BJP First List TS Candidates : మల్కాజ్ గిరి బరిలో ఈటల-బీజేపీ తొలి జాబితాలో 9 మందికి ఛాన్స్!
BJP First List TS Candidates : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది పేర్లను ప్రకటించింది.
BJP First List TS Candidates : వచ్చే లోక్ సభఎన్నికలకు బీజేపీ 195 మందితో తొలి జాబితా(BJP First List) విడుదల చేసింది. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బరిలో నిలువగా, కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీలో ఉన్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ కు టికెట్ ఖరారు చేశారు. ప్రధాని మోదీ (PM Modi)మరోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు.
తెలంగాణ అభ్యర్థులు
- కరీంనగర్ - బండి సంజయ్
- నిజామాబాద్ - ధర్మపురి అర్వింద్
- జహీరాబాద్ -బీబీ పాటిల్
- మల్కాజ్ గిరి - ఈటల రాజేందర్
- సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి
- హైదరాబాద్ -డా. మాధవీ లత
- చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- నాగర్ కర్నూల్ - పి.భరత్
- భువనగిరి -బూర నర్సయ్య గౌడ్
మిగిలిన 8 స్థానాల్లో పోటీ వీరి మధ్య
బీజేపీ తొలి జాబితాలో తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు గానూ 9 చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. మరో 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎంపీలలో ముగ్గురికి టికెట్లు ఖరారయ్యాయి. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పేరును అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. మిగతా సీట్లకు సైతం పోటీ భారీగా ఉండడంతో మిగతా సీట్లు పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ సీటు కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మల్కాజ్ గిరి స్థానానికి రకరకాల ఊహాగానాల మధ్య ఈటల రాజేందర్ పేరు ఖరారైంది. మల్కాజ్‌గిరి టికెట్ కోసం సీనియర్ నేత మురళీధర్‌రావు ప్రయత్నించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరిన వెంటనే టికెట్ దక్కించుకున్నారు. నాగర్‌కర్నూల్ సీటును ఎంపీ రాములు తన కుమారుడు భరత్ కు ఇప్పించుకున్నారు. ఇక హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీపై మాధవీ లత పోటీ చేయనున్నారు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు మాత్రం తొలి జాబితాలో నిరాశే ఎదురైంది.
బీజేపీ తొలి జాబితా రాష్ట్రాల వారీగా
బీజేపీ తొలి జాబితాలో 195 మంది అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రాల వారీగా పశ్చిమబెంగాల్ నుంచి 27 మందికి టికెట్లు కేటాయించింది. మధ్యప్రదేశ్ నుంచి 24, గుజరాత్ 15, రాజస్థాన్ 15, కేరళ 12, ఛత్తీస్‌గడ్ 12, ఝార్ఖండ్ 11, తెలంగాణ 9, దిల్లీ 5, ఉత్తరాఖండ్ 3, జమ్మూకశ్మీర్ 2, అరుణాచల్ ప్రదేశ్ 2, గోవా 1, త్రిపుర 1, అండమాన్ నికోబార్ 1, దామన్ అండ్ దీవ్ 1 అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 28 మంది మహిళలు, యువతకు 47 స్థానాలు, ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు, ఓబీసీలకు 57 స్థానాలు కేటాయించారు. ప్రస్తుత కేబినెట్ లో 34 మంది మంత్రులు మళ్లీ బరిలో దిగనున్నారు.