Premalu Telugu Record: తెలుగులో రికార్డులు క్రియేట్ చేస్తున్న మలయాళ మూవీ ప్రేమలు
Premalu Telugu Record: మలయాళ సినిమా ప్రేమలు తెలుగులో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ మూవీ.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మలయాళ డబ్బింగ్ మూవీగా నిలిచింది.
Premalu Telugu Record: తెలుగు ప్రేక్షకులు మరో మలయాళ సినిమాను అక్కున చేర్చుకున్నారు. అంతేకాదు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ.. ఆల్ టైమ్ హిట్ చేశారు. గత నెలలో మలయాళంలో రిలీజై సంచలన విజయం సాధించిన ప్రేమలు మూవీ మార్చి 8న తెలుగులోకీ వచ్చిన విషయం తెలిసిందే. రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేయగా.. రికార్డు కలెక్షన్లు సాధించింది.
ప్రేమలు బాక్సాఫీస్ రికార్డు
మలయాళంలో కేవలం రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమలు. కేరళ బాక్సాఫీస్ ను షేక్ చేసిన తర్వాత తెలుగులోనూ డబ్ చేశారు. ఇప్పుడీ సినిమా తెలుగులో రిలీజైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.10.54 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటి వరకూ తెలుగులో డబ్ అయిన మలయాళ సినిమాల్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇదే అంటూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నస్లెన్ గఫూర్, మమితా బైజు లీడ్ రోల్స్ లో నటించారు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సరదా లవ్ స్టోరీ మలయాళ ప్రేక్షకులనే కాదు తెలుగు యువతను కూడా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాపై మహేష్ బాబు, నాగ చైతన్య, రాజమౌళిలాంటి ప్రముఖులు ప్రశంసలు కురిపించడం కూడా ప్రేమలు బాక్సాఫీస్ సక్సెస్ కు కారణమైంది.
మార్చి 8 నుంచి ఆదివారం (మార్చి 17) వరకూ పది రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అన్ని షోలు ఫుల్ హౌజ్ తో నడుస్తున్నట్లు మేకర్స్ చెప్పారు. ఈ సినిమా మలయాళంలోనే రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో రూపొంది ఈ స్థాయి వసూళ్లు సాధించడం మలయాళ సినిమాలకే చెల్లుతుంది.
ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్
ప్రేమలు మూవీ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నది. మార్చి 29 నుంచి ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేమలు రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తొలుత ఈ సినిమాను మార్చి ఫస్ట్ వీక్‌లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలని డిస్నీ హాట్‌స్టార్ ప్లాన్ చేసింది. ప్రేమలు తెలుగు వెర్షన్ మార్చి 8న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ వెర్షన్ మార్చి 15న రిలీజ్ అయింది. అందువల్లే ఓటీటీ రిలీజ్ డిలే అయినట్లు చెబుతోన్నారు.
ప్రేమలు కథ ఇదే..
ప్రేమలు సినిమాను హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించాడు దర్శకుడు గిరీష్. సచిన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. కానీ వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. ఓ వేడుకలో అతడికి రీనూ పరిచయం అవుతుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు సచిన్.
అప్పటికే లవ్‌లో ఓ సారి ఫెయిలైన సచిన్...రీనుకు తన ప్రేమను ఎలా చెప్పాడు? రీనును ప్రేమిస్తోన్న ఆది ఎవరు? భిన్న మనస్తత్వాలు, ఆలోచనలు కలిగిన సచిన్, రీనూ చివరకు ఒక్కటయ్యారా? లేదా? అన్నదే ఈ మూవీ కథ. ప్రేమలు సినిమాకు మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఓ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. తన స్నేహితులతో కలిసి ఈ చిన్న సినిమాను నిర్మించాడు.
టాపిక్