Dil Raju Speech Trend: తన ట్రోలింగ్ స్పీచ్‌ను రీక్రియేట్ చేసిన దిల్ రాజు.. ట్రెండ్ అవుతున్న ప్రసంగం
02 March 2023, 15:05 IST
- Dil Raju Speech Trend: దిల్ రాజు తన స్పీచ్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన బలగం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన స్పీచ్‌ను రీ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆయన స్పీచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దిల్ రాజు ప్రసంగం(చిత్రంలో కేటీఆర్)
Dil Raju Speech Trend: టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఈ ఏడాది ఏది మాట్లాడిన ఫుల్ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఇటీవల విజయ్ నటించిన వారసుడు/వారిసు ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన డ్యాన్స్ వేణుమా డ్యాన్స్ ఇరిక్కు.. అంటూ ఆయన చెప్పిన మాటలు ఫుల్ ట్రోల్ అయ్యాయి. ఓవర్‌నైట్ ఆయన స్పీచ్‌పై మీమర్లు ఓ రేంజ్‌లో మీమ్స్ సృష్టించారు. ఎంతలా అంటే ఆయన మాటలపై సాంగ్స్ కూడా కూడా క్రియేట్ చేసేంతగా వైరల్ అయ్యాయి. ఒక్క ప్రసంగంతో తమిళనాడుతో దిల్ రాజు పెద్ద సెలబ్రెటీగా మారిపోయారు. దిల్ రాజు వచ్చి రాని తమిళ మాటలపై చాలా మంది ట్రోల్ చేసినప్పటికీ ఆయన మాత్రం లైట్‌గానే తీసుకున్నారు. తాజాగా ఆ స్పీచ్‌ను రీక్రియేట్ చేయడమే కాకుండా స్టేజ్‌పై మరోసారి నవ్వులు పూయించారు.
ఇటీవల బలగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన దిల్‌రాజు ఇటీవల ట్రోల్ అయిన తన స్పీచ్‌ను మరోసారి రీక్రియేట్ చేశారు. ఇందులో ఫైట్లు లేవు, వారసుడు మాదిరిగా ఇందులో విజయ్ బాడీ లాంగ్వేజ్ లేదు, ఎమోషన్స్ ఉన్నాయంటూ తనదైన శైలి ప్రసంగంతో దిల్‌రాజు అలరించారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఫైట్ ఇల్లే,.. ఈ సినిమాలో డ్యాన్స్ ఇల్లే.. ఈ సినిమాలో అంద విజయ్ సార్ బాడీ లాంగ్వేజ్ ఇల్లే.. కానీ ఇంద పడంలో సూపర్బ్ ఎంటర్టైన్మెంట్ ఇరిక్కు.. సూపర్ ఎమోషన్స్ ఇరిక్కు.. సూపర్ తెలంగాణ నేటివిటి ఇరిక్కు.. ఇది మన గుండెకాయ లాంటి సినిమా.. ఇది మటుకు చెప్పగలను అంటూ దిల్‌రాజు తన ప్రసంగాన్ని ముగించారు. వారిసు ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన మాటలకు పేరడి మాదిరిగా రీక్రియేట్ చేయడంతో వేదికపై కేటీఆర్ సహా ఆ ఈవెంట్‌కు హాజరైన పలువురు నటీనటులు సరదాగా నవ్వుకున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఒక్క స్పీచ్‌తో దిల్‌రాజు మరోసారి మీమర్ల బుర్రకు పదును పెట్టారు. మార్కెటింగ మెటిరియల్‌గా మారిన ఆయన బలగం చిత్రానికి మంచి ప్రమోషనల్ బూస్ట్‌గా మారారు. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.