Perfumes | పర్ఫ్యూమ్, అత్తరుకు మధ్య తేడాలేంటి? వీటిని ఎలా స్ప్రే చేయాలి? -know the difference between perfume cologne and attar ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know The Difference Between Perfume, Cologne And Attar

Perfumes | పర్ఫ్యూమ్, అత్తరుకు మధ్య తేడాలేంటి? వీటిని ఎలా స్ప్రే చేయాలి?

Manda Vikas HT Telugu
Dec 28, 2021 02:37 PM IST

మీకు తెలుసా? పర్ఫ్యూమ్‌ల ఘాడతను బట్టి వివిధ పేర్లతో వర్గీకరిస్తారు. అందులో ఎంత సాంద్రత కూడిన పరిమళం ఉందనే దానిని బట్టి వాటి సువాసన ప్రభావితం అవుతాయి. అలా వివిధ రకాల ఫ్లేవర్స్ ఏర్పడుతాయి, అందుకు తగినట్లుగా ధరలు కూడా మారతాయి.

Perfumes- Representational Image
Perfumes- Representational Image (Shutterstock)

మంచి పర్ఫ్యూమ్‌ను ఎంచుకోవడం కొన్ని సార్లు చాలా కష్టమైన పనే. మార్కెట్లో ఎన్నో రకాల పరిమళభరితమైన ద్రవాలు, వైవిధ్యమైన సుగంధాలు మనల్ని మైమరింపజేస్తాయి. అందులో ఏది ఎంచుకోవాలనే దానిపై ఒక స్పష్టతకు అంత త్వరగా రాలేం. ఒక్కోసారి ఏదో ఒక పర్ఫ్యూమ్‌ని ఎంచుకోవాలని నిర్ణయించుకోవాలనుకున్నప్పటికీ అందులోనూ మళ్లీ ఎన్నో ఫ్లేవర్స్ ఉంటాయి. కొందరికీ తేలికైన సువాసన కలిగే పర్ఫ్యూమ్‌ కావాలనుకుంటే, మరికొందరు ఘాడమైన సెంట్ చల్లుకొని తాము అందరి కంటే డిఫెరెంట్ అనిపించుకుంటారు. మరి పర్ఫ్యూమ్‌లలో ఏది ఎక్కువ సువాసన వెదజల్లుతుంది, ఏది తక్కువ సువాసన కలిగి ఉంటుందో ఎలా తెలుసుకోవచ్చు? అంటే అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకుంటే మీ అభిరుచికి తగిన పర్ఫ్యూమ్ ఎంచుకోవచ్చు.

మీకు తెలుసా? పర్ఫ్యూమ్‌లను వాటి ఘాడతను బట్టి వివిధ పేర్లతో వర్గీకరిస్తారు. అందులో ఎంత సాంద్రత కూడిన పరిమళం ఉందనే దాని ప్రకారం వాటి సువాసన ప్రభావితం అవుతాయి, అలా వివిధ రకాల ఫ్లేవర్స్ ఏర్పడుతాయి, అందుకు తగినట్లుగా ధరలు కూడా మారుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే వైన్ షాప్ లో స్పిరిట్స్‌ని ఎలా వర్గీకరిస్తారో, పర్ఫ్యూమ్స్ కూడా అదే విధంగా విభజిస్తారు. 

ఇలా ఘాడత ఆధారంగా పర్ఫ్యూమ్‌లను 5 కేటగిరీలుగా వర్గీకరించారు.

పర్ఫ్యూమ్: 

20 నుంచి 30% ఘాడతతో ఆల్కహాల్ ఆధారితమైంది. దీని పరిమళం 24 గంటల వరకు నిలిచి ఉంటుంది.

యూ డి పర్ఫ్యూమ్ (Eau de Perfume): 

15 నుంచి 25% ఘాడత కలిగి ఆల్కాహాల్+ నీరు ఆధారితమైంది. దీని పరిమళం 6-8 గంటల వరకు నిలిచి ఉంటుంది

యూ డి టాయిలెటె (Eau de Toilette): 

5 నుంచి 15% ఘాడత కలిగి ఆల్కాహాల్+ నీరు ఆధారితమైంది. దీని పరిమళం 2-4 గంటల వరకు నిలిచి ఉంటుంది

యూ డి కొలోన్ (Eau de Cologne): 

2 నుంచి 4% ఘాడత కలిగి ఆల్కాహాల్+ నీరు ఆధారితమైంది. దీని పరిమళం సుమారు 2 గంటల వరకు నిలిచి ఉంటుంది

యూ ఫ్రాచై (Eau Fraiche): 

1 నుంచి 3% ఘాడత కలిగి ఆల్కాహాల్+ నీరు ఆధారితమైంది. దీని పరిమళం సుమారు 1 గంట పాటు నిలిచి ఉంటుంది.

పైన పేర్కొన్నవన్నీ బట్టలపై లేదా శరీరంపై 'స్ప్రే' చేసుకోవటానికి అనువైనవే. వీటితో పాటు సుగంధనూనెలు 20 శాతం ఘాడతను కలిగి ఉంటాయి, ఈ సుగంధ నూనెలతో తయారుచేసే అత్తరు లేదా ఇత్రా 100 శాతం ఘాడతను కలిగి ఉంటాయి. ఈ అత్తరును స్ప్రే చేయడం గానీ, చల్లుకోవడం చేయకూడదు, బదులుగా ఒక పుల్లతో అద్దుకోవడం చేయాలి. ఈ అత్తరు ఘాడత ఎక్కువ కాబట్టి ఒకరోజు నుంచి చాలా కాలం పాటు దీని పరిమళం నిలిచిఉంటుంది.

ప్రదేశాన్ని బట్టి అత్తరు లేదా దాని తేలికపాటి వెర్షన్ అయిన పర్ఫ్యూమ్‌ని వినియోగించాల్సి ఉంటుంది. వెచ్చని వాతావరణంలో, వేడి ప్రదేశాలలో ఘాడత ఎక్కువ కలిగిన పరిమళాలను వినియోగించాలి. అదేవిధంగా చల్లని, శీతల ప్రదేశాలలో ఘాడత తక్కువ కలిగిన పరిమళాలను ఎంచుకోవాలి.

పర్ఫ్యూమ్ శరీరంపై ఏయే భాగాల్లో చల్లుకోవాలి?

పర్ఫ్యూమ్‌లను శరీరంలోని పల్స్ పాయింట్స్ అని పిలిచే మెడ, మణికట్టు, మోకాలి వెనుక, గజ్జల్లో, మోచేయి లోపల, చీలమండల వెనుక, పాదాల వద్ద, ఉదరంపై చల్లుకోవడం లేదా అద్దుకోవడం చేస్తే ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. అలాగే బట్టలపై పర్ఫ్యూమ్‌లను అప్లై చేయడం వల్ల అవి పరిమళాన్ని బాగా శోషించుకొని ఎక్కువసేపు తాజాదనాన్ని వెదజల్లుతాయి.

 

WhatsApp channel

సంబంధిత కథనం