Mrunal Thakur about sex and lust: సెక్స్, కామం గురించి ఇంట్లో ఓపెన్‌గా మాట్లాడండి: మృనాల్ ఠాకూర్
30 June 2023, 12:43 IST
Mrunal Thakur about sex and lust: సెక్స్, కామం గురించి ఇంట్లో ఓపెన్‌గా మాట్లాడండి అంటూ మృనాల్ ఠాకూర్ చెప్పడం విశేషం. లస్ట్ స్టోరీస్ 2లో ఆమె నటనకుగాను మంచి మార్కులు కొట్టేసింది.
మృనాల్ ఠాకూర్
Mrunal Thakur about sex and lust: సీతారామం ఫేమ్ మృనాల్ ఠాకూర్ తాజాగా లస్ట్ స్టోరీస్ 2 అనే ఆంథాలజీతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ లస్ట్ స్టోరీస్ 2 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జీవితంలో సంబంధాలు బలోపేతం కావాలంటే అందులో సెక్స్, లస్ట్ (కామం) ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెబుతూ సాగే ఆంథాలజీ ఇది.
ఇందులోనే తమన్నా, ఆమె బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ పై తాజాగా మృనాల్ స్పందించింది. అంతేకాదు సెక్స్, లస్ట్ గురించి ఇళ్లలో పిల్లలతో పరిణతి చెందిన సంభాషణలు జరిపితే.. వాళ్లు బయట వాటి గురించి తప్పుడు సమాచారం పొందే అవకాశం ఉండదని కూడా ఆమె చెప్పడం విశేషం
"సెక్స్, లస్ట్ గురించి పరిణతి చెందిన సంభాషణలు జరగడం ముఖ్యమని నేను బలంగా నమ్ముతాను. ముఖ్యంగా ఇంట్లో యుక్త వయసులో ఉన్న వాళ్లతో దీనిపై మాట్లాడటం అవసరం. వాళ్లకు వీటి గురించి సరైన సమాచారం అందించే ఓ రోల్ మోడల్ అవసరం. ఇలాంటి టాపిక్స్ పై ఇంట్లోని పిల్లలకు నిజాయతీగా వివరించే ఒక్క వ్యక్తి ఉన్నా కూడా వాళ్లు బయట నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని స్వీకరించరు" అని మృనాల్ చెప్పింది.
ఈ లస్ట్ స్టోరీస్ 2 ఆంథాలజీలో అంగద్ బేడీ సరసన మృనాల్ నటించింది. తాను పెళ్లి చేసుకోబోయే వాడిలో కామం ఏమేరకు ఉందో తెలుసుకోవాలని, పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ తప్పనిసరి అని ఇందులో ఆమె బామ్మ పాత్ర పోషించిన నీనా గుప్తా చెప్పడం వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఆధునిక కాలంలో జంటల మధ్య సంబంధాలు, వాటిలో ఉండే సంక్లిష్టతల గురించి ఈ లస్ట్ స్టోరీస్ 2లో చూపించారు. ఆర్ బాల్కీ, సుజయ్ ఘోష్, అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకనా సేన్ శర్మ ఈ నాలుగు ఎపిసోడ్ల ఆంథాలజీని డైరెక్ట్ చేశారు. ఇందులో తమన్నా, విజయ్ వర్మ, మృనాల్ తోపాటు కాజోల్, అమృతా సుభాష్, నీనా గుప్తా, కుముద్ మిశ్రాలాంటి వాళ్లు నటించారు.