Coffee Brewing Tips । ఒక కప్పు చిక్కటి కాఫీని చక్కగా, ఆరోగ్యకరంగా ఇలా తయారు చేయండి!
26 February 2023, 9:13 IST
- Coffee Brewing Tips: కాఫీ అంటే మీలో చాలా మందికి ఇష్టమైన పానీయం. అయితే క్వాలిటీ కూడా ముఖ్యమై. ఆరోగ్యకరంగా కాఫీని ఎలా చేయాలి, రోజుకి ఎన్ని కప్పుల కాఫీ తాగాలి ఇక్కడ తెలుసుకోండి.
Coffee Brewing Tips
ఉదయాన్నే ఒక కప్పు కాఫీ లేనిదే చాలామందికి తమ దినచర్య ప్రారంభం కాదు. వేడివేడిగా మంచి సువాసనతో ఘుమఘుమలాడే రుచికరమైన ఒక కప్పు కాఫీ తాగగానే వారిలో ఒక ఉత్తేజం వస్తుంది, దానితో సంతృప్తి కలుగుతుంది. మీకు కూడా అంతేనా? ఈ కాఫీ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. కోట్ల మంది ప్రజలు తమ దినచర్యను ఒక కప్పు కాఫీతో ప్రారంభిస్తారు.
కాఫీ తాగడం మంచిదే అయినప్పటికీ అందులో కలిపే కృత్రిమ ఫ్లేవర్లు, కృత్రిమ సువాసనలు, అదనపు చక్కెరల వలన కాఫీ దాని సహజత్వాన్ని కోల్పోతుంది. ఇలాంటి కాఫీ తాగితే మాత్రం అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాలను కలిగిస్తుంది.
Coffee Brewing Tips- ఆరోగ్యకరమైన కాఫీ చేయడంలో చిట్కాలు
మీ కాఫీ రుచి, సువాసనలో ఎలాంటి మార్పులు చేయకుండా దానిని సూపర్ హెల్తీ డ్రింక్‌గా కూడా చేయవచ్చు. మీరు రోజూ ఇలాంటి కాఫీని తాగడం మీ ఆరోగ్యానికి మంచిది. మరి మీ కాఫీని మరింత ఆరోగ్యకరమైనదిగా, పోషకమైనదిగా ఎలా చేయవచ్చో ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.
నాణ్యత ముఖ్యం
మీరు తాగే కాఫీని నాణ్యమైన కాఫీ గింజలతో తయారు చేసినది అయి ఉండాలి. కాఫీ గింజల నాణ్యత చాలా ముఖ్యం, ఎందుకంటే చౌకైన బీన్స్ ఎక్కువ మలినాలను, టాక్సిన్‌లను కలిగి ఉంటాయి. బదులుగా ఆర్గానిక్, ఫెయిర్-ట్రేడ్, సింగిల్-ఆరిజిన్ కాఫీ గింజలను ఎంచుకోండి. ఇవి అధిక నాణ్యతను, మరింత స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి.
డార్క్ రోస్ట్‌ని ఎంచుకోండి
డార్క్ రోస్ట్ కాఫీలో తేలికపాటి రోస్ట్‌ల కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇది ఆరోగ్యకరమైన ఎంపిక. ఇది మంచి రుచి, సువాసనను కూడా కలిగి ఉంటుంది.
చక్కెర వద్దు
మీరు కాఫీని చక్కెర లేకుండా తాగటం ఆరోగ్యకరం. మీకు అంతగా కావాలనుకుంటే చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లకు బదులు, తేనె, మాపుల్ సిరప్ లేదా స్టెవియా వంటి సహజ స్వీటెనర్లను కలుపుకోవచ్చు. ఇవి మీకు కృత్రిమ చక్కెరల్లోని హానికరమైన ప్రభావాలు లేకుండా తీపి రుచిని అందిస్తాయి.
క్రీమ్, షుగర్ కలపడం వల్ల మీ కాఫీ రుచి పెరుగుతుంది, ఇది మీశరీరంలో అనవసరమైన కేలరీలు, కొవ్వును పెంచవచ్చు. అందువల్ల మీ కాఫీని బ్లాక్‌గా (Black Coffee) తాగడం ఆరోగ్యకరమైన ఎంపిక.
పాలు కలపకండి
పాలు లేకుండా కాఫీ తాగడం మేలు. అయితే పాలు కచ్చితంగా కలపాలని మీరు భావిస్తే ఆవు పాలు, గేదె పాలు వంటి డెయిరీ పాలకు బదులుగా పూర్తిగా శాకాహార పాలు ఉపయోగించండి. నట్ మిల్క్ లేదా కొబ్బరి పాలతో కాఫీ చేసుకోవచ్చు. డెయిరీ పాలలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది, ఇది గుండె జబ్బులకు దోహదం చేస్తుంది. కాబట్టి కొవ్వు , కేలరీలు తక్కువగా ఉండే బాదం పాలు, సోయా పాలు లేదా కొబ్బరి పాలతో కాఫీ చేసుకొని చూడండి.
ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క
దాల్చినచెక్క అనేది సహజమైన మసాలా, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, వాపును తగ్గిస్తుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మీ కాఫీ రుచి, ఆరోగ్య ప్రయోజనాలు పెంచడం కోసం మీ కాఫీ పైన కొంచెం దాల్చిన చెక్క పొడిని చల్లుకోండి.
- కొల్లాజెన్ పౌడర్ అనేది చర్మ ఆరోగ్యం, కీళ్ల పనితీరు, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక ప్రసిద్ధ సప్లిమెంట్. అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం మీ కాఫీలో కొంత కొల్లాజెన్ పౌడర్‌ను కలుపుకోవచ్చు.
పరిమితంగా తాగండి
మీకు కాఫీ ఎంత ఇష్టమైనప్పటికీ అది మితంగా తాగినప్పుడే ప్రయోజనకరంగా ఉంటుంది. కాఫీ అధిక వినియోగం వలన ఆందోళన, నిద్రలేమి, జీర్ణ సమస్యల వంటి దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. రోజుకు 3-4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగవద్దు.