AAP-Cong alliance: లోక్ సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పొత్తు; ఢిల్లీ, గుజరాత్, గోవా, హరియాణాల్లో సీట్ల పంపకం లెక్కలివే..-aapcong alliance vs bjp in delhi haryana gujarat goa seats details revealed ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Aap-cong Alliance: లోక్ సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పొత్తు; ఢిల్లీ, గుజరాత్, గోవా, హరియాణాల్లో సీట్ల పంపకం లెక్కలివే..

AAP-Cong alliance: లోక్ సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పొత్తు; ఢిల్లీ, గుజరాత్, గోవా, హరియాణాల్లో సీట్ల పంపకం లెక్కలివే..

HT Telugu Desk HT Telugu
Feb 24, 2024 01:33 PM IST

AAP-Cong alliance: జాతీయ స్థాయిలో ఏర్పడి విపక్ష కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకంలో ఒక ముందడుగు పడింది. ఆప్, కాంగ్రెస్ ల మధ్య పొత్తు ఖరారైంది. ఢిల్లీ, గుజరాత్, హర్యానా, గోవాల్లో ఈ రెండు పార్టీలు పోటీ చేసే స్థానాల్లో స్పష్టత ఏర్పడింది. అయితే, పంజాబ్ విషయంలో మాత్రం రెండు పార్టీలు మౌనం పాటిస్తున్నాయి.

సీట్ల పంపకంపై చర్చలు జరుపుతున్న కాంగ్రెస్, ఆప్ నేతలు
సీట్ల పంపకంపై చర్చలు జరుపుతున్న కాంగ్రెస్, ఆప్ నేతలు

AAP-Congress seat sharing: లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తును ఖరారు చేసుకున్నాయి. ఢిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాలకు సంబంధించి ఇరు పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. గుజరాత్ లో కాంగ్రెస్ 24, ఆప్ 2; హరియాణాలో కాంగ్రెస్ 9, ఆప్ 1, ఢిల్లీలో ఆప్ 4, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

నాలుగు రాష్ట్రాల్లో

గుజరాత్ లో 26 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ 24 స్థానాల్లో పోటీ చేయనుంది. భరూచ్, భావ్ నగర్ స్థానాల్లో ఆప్ (AAP) అభ్యర్థులు ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ముకుల్ వాస్నిక్ తెలిపారు. హర్యానాలో 10 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటీ చేయనుంది. కురుక్షేత్రలో ఆప్ అభ్యర్థి ఉంటారు. ఢిల్లీలో ఆప్ న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీలో పోటీ చేయనుండగా, చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. సుదీర్ఘ చర్చల అనంతరం చండీగఢ్ స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయాలని నిర్ణయించినట్లు వాస్నిక్ తెలిపారు. గోవాలో కాంగ్రెస్ రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది.

పంజాబ్ లో పరిస్థితి?

పంజాబ్ లో 2022 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గద్దె దించి ఆప్ అధికారంలోకి వచ్చింది. కాగా, లోక్ సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో సీట్ల పంపకం (AAP-Congress alliance) పై ఈ రెండు పార్టీలు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పంజాబ్ లోని మొత్తం 13 లోక్ సభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. పంజాబ్, ఢిల్లీలో పాత ప్రత్యర్థులుగా ఉన్న ఆప్, కాంగ్రెస్ గత నెలలో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి సుప్రీంకోర్టు జోక్యంతో విజయం సాధించాయి.

దేశ విశాల ప్రయోజనాల కోసం..

దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకున్నామని ఆప్ , కాంగ్రెస్ తెలిపాయి. ‘‘ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. ఎన్నికల్లో గెలవడానికి ప్రతిపక్ష నాయకులను జైళ్లలో పెట్టడం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో దేశానికి నిజాయితీ, బలమైన ప్రత్యామ్నాయం అవసరం’’ అని ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ అన్నారు. అస్సాంలో సీట్ల పంపకంపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు.

బీజేపీ రియక్షన్

లోక్ సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ లు పొత్తు పెట్టుకోవడంపై బీజేపీ స్పందించింది. ఈ పొత్తు రాజకీయం అవకాశవాదమని విమర్శించింది. కాంగ్రెస్, ఆప్ ల మధ్య తీవ్రమైన విశ్వాస లేమి నెలకొని ఉన్నప్పటికీ.. వారు లోక్ సభ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకోవడం అవకాశవాద రాజకీయాలు తప్ప మరొకటి కాదని ఢిల్లీ బిజెపి నేత రామ్ వీర్ సింగ్ బిధురి అన్నారు.