Tamil Nadu politics: రానున్న లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించిన కమల్ హాసన్. కానీ..!
Tamil Nadu politics: తమిళనాడులో రానున్న లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ ల నాయకత్వంలోని విపక్ష ‘ఇండియా’ కూటమికి తన పార్టీ ఎంఎన్ఎం (Makkal Needhi Maiam) మద్దతు తెలుపుతున్నట్లు ప్రముఖ నటుడు కమల్ హాసన్ శనివారం వెల్లడించారు.
Tamil Nadu politics: తమిళనాడులో లోక్ సభ ఎన్నికల్లో అధికార ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), కాంగ్రెస్, సినీ నటుడు కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయ్యం (Makkal Needhi Maiam) ల మధ్య సీట్ల పంపకం ఒప్పందం కుదిరింది. కమల్ హాసన్ మార్చి 9న చెన్నైలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘నేను, నా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయితే ఈ కూటమికి అన్ని విధాలా సహకరిస్తాం. ఇది కేవలం పదవి కోసం కాదు, దేశం కోసం కాబట్టి చేతులు కలిపాం’’ అని కమల్ హాసన్ అన్నారు.
స్టాలిన్ తో భేటీ
చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను కమల్ హాసన్ కలిశారు. ఎంఎన్ఎం ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, కాంగ్రెస్, డీఎంకే కూటమికి మద్దతు ఇస్తుందని, ఆ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తుందని కమల్ హాసన్ స్పష్టం చేశారు. అయితే, 2025 లో ఎంఎన్ఎం పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఇవ్వాలని ఈ ఒప్పందంలో ఉందని ఎంఎన్ఎం ప్రధాన కార్యదర్శి అరుణాచలం అన్నారు.
డీఎంకే, కాంగ్రెస్ పొత్తు కసరత్తు
రానున్న లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై కాంగ్రెస్, డీఎంకే కసరత్తు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మిత్రపక్షాలుగా ఉన్నాయి. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లు కమల్ హాసన్ కొన్ని నెలల క్రితమే సంకేతాలిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కమల్ హాసన్ కు చెందిన ఎంఎన్ఎంతో పొత్తు పెట్టుకుంటామని గత ఏడాది సెప్టెంబర్లో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంకేతాలు ఇచ్చారు.
2019 లో క్లీన్ స్వీప్
తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, విడుతలై చిరుతైకల్ (వీసీకే), అనేక చిన్న పార్టీలతో కూడిన డిఎంకె నేతృత్వంలోని కూటమి 2019 లో 39 సీట్లలో 38 స్థానాలను గెలుచుకుంది. మిగిలిన ఒక స్థానాన్ని అన్నాడీఎంకే గెలుచుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పూర్తిగా చతికిలపడింది. 2019లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. మే 23న వెలువడిన ఫలితాల్లో 543 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ 303 సీట్లతో ఘన విజయం సాధించింది.