Brahmamudi November 22nd Episode: కావ్యకు రాజ్ విడాకులు- రెండ్రోజుల్లో తీసుకొస్తానన్న తల్లి- ఇంట్లోంచి వెళ్లిపోయిన అపర్ణ
22 November 2024, 7:50 IST
Brahmamudi Serial November 22nd Episode: బ్రహ్మముడి నవంబర్ 22 ఎపిసోడ్‌లో కావ్యను మోసం చేసి రాజ్ గెలవడంపై సీతారామయ్య నిలదీస్తాడు. కావ్యను ఇంటికి తీసుకురమ్మని అంటాడు. కావాలంటే కావ్యకు విడాకులు ఇస్తాను కానీ, ఇంటికి మాత్రం తీసుకురానని రాజ్ తెగేసి చెబుతాడు. మరోవైపు కనకంకు అపర్ణ మాట ఇస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 22వ తేది ఎపిసోడ్
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంటికి రాజ్ డల్‌గా కావాలనే నడుచుకుంటూ వస్తాడు. కావ్య ఎక్కడ్రా అని అపర్ణ అడుగుతుంది. వాడి మొహం చూస్తే ఓడిపోయినట్లే ఉందని ఇందిరాదేవి అంటుంది. తనతోపాటు తీసుకురావడానికి ఇగో అడ్డొచ్చి ఆటోలో రమ్మన్నట్టున్నాడని స్వప్న అంటుంది.
రజనీకాంత్ పాటకు స్టెప్పులు
కళావతి కోసం ఆటోనే బుక్ చేశాను. బుక్ చేసి పుట్టింటికి పంపించా. పర్మనెంట్‌గా పుట్టింట్లో ఉండమన్నా. ఇంకా అర్థం కాలేదా. నేనే గెలిచాను అని రాజ్ అరిచి చెబుతాడు. అందరిని పక్కకు జరిపి రుద్రాణి దగ్గరికి వెళ్లి నేనే గెలిచాను అత్త. మంచి సాంగ్ పెట్టు డ్యాన్స్ చేద్దాం అని రాజ్ అంటాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ వేట్టయన్ మూవీలోని మనసలాయో పాటకు అదిరిపోయేలా స్టెప్పులేస్తాడు రాజ్. రుద్రాణి కూడా డ్యాన్స్ చేస్తుంది.
దాంతో ఆపమని అపర్ణ అంటుంది. సిగ్గులేదా అని అడుగుతుంది. ఏంటీ మమ్మీ డైజెస్ట్ కావట్లేదా. నేను ఓడిపోవాలని ఎంత కోరుకున్నారు. ఎంతమంది కోరుకున్నా తిరుగులేని విజయం సాధించి.. కళావతిని పుట్టింటికి పంపించి.. సీఈఓగా బాధ్యతలు చేపట్టి దిగ్విజయంగా తిరిగి వచ్చాను. ఆఫీస్ టైమ్ కంటే ముందుగా ఎందుకు వచ్చానో తెలుసా మీ అందరి ముఖ చిత్రం చూద్దామని అని రాజ్ అంటాడు. ఇప్పుడు అర్థమైందా కొడుకు ఓడిపోవాలని కోరుకున్న మొదటి మదర్ గారు అని అందరిని మాటలు అంటుంది రుద్రాణి.
మీ గ్యాంగ్ అందరిలో ఆరని మంటలు చెలరెగుతున్నాయి. ఆ మంటతో వెలిగించి హారతి స్వప్న, అపర్ణ, ఇందిరాదేవిని అంటుంది రుద్రాణి. పైశాచిక ఆనందం అంటే ఏంటో నీ కళ్లలో కనిపిస్తుంది అత్త. ఈ ఇంటి ఉప్పు తింటు ఈ ఇంటి వారసుడు కాపురం కూలిపోవాలని కోరుకునే నిన్ను చూస్తుంటే పీనుగులను పీక్కుతునే పిశాచీ కనిపిస్తుంది అని స్వప్న అంటుంది. ఏయ్ షటప్ అని రుద్రాణి అంటే.. కూల్‌గా ఉండు అత్త అని శాంతని పిలిచి చెప్పిన వంటలు చేశావా అని అడుగుతాడు రాజ్.
పనిమనిషి కౌంటర్స్
చేశాను. కావ్య మేడమ్ తిరిగి వస్తారన్న ఆశతో చేశాను. కానీ, మీరు గెలిచారని తెలిసి ఎందుకు చేశానా అని బాధపడుతున్నాను. విశ్వాసం లేని రుద్రాణి గారు లాంటి వాళ్లు సంతోషంగా ఉంటున్నారేమో గానీ నాకు మాత్రం లేదు బాబు అని పనిమనిషి శాంత అంటుంది. హేయ్ పళ్లు రాళగొడతాను. పనిమనిషివి పనిమనిషిలా ఉండు అని రుద్రాణి అంటే.. మీరు ఇంటి మనిషి ఇంటి మనిషిలానే ఉండండి అని కౌంటర్ ఇస్తుంది శాంత.
ఎక్కువ మాట్లాడితే ఉద్యోగం పీకేస్తాను అని రుద్రాణి అంటుంది. నీకేం అధికారం ఉంది. నువ్వేమైనా జీతం ఇస్తున్నావా. ఎక్కువ మాట్లాడితే కట్టుబట్టలతో గెంటేస్తాను అని ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. అత్త నేను గెలిచినన్నది జీర్ణించుకోలేక ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. నా గెలుపును సెలబ్రేట్ చేసుకోడానికి నువ్వున్నావ్ అని రాజ్ అంటుంటే.. ఏం గెలుపురా నీది అని సీతారామయ్య ఎంట్రీ ఇస్తాడు. ఛీ.. నువ్ నా మనవడు అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నాను. ఇలా గెలవడం సిగ్గుమాలిన పనిరా అని సీతారామయ్య అంటాడు.
ఏమైంది నాన్న అని సుభాష్ అడిగితే.. వాన్నే అడగరా.. గెలిచి ఓడాడో.. ఓడి గెలిచాడో వాడో చెబుతాడు అని సీతారామయ్య అంటాడు. తర్వాత వీడు కావ్యను మోసం చేసి గెలిచాడు. కావ్య వేసిన డిజైన్స్‌ను కొట్టేసి తను వేసిన డిజైన్స్‌గా క్లైంట్స్‌కు చూపించి మోసం చేసి పందెంలో గెలిచాడు. ఇది ఒక గెలుపునే అని సీతారామయ్య నిలదీస్తాడు. నిజమేనారా అని మెల్లిగా రుద్రాణి అడిగితే.. అవును అని రాజ్ అంటాడు. కరెక్ట్ పని చేశావ్ అన్నట్లుగా సైగ చేస్తుంది రుద్రాణి.
ఇదేగా చాణక్య నీతి
ఓహో.. ఓడిపోయిన ఉక్రోశంతో జరిగింది అంతా కళావతి చెప్పి సానుభూతి ప్రకటించుకోవాలని చేసిందా అని రాజ్ అంటాడు. నేను ఛైర్మన్‌నిరా నువ్ చేసింది నేను తెలుసుకోనా. కావ్య ఫిర్యాదులు చేసేది కాదు. అలా చేస్తే నిన్ను ఎప్పుడో బయటకు గెంటేసేవాన్ని అని సీతారామయ్య అంటాడు. వ్యాపారంలో మోసం చేసినవాళ్లను మోసం చేసి గెలవాలని మీరే చెప్పారు కదా. చాణక్య నీతి అంటే ఇదే కదా అని రాజ్ అంటాడు.
ఇంకా సమర్థించుకోకు. ఆత్మ వంచన చేసుకోకు. నీకు తెలియదా ఇది మోసం అని. కావ్య నిజాయితీగా నిలబడింది. రాత్రి పగలు కష్టపడింది. ఇంత చేసిన నిన్ను తప్పకుండా మౌనంగా వెళ్లిపోయింది అని సీతారామయ్య అంటాడు. ఛీ ఇంత మూర్ఖంగా ఎలా తయారయ్యావురా అని ఇందిరాదేవి అంటుంది. నాకు ఇప్పుడు నీకు రాహుల్‌కు తేడా కనిపించడం లేదని స్వప్న అంటుంది. దాంతో రాజ్ కోప్పడుతాడు. ఏ స్వప్న అన్నదాంట్లో తప్పేముంది. పందెంలో గెలవడానికి కట్టుకున్న భార్యను మోసం చేసిన నిన్ను చూస్తుంటే తల్లిగా సిగ్గుపడుతున్నాను అని అపర్ణ అంటుంది.
ఏ మనిషివిరా నువ్వు అని అపర్ణ అంటుంది. కావ్య వేసిన డిజైన్స్ వాళ్లకు నచ్చాయి కాబట్టి న్యాయంగా పందంలో కావ్య గెలిచినట్లే. ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని కావ్యను ఇంటికి తీసుకురా. నీ బోడీ సీఈఓ కోసం కావ్య దృష్టిలో భర్తగా దిగజారిపోకుండా అయిన మిగిలిపోతావ్ అని ఇందిరాదేవి అంటుంది. నీ మంచితననాన్ని నువ్వే మర్చిపోయావేంట్రా అని ప్రకాశం అంటాడు. కోడలిని ఇంటికి తీసుకురమ్మని సుభాష్ అంటాడు. వెళ్లు లేకపోతే ఈ నిజాన్ని ఆఫీస్‌లో నేనే బయటపెట్టి నువ్ గిల్టీగా ఫీల్ అయ్యేలా చేస్తాను అని సీతారామయ్య అంటాడు.
కనకం ఆరా
కళావతిని సపోర్ట్ చేసే అందరికి చెబుతున్నాను. నేను ఓడిపోయాను అని ఆఫీస్‌లో అందరిముందు నిలబెట్టిన సరే నేను కళావతిని ఇంటికి తీసుకురాను. అంతకంటే విడాకులు ఇవ్వడమే నాకు ఇష్టం. ఇప్పుడే కాదు ఎప్పటికీ కళావతిని ఇంటికి తీసుకురాను అని రాజ్ తెగేసి చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు కావ్య భోజనం చేస్తుంటే కనకం వచ్చి జరిగినదాని గురించి మాట్లాడుతుంది. జీవితం అప్పడంలా ఉంటుందని కావ్య అంటుంది.
పిచ్చి పోలికలు చెబితే చంపేస్తాను. భర్తకు దూరమయ్యాయనే ఆలోచన లేదా అని కనకం అంటుంది. ఇప్పుడు నేను కన్నీటిపర్యంతం అవ్వాలా. నేను ఆ పందెంలో ఓడిపోవాలని రాసి పెట్టి ఉంది. నీకు అడ్డమైతే చెప్పు హాస్టల్‌లో ఉంటాను అని కావ్య అంటుంది. నువ్ ఓడిపోయావంటే నేను నమ్మను. అక్కడ ఏం జరిగిందో నిజం చెప్పమని కనకం అంటుంది. ఇంతలో సీతారామయ్య కాల్ చేస్తాడు. ఎందుకు రిజైన్ చేసి వెళ్లిపోయావ్ అని సీతారామయ్య అంటాడు.
ఓడిపోయినవాళ్లు ఇంటికి, ఆయనకు దూరం ఉండటమనేదే పందెం కదా అని కావ్య అంటుంది. రాజ్ ఎలా గెలిచాడో నాకు అన్నీ తెలుసు. అడ్డదారిలో గెలవడం కూడా గెలుపేనా. నేను ఒప్పుకోను. వాడు చేసిన తప్పు తెలిసేలా చేస్తాను. మళ్లీ నేను నిన్ను సీఈఓను చేస్తాను అని సీతారామయ్య అంటాడు. ఆయనకు నాపై కొంచెం కూడా మంచి అభిప్రాయం లేదు. భార్యను అని ప్రేమ లేదు. నేను సీఈఓ అవ్వడం ఇష్టంలేదు. అందుకే ఎలాగైనా గెలవాలనుకుని గెలిచారు అని కావ్య అంటుంది.
అలసిపోయిన కావ్య
నా డిజైన్స్ దొంగతనం చేయడం వల్లే ఆయన గెలిచారని అనుకుంటున్నారు. కానీ, ఆయన నా టేబుల్ దగ్గరికి వచ్చి దొంగతనం చేయడం నాకు తెలుసు. నేను ఆయన జీవితం నుంచి వెళ్లిపోతానని తెలిసి కూడా ఆయన అలా చేశారంటే నేనేందుకు ఇంకా అక్కడ ఉండటం. అలాంటప్పుడు ఇవన్నీ నేనేందుకు చేయాలి. నేను ఆయనకు నచ్చాలి. అది ఎప్పటికీ జరగదు. ఈ వృథా ప్రయత్నాలు ఎందుకు అని కావ్య అంటుంది. అలా మాట్లాడకమ్మా వినడానికి కష్టంగా ఉందని సీతరామయ్య అంటాడు.
నేను ఓడిపోయాను అని బలవంతంగా నమ్మేలా చేశారు. నేను ఆయన వెంట పడి పడి అలసిపోయాను. ఇక నా వల్ల కాదు తాతయ్య. నన్ను క్షమించండి అని కాల్ కట్ చేస్తుంది కావ్య. అదంతా విన్న కనకంకు ఇది జరిగిందని చెబుతుంది కావ్య. అప్పటివరకు తిన్న కావ్య తినకుండా వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్ విడాకులు గురించి అంటాడేంటీ. కావ్యతో ఆయన మాట్లాడితే రాజ్‌కు ఇష్టం లేదు. ఆఫీస్‌కు రానని మాట్లాడిందట అని ఇందిరాదేవి అంటుంది.
కావ్య బాధలో అర్థముంది. కట్టుకున్న భర్తే అలా చేసేసరికి అదేం చేస్తుందని అపర్ణ అంటుంది. ఇంతలో ఇందిరాదేవికి కాల్ చేసి కనకం బాధపడుతుంది. ఏదైనా మీ చేతుల్లోనే ఉంది. నా కూతురు అత్తారింటికి వెళ్తుందని, జీవితం సంతోషంగా ఉంటుందని ఆశపడ్డాను. అసలు తనకు జీవితమే లేకుండా నీ మనవడు చేసి పెట్టాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి. దుగ్గిరాలి ఇంటితో సంబంధం తెగిపోయింది. శాశ్వతంగా ఇక్కడే ఉంటానని నా కూతురు చెబుతోంది. తనకు న్యాయం ఎవరు చేస్తారని కనకం అంటుంది.
మాటిచ్చిన అపర్ణ
నేను చేస్తాను. ఎన్ని గొడవలు జరిగినా ఇప్పటికీ ఎప్పటికీ కావ్య ఇంటి కోడలు. అది మార్చలేరు. నేను నీకు మాటిస్తున్నాను. రెండ్రోజుల్లో కావ్య మా ఇంట్లో అడుగుపెడుతుంది అని అపర్ణ హామీ ఇస్తుంది. ఏంటే అన్ని వరాలు ఇచ్చావేంటీ అని ఇందిరాదేవి అడుగుతుంది. వరాలు కాదు.. నా కోడలికి న్యాయం చేస్తానని చెప్పాను అని అపర్ణ అంటే.. ఎలా చేస్తావ్ అని సుభాష్ అంటాడు. అది మీరే చూస్తారు కదా అని అపర్ణ అంటుంది.
మరోవైపు అసలు తాతయ్యకు నిజం ఎలా తెలిసిందని అన్ని రకాలుగా రాజ్ ఆలోచిస్తుంటాడు. కళావతి వెళ్లిపోయిందన్న కడుపు మంటతో ఆ శ్రుతినే చెప్పి ఉంటుందని రాజ్ అనుకుంటాడు. ఇంతలో రాజ్ అంతరాత్మ వచ్చి తిడతాడు. ఒకప్పుడు నాకంటూ ఒక డిగ్నిటీ ఉండేది, క్యారెక్టర్ ఉండేది, ఇప్పుడు లేదు అని రాజ్ అంతరాత్మ అంటాడు. తర్వాత లెటర్ రాసిపెట్టి ఇంట్లోంచి వెళ్లిపోతుంది అపర్ణ. అది తెలిసి రాజ్ షాక్ అవుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్