Spinach Dosa । పాలకూర దోశ.. చలికాలంలో ఇలాంటి ఒక అల్పాహారం అమృతం!
21 November 2022, 8:11 IST
- శీతాకాలంలో ఆకుకూరలు తాజాగా లభిస్తాయి, ఆకుకూరలతో అల్పాహారం చేసేయండి. పాలకూరతో దోశ చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ Spinach Dosa Recipe ఉంది చూడండి.
Spinach Dosa Recipe
శీతాకాలం వచ్చేసింది, ఇప్పుడు మార్కెట్‌లలో కూరగాయలన్నీ చాలా తాజాగా లభిస్తాయి. మంచి పోషక విలువలతో కూడిన ఆకుకూరలు, కాయగూరలు అందుబాటులో ఉంటాయి. పాలకూర, మెంతికూర, బఠానీలు వంటివి చలికాలంలో ఎక్కువగా లభిస్తాయి. ఈ సీజన్ లో వండే కూరలు, వంటలు కూడా ఎంతో రుచిగా ఉంటాయి. మరి ఈ సీజన్ మొత్తం రోజుకొకటి వండుకుంటూ ఆరోగ్యకరమైన భోజనాన్ని ఆస్వాదించడం ఎందుకు చేయకూడదు.
శీతాకాలంలో మనకు పాలకూర తాజాగా లభిస్తుంది. ఈ సీజన్‌లో మనం తప్పకుండా తినాల్సిన ఆకుకూర ఇది. గొప్ప రుచితో పాటు, పుష్కలమైన పోషకాలను కలిగి ఉంటుంది. పాలకూరలో వివిధ యాంటీఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్ సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి గుండె జబ్బుల నుండి రక్షణనిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఇన్ల్ఫమేషన్ గుణాలు ఉన్నాయి. పాలకూరలో కొవ్వు తక్కువగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇంకా డైటరీ ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్లు A, C, E, K సమృద్ధిగా పాలకూరలో లభిస్తాయి. అందువల్ల శీతాకాలంలో పాలకూర ఒక సూపర్ ఫుడ్.
పాలకూరను మనం ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. పాలకూర కూర, పాలకూర పప్పు, పాలక్ పనీర్, పాలక్ సాగ్, పాలక్ పరాఠా, పాలక్ ఆమ్లెట్ ఇలా ఎన్నో రకాలుగా వండుకొని తినవచ్చు. మరి మీరెపుడైనా పాలక్ దోశ చేసుకున్నారా? పాలక్ దోశ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం, మీరు కూడా అల్పాహారంగా ఈ రెసిపీని తప్పకుండా ప్రయత్నించండి.
2 కప్పులు పాలకూర
2 పచ్చి మిరపకాయలు
చిన్న అల్లం ముక్క
1/4 టీస్పూన్ పసుపు పొడి
4 టేబుల్ స్పూన్లు నెయ్యి లేదా నూనె
పాలకూర దోశ (Palak Dosa) తయారీ విధానం
- ముందుగా ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీరు వేడి చేయండి, అందులో పసుపువేసి మరిగించండి.
- నీరు మరగడం ప్రారంభమైనపుడు అందులో శుభ్రంగా కడిగిన పాలకూర, పచ్చిమిర్చి, అల్లం వేసి 3-4 నిమిషాలు ఉడికించి, ఆపై మంటను ఆపివేయండి.
- ఇప్పుడు నీటిని ఫిల్టర్ చేసి పాలకూరను చల్లారనివ్వాలి. అనంతరం ఉడికించిన పాలకూర, పచ్చిమిర్చి, అల్లంను మెత్తని పేస్టులాగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు ఈ పేస్టును దోశ బ్యాటర్ లో వేసి బాగా కలిపాలి.
- తవాను వేడి చేసి 1/2 టీస్పూన్ నెయ్యి మరిగించి, దోశను విస్తరించాలి. లేత గోధుమ రంగు వచ్చేంతవరకు రోస్ట్ చేసుకోవాలి.
అంతే, పాలక్ దోశ రెడీ. మీకు నచ్చిన చట్నీతో అద్దుకొని, పాలకూర దోశ రుచిని ఆస్వాదించండి.