Shaitaan 10 days box office collection: దుమ్ము రేపుతున్న మాధవన్, జ్యోతిక హారర్ మూవీ.. 100 కోట్ల క్లబ్‌లోకి సైతాన్
Shaitaan 10 days box office collection: మాధవన్, జ్యోతిక, అజయ్ దేవగన్ నటించిన సైతాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ సినిమా 10 రోజుల్లో రూ.100 కోట్ల మార్క్ దాటింది.
Shaitaan 10 days box office collection: బాలీవుడ్‌లో ఈ మధ్యే వచ్చిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ సైతాన్. వికాస్ బహల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక నటించారు. ఇప్పుడీ సినిమా తొలి పది రోజుల్లోనే ఇండియాలో రూ.100 కోట్ల మార్క్ దాటేసింది. తొలి రోజు తొలి షో నుంచే మూవీకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ దగ్గర సైతాన్ దూసుకెళ్తోంది.
సైతాన్ బాక్సాఫీస్ కలెక్షన్లు
సైతాన్ మూవీ సెకండ్ వీకెండ్ ముగిసే సమయానికి ఇండియాలో రూ.100 కోట్ల మార్క్ దాటినట్లు బాక్సాఫీస్ ట్రెండ్స్ ను ట్రాక్ చేసే Sacnilk.com వెల్లడించింది. రెండో ఆదివారం కూడా సైతాన్ మూవీ ఇంకా బలంగా ఉండటం విశేషం. ఆదివారం (మార్చి 17) ఈ సినిమా రూ.9.75 కోట్లు వసూలు చేసింది. నిజానికి ఫస్ట్ వీకెండ్ కంటే సెకండ్ వీకెండ్ సైతాన్ కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి.
9వ రోజు వరకూ ఇండియాలో రూ.93.57 కోట్లు వసూలు చేసిన సైతాన్.. పదో రోజు రూ.100 కోట్ల మార్క్ అందుకుంది. ప్రస్తుతం పది రోజుల్లో రూ.103.05 కోట్లు వసూలు చేసింది. ఆదివారం నార్త్ బెల్ట్ లో 37.19 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. రెండో సోమవారం (మార్చి 18) నుంచి ఈ సినిమాకు అసలు పరీక్ష ఎదురు కానుంది.
సైతాన్ మూవీ ఏంటి?
సైతాన్ మూవీని వికాట్ బహల్ డైరెక్ట్ చేశాడు. జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇందులో నటించిన లీడ్ అజయ్ దేవగన్ కూడా ప్రొడ్యసర్లలో ఒకడిగా ఉన్నాడు. అతీంద్రియ శక్తులు ఉన్న ఓ వ్యక్తి ఓ కుటుంబాన్ని వాళ్ల ఇంట్లోనే బంధించి ఉంచుతాడు. వాళ్లు చుట్టూ తిరిగే కథే ఈ సైతాన్.
ఈ సినిమాలో భార్యభర్తల పాత్రలను అజయ్ దేవగన్, జ్యోతిక పోషించారు. ఇక ఆ అతీంద్రియ శక్తులు ఉన్న వ్యక్తిగా మాధవన్ నటించాడు. ఈ సినిమాలో అతని నటనకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సైతాన్ మూవీ 2023లో గుజరాతీలో వచ్చిన వశ్ సినిమాకు రీమేక్. ఆ మూవీని కృష్ణదేవ్ యాగ్నిక్ డైరెక్ట్ చేశాడు.
ఇక ఈ ఏడాది రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన మూడో సినిమాగా సైతాన్ నిలిచింది. ఇప్పటికే హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటించిన ఫైటర్, షాహిద్ కపూర్, కృతి సనన్ నటించిన తేదీ బాతో మే ఐసా ఉల్జా జియా కూడా రూ.100 కోట్లకుపైగా వసూలు చేశాయి. సైతాన్ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ముఖ్యంగా మాధవన్ నటనే సినిమాకు హైలైట్ అని, ఈ సినిమాను అతని కోసం చూడొచ్చంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెప్పారు.
తొలి రోజు వరల్డ్ వైడ్‌గా సైతాన్ మూవీ 14.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. గతంలో బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హారర్ మూవీగా రాజ్ 3 పేరిట రికార్డ్ ఉంది. ఇమ్రాన్ హష్మీ, బిపాసబసు హీరోహీరోయిన్లుగా 2012లో రిలీజైన ఈ మూవీ 10.33 కోట్ల వసూళ్లను రాబట్టింది. 12 ఏళ్ల రికార్డును సైతాన్ బద్దలు కొట్టింది.