Walnut Milk । వాల్‌నట్ పాలు తాగితే.. చాలా ప్రయోజనాలు, మీకు మీరుగా ఈ మిల్క్ తయారు చేసుకోండి ఇలా!
Walnut Milk Health Benefits: డెయిరీ పాలు తాగటం ఇష్టం లేకపోతే పూర్తిగా శాకాహారమైన వాల్‌నట్ పాలు తాగవచ్చు. అంతేకాదు ఈ పాలను మీకు మీరుగా సొంతంగా తయారు చేసుకోవచ్చు, ప్రయోజనాలు చూడండి.
ఈ రోజుల్లో ప్రజలు కొంతమంది ప్రజలు పూర్తి శాకాహారిగా మారుతున్నారు. వారి తినే ఆహారంలో ఏ విధమైన జంతు ఉత్పత్తులు లేకుండా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా పాలు, పాల సంబంధిత పదార్థాల వినియోగంలో కూడా మొక్కల ఆధారిత ఉత్పత్తులనే ఎంచుకుంటున్నారు. బాదాం పాలు, వాల్‌నట్ పాలు, టోఫు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటున్నారు.
వాల్‌నట్ అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉన్న డ్రై ఫ్రూట్. ఈ వాల్‌నట్ పాలు కూడా మనం ప్రతిరోజూ ఉపయోగించే డెయిరీ పాలకు పూర్తి శాకాహార ప్రత్యామ్నాయం. లాక్టోస్ అసహనం కలిగిన వారు, సంపూర్ణ శాకాహారిగా మారిన వారు వాల్‌నట్ పాలను ఎంచుకుంటున్నారు.
వాల్‌నట్ పాలు తీసుకోవడం వలన కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. వాల్‌నట్ మిల్క్ తో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకునేముందు అసలు ఈ పాలు ఎలా తయారవుతాయో తెలుసుకుందాం.
How To Make Walnut Milk- వాల్‌నట్ పాలు ఎలా తయారు చేయవచ్చు
వాల్‌నట్ పాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ, మీ ఇంట్లో మీకు మీరుగా సొంతంగా తయారు చేసుకోవచ్చు. వాల్‌నట్ మిల్క్ తయారీకి కేవలం రెండే రెండు పదార్థాలు అవసరం. ఒకటి వాల్‌నట్లు, రెండోది మంచి నీరు.
కొన్ని వాల్‌నట్లను తీసుకొని పొట్టు ఒలిచి 48 గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. అనంతరం నీటిని పూర్తిగా వడకట్టి ఒక గ్రైండర్లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇందులో అవసరం అయినమేరకు నీరు పోసుకొని బ్లెండర్లో బాగా బ్లెండ్ చేస్తే చక్కటి చిక్కటి ద్రావణం తయారవుతుంది. ఇదే వాల్‌నట్ మిల్క్, మీరు ఈ పాలను డెయిరీ పాలు ఉపయోగించినట్లు ఉపయోగించవచ్చు. మరింత చిక్కటి టెక్చర్ కోసం వివిధ పద్ధతుల్లో ఈ పాలను తయారు చేస్తారు.
Walnut Milk Health Benefits - వాల్‌నట్ పాలతో ప్రయోజనాలు
వాల్‌నట్ మిల్క్ తో ఎంలాటి ప్రయోజనాలు ఉన్నాయో, కొన్నింటిని ఇక్కడ తెలుసుకుందాం.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం
మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అసంతృప్త ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అవసరం. మన శరీరాలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను సొంతంగా ఉత్పత్తి చేసుకోలేవు. వాల్‌నట్లలో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అవసరమైన పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (PUFAs) కలిగి ఉన్న వాల్‌నట్ పాలను ఆహారంలో తీసుకోవడం ద్వారా ఈ పోషకాలు లభిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం
శరీరంలోని ఫ్రీ రాడికల్స్, అస్థిర అణువులు మన కణాలకు హాని చేస్తాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తాయి. యాంటీఆక్సిడెంట్-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా దీనిని ఎదుర్కోవచ్చు. అలాంటి ఆహారాలలో వాల్‌నట్ పాలు వాటిలో ఒకటి. ఒక గ్లాసు వాల్‌నట్ పాలు తాగడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో శరీరానికి తగిన శక్తి లభిస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదిస్తాయి.
పేగు ఆరోగ్యం కోసం
వాల్‌నట్ మిల్క్ కడుపుని ఆరోగ్యంగా, జీర్ణక్రియను సాధారణంగా ఉంచే అనేక రకాల మైక్రోబయోమ్‌లను శరీరానికి అందిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియను మెరుగుపడటమే కాకుండా ప్రేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇందుకోసం తప్పకుండా వాల్‌నట్ పాలను తీసుకోవాలి.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
వాల్‌నట్ పాలలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి, అవసరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అంటే డెయిరీ పాలతో పోలిస్తే వాల్‌నట్ మిల్క్ మీకు ఎక్కువ కాలం కడుపు నిండుగా అనిపించేలా సహాయపడుతుంది. ఇది అతి ఆకలిని నివారించడం, చిరుతిళ్లు తినడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సమయానుసారంగా భోజనం చేస్తారు. ఈ రకంగా ఇది బరువు తగ్గడంలో పాత్ర వహిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ
వాల్‌నట్ మిల్క్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నందున రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. సాధారణ వాల్‌నట్ పాలలో చక్కెర, కార్బోహైడ్రేట్‌లు తక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
సంబంధిత కథనం