Rakul Review on Shaitaan: హారర్ మూవీ ‘సైతాన్’కు రివ్యూ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh Review on Shaitaan Movie: సైతాన్ చిత్రాన్ని స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చూశారు. ఈ హారర్ థ్రిల్లర్ మూవీపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు.
Rakul Review on Shaitaan: సైతాన్ చిత్రానికి క్రమంగా వసూళ్లు పెరుగుతున్నాయి. పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం జోరు చూపిస్తోంది. సూపర్ నేచులర్ హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరక్కించారు దర్శకుడు వికాస్ బాహ్ల్. మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ మూవీలో హీరో అజయ్ దేవగణ్, ఆర్ మాధవన్, జ్యోతిక కీలకపాత్రలు పోషించారు. సస్పెన్స్‌తో ఉత్కంఠభరితంగా ఈ మూవీ ఉందని ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా సైతాన్ చిత్రాన్ని చూశారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు.
సీట్లకు అతుక్కుపోయేలా..
సైతాన్ మూవీ కళ్లు తిప్పకుండా చూశానని రకుల్ తెలిపారు. సీట్లకు అతుక్కుపోయేలా చేసిందని నేడు (మార్చి 11) ఆమె ట్వీట్ చేశారు. సైతాన్ టీమ్‍కు ఆమె అభినందనలు తెలిపారు.
“సైతాన్ సినిమా దిమ్మతిరేగేలా ఉంది. అద్భుతమైన నరేటివ్.. మైమరిపించే పర్ఫార్మెన్సులు, అద్భుతమైన నటీనటులు, కళ్లు పక్కకు తిప్పకుండా సీటుకు అతుక్కుపోయా. అద్భుతం. అజయ్ దేవ్‍గణ్, జ్యోతిక, మాధవన్, కిడ్స్.. టీమ్ మొత్తానికి కాంగ్రాచులేషన్స్” అని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు.
సైతాన్ కలెక్షన్లు
సైతాన్ సినిమా మూడు రోజుల్లో భారత్‍లో రూ.50 కోట్ల మార్కును దాటేసింది. మూడో రోజైన ఆదివారం ఈ మూవీ రూ.20.50 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో ఇండియాలో ఈ చిత్రానికి మూడో రోజుల్లో రూ.54.89 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక విదేశాల్లో ఈ మూవీకి ఇప్పటి వరకు సుమారు రూ.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది.
సైతాన్ చిత్రంలో జానకీ బోదీవాలా, అంగద్ రాజ్ కూడా కీలకపాత్రలు పోషించారు. వికాస్ బహ్ల్ ఈ హారర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్‍గన్, మాధవన్, జ్యోతిక, జానకి యాక్టింగ్ ప్రశంసలు దక్కుతున్నాయి. వారి పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్‍గా నిలిచింది.
సైతాన్ మూవీ నిర్మాణంలోనూ అజయ్ దేవ్‍గన్, జ్యోతిక భాగస్వాములయ్యారు. వారితో పాటు కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ కూడా నిర్మాతలుగా ఉన్నారు. ఈ మూవీకి అమిత్ త్రివేది సంగీతం అందించారు.
సైతాన్ ఓటీటీ హక్కులు
సైతాన్ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వస్తుంది. మేలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రావొచ్చు.
సైతాన్ సినిమా చాలా శాతం ఒకే ఇంట్లో జరుగుతుంది. అతీత శక్తులు ఉండే మాంత్రికుడిగా మాధవన్ ఈ మూవీలో చేశారు. కబీర్ (అజయ్ దేవ్‍గణ్), జ్యోతిక (జ్యోతి) కుటుంబాన్ని తన శక్తులతో ఇబ్బందులకు గురి చేస్తాడు వనరాజ్ (మాధవన్). కబీర్ కూతురు జాన్వీ (జానకి)ని తన ఆధీనంలోకి తీసుకొని తాను చెప్పిన పనులన్నీ చేసే విధంగా వనరాజ్ చేసుకుంటాడు. జానకితో ప్రమాదమైన పనులు చేయిస్తూ అందరినీ భయపెడతాడు. అసలు కబీర్ కుటుంబంపై వనరాజ్ ఎందుకు పగబట్టాడు.. తన కుటుంబాన్ని కబీర్ కాపాడుకున్నాడా.. అనేదే సైతాన్ కథగా ఉంది. ఈ చిత్రం ఆద్యంత్యం ఉత్కంఠతో ఉందనే టాక్ వస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్ వివాహం ఫిబ్రవరి 21న జరిగింది. నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని రకుల్ పెళ్లాడారు. గోవాలో వీరి పెళ్లి వేడుక జరిగింది.