Highest Grossing movies in 2024: ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 8 సినిమాలు ఇవే.. లిస్ట్‌లో రెండు తెలుగు మూవీస్
01 April 2024, 8:52 IST
- Highest Grossing movies in 2024: ఈ ఏడాది మూడు నెలలు గడిచిపోయాయి. ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 8 ఇండియన్ మూవీస్ ఏంటో చూడండి. అందులో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.
ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 8 సినిమాలు ఇవే.. లిస్ట్‌లో రెండు తెలుగు మూవీస్
Highest Grossing movies in 2024: చూస్తుండగానే 2024లో తొలి త్రైమాసికం ముగిసింది. మార్చి 31 వరకు దేశంలో వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు రిలీజయ్యాయి. గతేడాది పఠాన్ లాగా భారీ వసూళ్లు సాధించిన సినిమాలు లేకపోయినా.. అన్ని ఇండస్ట్రీల నుంచి సూపర్ హిట్ మూవీస్ రావడం మంచి పరిణామమే. ఈ మూడు నెలల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 8 మూవీస్ ఏంటో చూడండి.
అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు
2024లో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో తెలుగుతోపాటు హిందీ, మలయాళం ఇండస్ట్రీల నుంచి సూపర్ డూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీ ఈ మూడు నెలల్లో చాలా లాభపడింది. హిందీలో ఊహించిన స్థాయిలో మూవీస్ రాలేదు. తెలుగులో సంక్రాంతి సినిమాల జోరు కనిపించింది. అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్ లో రెండు ఆ పండగకు రిలీజైనవే ఉన్నాయి.
ఫైటర్ - రూ.358.88 కోట్లు
ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన మూవీ ఫైటర్. గతేడాది ఇదే సమయానికి పఠాన్ తో హిట్ కొట్టిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఈసారి ఫైటర్ తో వచ్చాడు. హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.358 కోట్ల వసూళ్లతో టాప్ లో ఉంది.
హనుమాన్ - రూ.300 కోట్లకుపైనే..
ఇక సంక్రాంతి సినిమాగా రిలీజై అన్ని భాషల్లోనూ సంచలన విజయం సాధించిన మూవీ హనుమాన్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగుతోపాటు హిందీ, ఇతర భాషల్లో కలిపి రూ.300 కోట్లకుపైనే వసూలు చేసింది.
మంజుమ్మెల్ బాయ్స్ - రూ.215 కోట్లు
మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మంజుమ్మెల్ బాయ్స్ చరిత్ర సృష్టించింది. నిజానికి ఆ ఇండస్ట్రీ నుంచి రూ.200 కోట్లకుపైగా వసూలు చేసిన తొలి మూవీ ఇదే. అంతకుముందు రూ.177 కోట్లతో 2018 మూవీ పేరిట ఉన్న రికార్డును మంజుమ్మెల్ బాయ్స్ బ్రేక్ చేసింది.
సైతాన్ - రూ.192 కోట్లు
బాలీవుడ్ నుంచి వచ్చిన మరో హారర్ మూవీ సైతాన్. అజయ్ దేవగన్, మాధవన్ నటించిన ఈ సినిమా రూ.192 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో మాధవన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
గుంటూరు కారం - రూ.181 కోట్లు
భారీ అంచనాలతో సంక్రాంతి సినిమాగా వచ్చిన గుంటూరు కారం మూవీకి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెసైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.181 కోట్లకుపైనే వసూలు చేసింది.
తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా -రూ.141 కోట్లు
బాలీవుడ్ మూవీ తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా కూడా ఈ ఏడాది హిట్స్ లో చోటు సంపాదించింది. ఈ సినిమా రూ.141 కోట్లు వసూలు చేసింది.
ప్రేమలు -రూ.128 కోట్లు
2024లో రూ.100 కోట్ల కలెక్షన్లు దాటిన మరో మలయాళ మూవీ ప్రేమలు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మలయాళంతోపాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. కేవలం మలయాళంలోనే రూ.128 కోట్లు వసూలు చేయగా.. తెలుగులోనూ రూ.10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లే వచ్చాయి.
ఆర్టికల్ 370 - రూ.103 కోట్లు
యామీ గౌతమ్, ప్రియమణి నటించిన హిందీ మూవీ ఆర్టికల్ 370. తప్పుడు ప్రచార సినిమాగా విమర్శలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి వసూళ్లే సాధించింది. ఈ సినిమాకు రూ.103 కోట్లు వచ్చాయి.
టాపిక్