Nizamabad Politics : నిజామాబాద్ లో ఎంపీ అర్వింద్ వర్సెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి-జోరందుకున్న మాటల యుద్ధం
Nizamabad Politics : నిజామాబాద్ పాలిటిక్స్ వేడెక్కాయి. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.

Nizamabad Politics : నిజామాబాద్ లోక్‌సభ (Lok Sabha Elections)స్థానానికి అభ్యర్థులు ఖరారు కాకముందే.. రెండు ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమయ్యింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కాంగ్రెస్(Congress) పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి(Jeevan Reddy), బీజేపీ ఎంపీ అర్వింద్(MP Arvind) మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. బీజేపీ నుంచి మరోసారి పోటీ చేసేందుకు అర్వింద్ సంసిద్ధమవ్వగా... కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది ఆశావాహులు టికెట్టు ఆశిస్తున్నారు. రోజుకొక పేరు తెర మీదకు వస్తోంది. ప్రస్తుత మాటల యుద్ధం పరిశీలిస్తే జీవన్‌రెడ్డికి టికెట్టు ఖరారు అయ్యిందా? అందుకే బీజేపీ ఎంపీ విమర్శలు గుప్పిస్తున్నారా? అని టాక్ వినిపిస్తోంది.
అర్వింద్ వర్సెస్ జీవన్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది. దీంతో లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసేందుకు ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్‌రెడ్డి సోదరుడు.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ చేశారు. అర్వింద్ ఓ అహంకారి అంటూ ఆరోపించారు. దీనిపై ఎంపీ అర్వింద్ తనదైన శైలిలో స్పందించారు. 2014 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో హుందాగా కోట్లాడుదామని, చిల్లర వ్యవహారాలు మీ ఇంట్లో వాళ్లు బంద్ చేయాలని హెచ్చరించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. అయితే అర్వింద్ వ్యాఖ్యలపై నిజామాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. అర్వింద్ ఓ అసమర్థుడని, ఎంపీగా గెలిచిన నాటి నుంచి జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. ఇలాంటి వ్యక్తిని గెలించుకుంటే అభివృద్ధి జరగదనే, కోరుట్ల ప్రజలు చెంప చెళ్లుమనిపించేలా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి పోటీ?
ఎంపీగా పోటీ చేసేందుకు జీవన్‌రెడ్డి ఆసక్తిగా ఉన్నారని సమాచారం. సీనియార్టీ ఈ ఎన్నికల్లో ఉపయోగమవుతుందని భావిస్తున్నారు. పైగా లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల భారీగానే ఓట్ల శాతం నమోదయ్యింది. ఎంపీగా అర్వింద్‌పై ఉన్న వ్యతిరేకత, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ లాంటి అంశాలు తనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి మరో ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా టికెట్టు ఆశిస్తున్నారు.
రిపోర్టింగ్ : ఎమ్.భాస్కర్, నిజామాబాద్
సంబంధిత కథనం