదా మైగ్రేన్‌ల (Migraine) కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు మీకు తరచుగా అనిపిస్తే, ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి. ఇవి మీ కళ్ళకు ఉపశమనం కలిగించడంలో అద్భుతాలు చేస్తాయి. కళ్ల వాపును తగ్గించడంలో, నల్లటి వలయాలని తొలగించడంలో కూడా సహాయపడతాయి. కాబట్టి పైన పేర్కొన్న అన్ని చిట్కాలను పరిశీలించి, మీకు ఏది బాగా సరిపోతుందో దానిని ప్రయత్నించండి.