PM Modi meets Xi Jinping: ‘‘ప్రపంచ శాంతికి భారత, చైనాల మధ్య సయోధ్య చాలా కీలకం’’: జిన్ పింగ్ తో ప్రధాని మోదీ
PM Modi meets Xi Jinping: బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, భారత, చైనాల మధ్య సయోధ్య ప్రపంచ శాంతికి చాలా కీలకమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 2019 ఘర్షణల తరువాత ఇరుదేశాధినేతలు సమావేశం కావడం ఇదే ప్రథమం.
PM Modi meets Xi Jinping: రష్యాలోని కజాన్ లో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. భారత్, చైనా సరిహద్దులో శాంతి, సుస్థిరతను కాపాడటం తమ ప్రాధాన్యాంశంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు కలుసుకున్నారు. 2019 తర్వాత ఇరు దేశాల మధ్య దేశాధినేతల స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరగడం ఇదే తొలిసారి.
సయోధ్య కీలకం
ప్రపంచ శాంతికి భారత్, చైనా సంబంధాలు కీలకమని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఐదేళ్ల తర్వాత జరిగినన మా తొలి అధికారిక సమావేశం ఇదే. సరిహద్దు వెంబడి మనం కుదుర్చుకున్న ఒప్పందాలను స్వాగతిస్తున్నాం. సరిహద్దుల్లో శాంతి, సామరస్యాలను కాపాడుకోవడం మన ప్రాధాన్యాంశంగా ఉండాలి. పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం, పరస్పర సామరస్యం మన సంబంధాలకు ప్రాతిపదికగా ఉండాలి. మన చర్చలు మనస్ఫూర్తిగా, నిర్మాణాత్మకంగా ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో వ్యాఖ్యానించారు.
వాస్తవాధీన రేఖపై ఏకాభిప్రాయం
తూర్పు లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. సరిహద్దుల్లో గత నాలుగేళ్లుగా తలెత్తిన సమస్యల పరిష్కారంలో ఏకాభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం, పరస్పర సామరస్యం భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలకు మార్గనిర్దేశం చేస్తాయని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘‘కజాన్ బ్రిక్స్ సదస్సు సందర్భంగా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ అయ్యాను. మన దేశాల ప్రజలకు, ప్రాంతీయ, ప్రపంచ శాంతి, సుస్థిరతలకు భారత్-చైనా సంబంధాలు చాలా ముఖ్యం. పరస్పర విశ్వాసం, పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం ద్వైపాక్షిక సంబంధాలకు మార్గనిర్దేశం చేస్తాయి’’ అని ప్రధాని మోదీ (narendra modi) ఎక్స్ లో రాశారు.
ద్వైపాక్షిక భేటీలో జిన్ పింగ్ ఏమన్నారు?
భారత్, చైనాలు మరింత సమాచారం, సహకారాన్ని కలిగి ఉండటం, విభేదాలను సక్రమంగా పరిష్కరించుకోవడం చాలా ముఖ్యమని జిన్ పింగ్ అన్నారు. ఐదేళ్లలో అధికారికంగా తాము సమావేశం కావడం ఇదే తొలిసారి అన్నారు. ‘‘ఇరు దేశాల ప్రజలు, అంతర్జాతీయ సమాజం మా సమావేశంపై ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నాయి. చైనా, భారతదేశం రెండూ పురాతన నాగరికతలు. అభివృద్ధి చెందుతున్న దేశాలు. గ్లోబల్ సౌత్ యొక్క ముఖ్యమైన సభ్యులు. ఈ రెండు దేశాలు తమ తమ ఆధునీకరణ ప్రయత్నాల్లో కీలక దశలో ఉన్నాయి. ఇది మన రెండు దేశాల ప్రాథమిక ప్రయోజనాలకు బాగా ఉపయోగపడుతుంది. చరిత్ర ధోరణిని, ద్వైపాక్షిక సంబంధాలను సరైన దిశను కొనసాగించడానికి, ఇరు పక్షాలు మరింత పరస్పర సమచారాన్ని, పరస్పర సహకారాన్ని కలిగి ఉండాలి. విభేదాలను సరిగ్గా పరిష్కరించుకోవాలి’’ అని షీ జిన్ పింగ్ (Xi Jinping) అన్నారు.
అంతర్జాతీయంగా కీలక పాత్ర
అంతర్జాతీయ బాధ్యతను భుజాన వేసుకోవడం, వర్ధమాన దేశాల బలం, ఐక్యతను పెంపొందించడం, అంతర్జాతీయ సంబంధాల్లో బహుళ ధృవీకరణ, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దోహదపడటం కూడా ఇరు పక్షాలకు ముఖ్యమని జిన్ పింగ్ అన్నారు. తూర్పు లద్దాఖ్లోని ఎల్ఏసీ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయి ఘర్షణ ప్రారంభం కావడానికి కొన్ని నెలల ముందు 2019 అక్టోబర్ లో ఇరువురు నేతలు చివరిసారిగా భారత్ లో శిఖరాగ్ర సమావేశం కోసం కలుసుకున్నారు. 2020 జూన్ లో సరిహద్దుల్లో జరిగిన సైనిక ఘర్షణలో కనీసం 20 మంది భారత సైనికులు, పలువురు చైనా సైనికులు మరణించిన తరువాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.
లద్దాఖ్ లో భారత్-చైనా సరిహద్దు సంధి
లద్దాఖ్ లో నాలుగేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు రెండు ఆసియా దిగ్గజాలు సరిహద్దు ఒప్పందాన్ని ప్రకటించిన కొద్ది రోజులకే మోదీ, జిన్ పింగ్ ల మధ్య ఈ సమావేశం జరిగింది. వాస్తవాధీన రేఖ వెంబడి సైనిక గస్తీని పునఃప్రారంభించడంపై ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయని భారత్ ప్రకటించింది. ఈ ఒప్పందం ఎల్ఏసీ వద్ద బలగాల ఉపసంహరణకు దారితీస్తుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. సరిహద్దుకు సంబంధించి ఇరు దేశాలు తీర్మానాలు చేసుకున్నాయని చైనా (china) ఈ ఒప్పందాన్ని ధృవీకరించింది. ఈ తీర్మానాలను సక్రమంగా అమలు చేసేందుకు భారత్ తో కలిసి పనిచేస్తామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు.