TS Congress Lok Sabha Seats : 14 స్థానాల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు- పథకాలు ప్లస్ అవుతాయని అంచనా!
04 March 2024, 18:44 IST
- TS Congress Lok Sabha Seats : లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. 17 స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలిపి కనీసం 14 లోక్ సభ స్థానాలను (Lok Sabha)ఎలాగైనా కైవసం చేసుకోవాలని హస్తం పార్టీ భావిస్తుంది.
14 స్థానాల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు
TS Congress Lok Sabha Seats : త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికలపై(Lok Sabha Elections) రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే బీజేపీ 9 మంది అభ్యర్థులను ప్రకటించగా......బీఆర్ఎస్ నలుగురు అభ్యర్థుల పేర్లను (BRS First List)ఖరారు చేసింది. ఇటీవలే రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress)పార్టీ సైతం అభ్యర్థులు ఎంపికపై కసరత్తు చేస్తుంది. 17 స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలిపి కనీసం 14 లోక్ సభ స్థానాలను (Lok Sabha)ఎలాగైనా కైవసం చేసుకోవాలని హస్తం పార్టీ భావిస్తుంది. ఇటీవలే నియోజకవర్గాల వారీగా జరిపిన సర్వేల్లో పార్టీకి మరింత బలం చేకూర్చినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగుతున్నట్లు కూడా తాజా సర్వేలు వెల్లడించాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీకి కలిసి వస్తాయని సర్వేలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ కు సంక్షేమ పథకాలు కలిసి వస్తాయా?
మహాలక్ష్మి(Mahalakshmi) ,గృహజ్యోతి (Gruha Jyothi)వంటి పథకాలు మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వారంతా తమ పార్టీ వైపు మొగ్గు చూపుతారని కాంగ్రెస్ ధీమాతో ఉంది. ఉచిత బస్సు ప్రయాణ పథకం ఇప్పటికే కోట్ల మంది మహిళలు వినియోగించుకుంటున్నందున వారంతా తమకు మద్దతుగా నిలుస్తారని తెలంగాణ కాంగ్రెస్ ఓ అంచనాకు వచ్చింది. కాలేశ్వరం ప్రాజెక్టు, గొర్రెల స్కాం, ఆవుల స్కాం,హెచ్ఎండీఏ అధికారుల అవినీతి తదితర శాఖలో అవినీతి బయటకు వస్తున్న నేపథ్యంలో.....ఈ అంశాలు అన్ని అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి ముఖ్య కారణమైన నిరుద్యోగులకు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఉద్యోగాల నోటిఫికేషన్లు(Job Notification), ఎల్బీ స్టేడియం వేదికగా ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తూ నిరుద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. ఇటు ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ స్పెషల్ డ్రైవ్స్ వంటి కార్యక్రమాలు కూడా తమకు ప్లస్ అవుతాయని కాంగ్రెస్ భావిస్తోంది.
స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన అభ్యర్థులు వీరే
ఇక పార్లమెంట్ అభ్యర్థుల విషయానికొస్తే ఇటీవల సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే కొంతమంది పేర్లను లిస్టు అవుట్ చేసింది. ఇటీవలే కారు దిగి హస్తం గూటికి చేరిన హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు సికింద్రాబాద్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నిజామాబాద్ టికెట్(Nizamabad Ticket) కోసం ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇటు పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, వెలుచల రాజేందర్ రావు పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. వీటితో మెదక్ నుంచి మైనంపల్లి హనుమంతరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఫైమా ఖురేషిలను కాంగ్రెస్ ప్రపోజ్ చేసినట్లు సమాచారం. ఇక చేవెళ్ల నుంచి పట్నం సునీత మహేందర్రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లురవి, మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పేర్లను టీ కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. వరంగల్(Warangal) నుంచి దొమ్మాటి సాంబయ్యతో పాటు మరో మహిళ నాయకురాలు కూడా కాంగ్రెస్ దృష్టిలో ఉన్నట్లు సమాచారం. ఇటు ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలనకు వచ్చినట్లు తెలిసింది .హైదరాబాద్, మల్కాజ్ గిరి, ఆదిలాబాద్ స్థానాలకు సరైన అభ్యర్థుల కోసం టీ కాంగ్రెస్ వెతికే పనిలో పడింది. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సైతం మూడు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
సునీల్ టీం సర్వే అనంతరం అధికారికంగా ప్రకటన?
అయితే ఆయా స్థానాల్లో సునీల్ కనుగొలు టీం సర్వే అనంతరం స్క్రీనింగ్ కమిటీ పేర్లను ఫైనల్ చేసి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికలకు కమిటీకి పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలకు దీటుగా త్వరలోనే ఎంపీ అభ్యర్థులను ప్రకటించి ఎలక్షన్ క్యాంపెయిన్ వేగవంతం చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) అవలంబిస్తున్న విధానాలతో ప్రజలకు జరుగుతున్న నష్టాలను వివరించే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న సీట్లు సాధిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా