Manjummel Boys Box Office Collection: చరిత్ర సృష్టించిన మంజుమ్మెల్ బాయ్స్.. ఈ ఘనత సాధించిన తొలి మలయాళం మూవీ
Manjummel Boys Box Office Collection: మలయాళ సినిమా మంజుమ్మెల్ బాయ్స్ చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన తొలి మలయాళ సినిమాగా నిలిచింది.
Manjummel Boys Box Office Collection: మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ పరుగు కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి మలయాళ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 22న రిలీజైన ఈ మూవీ 25 రోజుల్లోనే ఈ రికార్డును సొంతం చేసుకుంది.
మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్
మంజుమ్మెల్ బాయ్స్ ఓ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజైన తొలి రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్.. తాజాగా రూ.200 కోట్ల క్లబ్ లోనూ చేరింది. గతంలో ఏ ఇతర మలయాళ మూవీకీ ఈ ఘనత సాధ్యం కాలేదు.
2023లో వచ్చిన 2018 మూవీ రూ.177 కోట్లు వసూలు చేసింది. ఆ మూవీ రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది. ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందించిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా కేరళలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 2006లో కేరళకు చెందిన కొందరు యువకులు తమిళనాడులోని కొడైకెనాల్లో ఉన్న గుణ గుహలకు వెళ్తారు.
అందులో ఒక యువకుడు ప్రమాదవశాత్తూ ఓ లోతైన గుహలోకి పడిపోతాడు. మిగిలిన స్నేహితులు అతన్ని ఎలా కాపాడారన్నదే ఈ సినిమా కథ. దీనిని ఊపిరి బిగపట్టి చూసేలా డైరెక్టర్ చిదంబరం తెరకెక్కించిన తీరు అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో మంజుమ్మెల్ బాయ్స్ మూవీపై కాసుల వర్షం కురుస్తోంది.
అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాలు
చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా ఇప్పుడీ మంజుమ్మెల్ బాయ్స్ నిలిచింది. ఈ సినిమా ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్ దాటింది. సాధారణంగా మలయాళ సినిమాలంటే తక్కువ బడ్జెట్ తోనే రూపొందుతాయి. దీంతో ఈ సినిమాల వసూళ్లు కూడా మరీ అంత భారీగా ఏమీ ఉండవు. గతంలో 2018 మూవీ రూ.177 కోట్లు వసూలు చేసింది.
అంతకంటే ముందు 2016లో వచ్చిన మోహన్ లాల్ నటించిన పులి మురుగన్ మూవీ రూ.152 కోట్లతో లిస్ట్ లో టాప్ లో ఉండేది. ఇక మోహన్ లాలే నటించిన లూసిఫర్ మూవీ కూడా రూ.127 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది రిలీజై సంచలన విజయం సాధించిన ప్రేమలు కూడా రూ.115 కోట్లతో ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. గతేడాది చివర్లో రిలీజైన మరో మోహన్ లాల్ సినిమా నేరు రూ.86 కోట్లు వసూలు చేసింది.
ఇక మంజుమ్మెల్ బాయ్స్ విషయానికి వస్తే ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను మార్చి 29న తెలుగులో రిలీజ్ చేయబోతోంది. తెలుగు రిలీజ్ కారణంగా మూవీ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం కానుంది. ఏప్రిల్ చివరి వారంలోగానీ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.