Mixed Dal Dosa Recipe। ఫిక్స్ అయిపోండి, మిక్స్‌డ్ దాల్ దోశనే ఆరోగ్యానికి మంచిది!
31 October 2022, 8:13 IST
- ఎప్పుడూ తినే దోశలాగా కాకుండా మరింత ఆరోగ్యకరమైన, రుచికరమైన దోశ చేసుకోవాలనుకుంటే మిక్స్‌డ్ దాల్ దోశ (Mixed Dal Dosa) చేసుకోవచ్చు. ఈ Adai Dosa రెసిపీని ఇక్కడ చూడండి.
Mixed Dal Dosa
దోశలు మనందరికీ ఇష్టమైన అల్పాహారమే. అయితే దోశలను బియ్యం పిండితో చేయడం వలన అందులో కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. అలాకాకుండా ప్రోటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే పప్పులు, కాయధాన్యాలు కలిపి చేసుకుంటే ఆ అల్పాహారం ఎంతో బలవర్థకమైనది, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు 3-4 పప్పుల మిశ్రమంతో రుచికరంగా మిక్స్‌డ్ దాల్ దోశ (Mixed Dal Dosa) చేసుకోవచ్చు.
మిక్స్‌డ్ దాల్ దోశను అడై దోశ (Adai Dosa) అని కూడా అంటారు. దక్షిణ భారతదేశంలో ఇది చాలా పాపులర్ రెసిపీ కూడా. మిక్స్‌డ్ దాల్ దోశ చూడటానికి సెట్ దోశలాగా, మందపాటి అట్టులాగా ఉంటుంది. మీరు కావాలంటే సన్నగా కూడా చేసుకోవచ్చు. మరింత రుచిగా, ఆరోగ్యకరంగా చేయడానికి ఇందులో క్యారెట్, క్యాబేజీ, పాలకూర, పచ్చిబఠానీలు మొదలైన వాటిని కలుపుకోవచ్చు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు మిక్స్‌డ్ దాల్ దోశకు కావలసిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
Mixed Dal Dosa Recipe కోసం కావలసినవి
- 1.5 కప్పు బియ్యం
- 1/4 కప్పు పెసరి పప్పు
- 1/4 కప్పు కందిపప్పు
- 1/4 కప్పు మినుపపప్పు
- 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు
- 1/3 టీస్పూన్ పసుపు పొడి
- 1.5 అంగుళాల అల్లం
- 5 ఎండు మిరపకాయలు
- 3 పచ్చిమిర్చి
- 1/2 కప్పు తాజా కొత్తిమీర
- కరివేపాకు
- రుచికి తగినంత ఉప్పు
- 1/4 కప్పు నూనె
మిక్స్‌డ్ దాల్ దోశ రెసిపీ- తయారీ విధానం
- పైన పేర్కొన్న బియ్యం, పప్పులు కలిపి 3-4 గంటలు నానబెట్టండి.
- నానబెట్టిన బియ్యం, పప్పులను మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకుల వేసి, కొన్ని నీళ్లుపోసి మందపాటి పేస్ట్ చేయండి.
- ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఉప్పు, పసుపు, ఇంగువ, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు మూత పెట్టి 3-4 గంటలు పక్కన పెట్టండి, మీరు దీన్ని తక్షణమే తయారు చేసుకోవచ్చు కానీ కొద్దిసేపు పక్కనపెట్టేస్తే దోశ ఇంకా బాగుంటుంది.
- ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ వేడి చేసి, దాని మీద కొద్దిగా నూనె పోసి దోశ వేసుకోండి.
- దోశ సన్నంగా కాకుండా మందంగా ఉంచుకోవాలి, దానికి రంధ్రాలు చేసి నూనె లేదా వెన్న వేసి మీడియం వేడి మీద ఉడికించాలి.
- రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేంతవరకు దోశ కాల్చుకోవాలి.
అంతే మిక్స్‌డ్ దాల్ దోశ రెడీ, దీనిని వేడివేడిగా కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ, సాంబార్ లేదా రసంతో సర్వ్ చేసుకోవచ్చు.