Mahesh Babu Premalu Review: ప్రేమలు మూవీపై మహేష్ బాబు రివ్యూ.. ఇంతలా ఎప్పుడూ నవ్వలేదంటూ..
Mahesh Babu Premalu Review: మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమలుపై సూపర్ స్టార్ మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు. ఇంతలా ఎప్పుడూ నవ్వలేదంటూ అతడు సోషల్ మీడియాలో ఇచ్చిన రివ్యూ వైరల్ అవుతోంది.
Mahesh Babu Premalu Review: మలయాళంలో ఈ ఏడాది వచ్చిన అతిపెద్ద హిట్ మూవీస్ లో ఒకటి ప్రేమలు. ఈ మధ్యే తెలుగులోనూ రిలీజైన ఈ సినిమాపై మంగళవారం (మార్చి 12) రాత్రి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన రివ్యూ ఇచ్చాడు. ఓ సినిమా చూస్తూ చివరిసారి ఇంతలా ఎప్పుడు నవ్వానో కూడా గుర్తులేదంటూ ప్రేమలు మూవీపై అతడు ప్రశంసలు కురిపించాడు.
మహేష్ బాబు ప్రేమలు రివ్యూ
ప్రేమలు మూవీ మలయాళంలో రిలీజైనప్పటి నుంచీ ఎంతటి రెస్పాన్స్ వస్తోందో మనకు తెలుసు. దీంతో ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశారు. రాజమౌళి తనయుడు కార్తికేయ ప్రేమలు మూవీని తెలుగులోకి తీసుకొచ్చాడు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యేక షోలలో మూవీని చూస్తున్నారు. రాజమౌళి కూడా ప్రేమలుపై ప్రశంసల వర్షం కురిపించాడు.
తాజాగా సోషల్ మీడియా ఎక్స్ ద్వారా మహేష్ బాబు మూవీపై స్పందించాడు. "ప్రేమలు మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన కార్తికేయకు కృతజ్ఞతలు. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఓ సినిమా చూస్తూ చివరిసారి నేను ఇంతలా ఎప్పుడు నవ్వానో కూడా గుర్తులేదు. మా ఫ్యామిలీ మొత్తానికి సినిమా బాగా నచ్చింది. అందరు యంగ్‌స్టర్స్ అద్భుతంగా నటించారు. మొత్తం టీమ్ కు కంగ్రాచులేషన్స్" అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
ప్రేమలు హీరోయిన్‌పై రాజమౌళి..
ఇక ప్రేమలు మూవీ సక్సెస్ మీట్ కూడా హైదరాబాద్ లో నిర్వహించారు. దీనికి రాజమౌళి ప్రత్యేక అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా ప్రేమలు మూవీ ఫిమేల్ లీడ్ మమితా బైజుపై ప్రశంసలు కురిపించాడు. ఆమె తన మనసు గెలుచుకుందని చెప్పాడు. గీతాంజలి సినిమాలో గిరిజలా, సాయిపల్లవిలా ఆమె మీ అందరి మనసులు గెలుచుకుంటుందని రాజమౌలి అనడం విశేషం.
ప్రేమలు తెలుగు వెర్షన్‍కు 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైలాగ్స్ రాశారు. ఈ చిత్రం చూసేంత నవ్వుతూనే ఉంటామని, ఈ క్రెడిట్ డైలాగ్స్ రాసిన వారికి దక్కుతుందని రాజమౌళి చెప్పారు. తెలుగులో ఆదిత్య హాసన్ డైలాగ్స్ ఇరగదీశారని ఆయన ప్రశంసించారు. మీమ్‍లను బలవంతంగా కాకుండా అర్థవంతంగా డైలాగ్‍లో పెట్టారని ప్రశంసించారు.
గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు సినిమాలో నెస్లేన్ గఫూర్, మిమితా బైజూ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న మలయాళం రిలీజ్ కాగా.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. మార్చి 8న ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్ ఇప్పటికే రూ.3కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలుగులో రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి.
గతంలో నాగ చైతన్య కూడా ప్రేమలు మూవీపై స్పందించాడు. ఇదొక నవ్వుల బ్లాస్ట్ అని, అందరూ మీ గ్యాంగ్ తో వెళ్లి చూడాల్సిన సినిమా అని అతడు అన్నాడు. సిచువేషనల్ కామెడీ చాలా బాగుందని చెప్పాడు. తాజాగా రాజమౌళి, మహేష్ బాబులాంటి వాళ్ల ప్రశంసలతో తెలుగులో ఈ మూవీ మరింత దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.