Yusuf Pathan TMC : టీఎంసీ లోక్‌సభ లిస్ట్‌లో యూసఫ్ పఠాన్.. మహువా మోయిత్రా ఈజ్ బ్యాక్!
10 March 2024, 14:55 IST
- TMC Lok Sabha elections list : మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌కి లోక్‌సభ సీటు ఇచ్చింది టీఎంసీ. మహువా మోయిత్రాకు కూడా అవకాశం ఇచ్చింది టీఎంసీ.
యూసఫ్ పఠాన్
TMC Lok Sabha candidates liేt : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పోరాటానికి సిద్ధపడిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ).. పశ్చిమ్ బెంగాల్‌లోని మొత్తం లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు.. ఆదివారం మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి.. 42మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు మమతా బెనర్జీ. జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కూడా ఉన్నారు. ఇక.. లోక్‌సభ నుంచి బహిష్కారానికి గురైన మహువా మోయిత్రాపై దీదీ మరోమారు నమ్మకం ఉంచారు. ఆమెకు మళ్లీ టికెట్ ఇచ్చారు. అయితే.. మమతా బెనర్జీ అభ్యర్థుల లిస్ట్.. బీజేపీ కన్నా ఇండియా కూటమికే ఎక్కువ నష్టం కలిగించే విధంగా ఉందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి!
లోక్‌సభ ఎన్నికలకు టీఎంసీ లిస్ట్..
పశ్చిమ్ బెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. తాజాగా.. వీటికి అభ్యర్థులను ప్రకటించింది టీఎంసీ. బహరంపూర్ నుంచి మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ని బరిలోకి దింపింది. యూసఫ్ పఠాన్.. కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరీతో పోటీపడనున్నారు.
ఇక అవినీతి కేసులో వేటుకు గురైన మహువా మోయిత్రాకు మరోమారు అవకాశం ఇచ్చారు మమతా బెనర్జీ. 2019లో ఆమె పోటి చేసి గెలిచిన కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మహువా మోయిత్రా మళ్లీ బరిలో దిగనున్నారు.
హింసాత్మక ఘటనలతో, మహిళల నిరసనలతో గత కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన సందేశ్‌ఖాళీ విషయంలో కీలక మార్పే చేసింది టీఎంసీ. 2019లో అక్కడ గెలిచిన నుష్రత్ జహాన్‌కు ఈసారి.. టీఎంసీ లిస్ట్‌లో చోటు దక్కలేదు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే!
ఇండియా కూటమికి షాక్..!
2024 Lok Sabha elections : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏని గద్ద దింపడమే లక్ష్యంగా ఏర్పడింది విపక్ష ఇండియా కూటమి! ఈ కూటమిలో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ, పశ్చిమ్ బెంగాల్ చాలా కీలకం! మోదీని ఢీకొట్టాలంటే.. ఈ రాష్ట్రంలోని 42 సీట్లు చాలా ముఖ్యమైనవి. అయితే.. సీట్ల సద్దుబాటు విషయంలో కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐకి సెట్ అవ్వలేదు! మరీ ముఖ్యంగా.. మమత- కాంగ్రెస్ మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. సొంతంగా పోటీ చేస్తామని దీదీ చెప్పినప్పటికీ.. 'లేదు లేదు.. ఇంకా చర్చలు జరుగుతున్నాయి' అని కాంగ్రెస్ ఇంతకాలం చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు.. మొత్తం 42 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి.. కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది టీఎంసీ.
లోక్‌సభ అభ్యర్థుల లిస్ట్‌ని టీఎంసీ ప్రకటించిన కొద్దిసేపటికే.. ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది కాంగ్రెస్. ‘గౌరవప్రదమైన సీట్ల సద్దుబాటు కోసం ప్రయత్నించాము,’ అని పేర్కొంది.
సీట్ల సద్దుబాటు విషయంలో ఇండియా కూటమికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూ వస్తున్నాయి. అతి కష్టం మీద.. దిల్లీ, గుజరాత్లో ఆమ్ ఆద్మీతో కాంగ్రెస్ సీట్లను సద్దుబాటు చేసుకుంది. యూపీలో సమాజ్‌వాదీ పార్టీతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి!