తెలుగు న్యూస్  /  Entertainment  /  Aswini Dutt Revealed He Had Planned To Cast Taraka Ratna For A Role In Project K

Taraka Ratna in Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ కేలో తారకరత్న.. కానీ ఇంతలోనే ఇలా

21 February 2023, 13:27 IST

    • Taraka Ratna in Project K: తారకరత్న గురించి ప్రముక నిర్మాత అశ్వినీ దత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండేవారని, స్పోర్టీవ్‌గా ఉంటారని తెలిపారు. అంతేకాకుండా తన నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కేలో తారకరత్నకు మంచి రోల్ ఆఫర్ చేద్దాముకున్నానని స్పష్టం చేశారు.
ప్రాజెక్టు కే లో తారకరత్న
ప్రాజెక్టు కే లో తారకరత్న

ప్రాజెక్టు కే లో తారకరత్న

Taraka Ratna in Project K: నందమూరి హీరో తారకరత్న మరణం యావత్ తెలుగు చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా నందమూరి అభిమానులకు, సన్నిహితులు, శ్రేయోభిలాషులకు తీరని లోటును మిగిల్చింది. ఆయన లేని నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేదన్నది వాస్తవం. కెరీర్ పరంగా హీరోగా ఒడుదొడుకులు ఎదుర్కొన్న తారకరత్న.. నటుడి పరంగా మాత్రం మంచి మార్కులు అందుకున్నాడు. ఆయన నటించిన ఒకటో నంబర్ కుర్రాడు, అమరావతి, మనమంతా లాంటి సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. అయితే అన్ని కుదిరితే తారకరత్న క్రేజీ ఆఫర్ దక్కించుకునేవారే. ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్ట్ కేలో ఆయనకు మంచి రోల్‌ ఆఫర్ చేశారట. ఈ విషయాన్ని సదరు చిత్ర నిర్మాత అశ్వినీ దత్ స్వయంగా వెల్లడించారు.

ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్ట్ కే సినిమాలో తారకరత్నకు మంచి రోల్ ఆఫర్ చేద్దామనుకున్నామని, ఈ విషయంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తోనూ చర్చించినట్లు అశ్వినీ దత్ తెలిపారు. ఈ రోల్ గురించి తారకరత్నతో సంప్రదిద్దామనుకునేలోపే దురదృష్టకరమైన వార్త వినాల్సి వచ్చిందని, తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందని అన్నారు. తారకత్న ఎల్లప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండేవారని, ఎప్పుడూ స్పోర్టివ్‌గా ఉంటారని గుర్తు చేసుకున్నారు.

అశ్వీని దత్ నిర్మాణంలో వచ్చిన ఒకటో నెంబర్ కుర్రాడు(2002) సినిమాతోనే తారకరత్న చిత్రసీమలో అరంగేట్రం చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన తారకరత్న.. చెప్పుకోదగ్గ విజయాలను మాత్రం అందుకోలేకపోయారు.

జనవరి 27న తెదేపా నేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా గుండెపోటుకు గురైన తారకరత్నను ఆసుపత్రికి తరలించారు. గత 23 రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన మృతితో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలముకున్నాయి.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.