Gruha Jyothi Mahalakshmi Scheme : గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు ప్రారంభం-అర్హులకు మరో అవకాశం!
Gruha Jyothi Mahalakshmi Schemes : 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభించారు. ఆర్థిక సమస్యలు ఉన్నా ఆరు గ్యారంటీలు అమలుకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Gruha Jyothi Mahalakshmi Scheme : మరో రెండు గ్యారంటీల తెలంగాణ ప్రభుత్వం(TS Govt) శ్రీకారం చుట్టింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్(500 Gas Cylinder) పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు సచివాలయంలో మంగళవారం ప్రారంభించారు. పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను(Six Gaurantees) తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశమని తెలిపారు. అందులో భాగంగా ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పథకాలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నామన్నారు.
సోనియమ్మ మాట శిలాశాసనం
"మహిళల కళ్లలో ఆనందం చూడాలనే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. పేదలకు పథకాలు చేరేలా అధికారులు విధి విధానాలు రూపొందించారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ పేదలకు ఇబ్బంది కలగకుండా పథకాలు అమలు చేస్తున్నాం.హామీలు అమలు చేయడంలో మా ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. తండ్రీ కొడుకులు, మామా అల్లుళ్లు తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనం. సోనియా గాంధీ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం"- సీఎం రేవంత్ రెడ్డి
ఆర్థిక ఇబ్బందులున్నా ఆరు గ్యారంటీలు అమలు
ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా ఈ పథకాల ప్రారంభ వేదికను చేవేళ్ల నుంచి సచివాలయానికి మార్చినట్లు పేర్కొన్నారు. కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కల్పించింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం అన్నారు. యూపీఏ సర్కార్ రూ.1,500కే పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక... రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1,200కి పెంచిందని ఆరోపించారు. పేదలకు గ్యాస్ సిలిండర్ భారం కాకూదని రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు.
అర్హులకు అవకాశం
రాష్ట్రంలో అర్హులందరికీ గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్(Free Power) అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు జీరో బిల్లు వస్తుందన్నారు. అర్హత ఉండి ఎవరైనా ప్రభుత్వ పథకాలకు అప్లై చేయకపోతే మళ్లీ దరఖాస్తుకు అవకాశం కల్పిస్తామన్నారు. మండల కార్యాలయాలకు వెళ్లి ప్రజాపాలన అధికారికి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తలిపారు.
సంబంధిత కథనం