తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Loksabha Polls 2024 : ఈ స్థానంలో బీఆర్ఎస్ ఓట్లు క్రాస్ అవుతాయా...? ఏం జరగబోతుంది..?

Loksabha Polls 2024 : ఈ స్థానంలో బీఆర్ఎస్ ఓట్లు క్రాస్ అవుతాయా...? ఏం జరగబోతుంది..?

HT Telugu Desk HT Telugu

28 April 2024, 11:07 IST

google News
    • Loksabha Polls 2024 in Telangana : పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. త్రిముఖ పోటీ ఉన్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో బీఆర్ఎస్ ఓట్లు క్రాస్ అవుతాయన్న చర్చ జోరుగా జరుగుతోంది.
బీజేపీకి .. బీఆర్ఎస్ ఓట్లు క్రాస్ అవుతాయా...?
బీజేపీకి .. బీఆర్ఎస్ ఓట్లు క్రాస్ అవుతాయా...?

బీజేపీకి .. బీఆర్ఎస్ ఓట్లు క్రాస్ అవుతాయా...?

Bhuvanagiri Lok Sabha constituency: తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు రక్తి కడుతున్నాయి. ఇటీవల ఓ బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ఓ ఆరోపణ చేశారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో కనీసం నాలుగు చోట్ల బీఆర్ఎస్, బీజేపీతో కుమ్మక్కయ్యింది. ఆ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు బీఆర్ఎస్ తెరవెనుక సహకారం అందిస్తోంది. దీనికోసం తమ పార్టీ నుంచి డమ్మీ అభ్యర్థులను బరిలోకి దింపింది అన్నది ఆ సంచలన ఆరోపణ. కానీ, బీఆర్ఎస్ వైపు నుంచి ఈ ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం పెద్దగా ఏదీ జరగలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇలా చేసిన ఆరోపణల్లోని నాలుగు లోక్ సభా నియోజకవర్గాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని భువనగిరి పార్లమెంటు స్థానం ఒకటి.

బీఆర్ఎస్ చేతులు ఎత్తేసిందా..?

భువనగిరి ఎంపీ సీటు విషయంలో బీఆర్ఎస్  (BRS)చేతులు ఎత్తేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థి ఎంపిక నుంచి మొదలు.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం దాకా బీఆర్ఎస్ లో పెద్దగా ఉత్సాహం కనిపించడం లేదు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఈ నియోజకవర్గంలో ఇప్పటికే రోడ్ షో కూడా జరిపి ప్రచారం చేసినా, కేడర్ లో జోష్ నింపడంలో కేసీఆర్ పర్యటన పెద్దగా ఉపయోగపడలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సీటు నుంచి టికెట్ ఆశించిన తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలక్రిష్ణారెడ్డికి టికెట్ ఇచ్చి ఉంటే, 2014 విజయం సాధించిన సీటును తిరిగి దక్కించుకునేందుకు అవకాశం ఉండేదని, కనీసం గట్టి పోటీ ఇవ్వగలిగేదన్న విశ్లేషణలు ఉన్నాయి. కానీ, ఎంపీ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇబ్రహీంపట్నం మినహా మిగిలిన ఆరు సెగ్మెంట్లకు ఏమాత్రం పరిచయం లేదని క్యామ మల్లేష్ యాదవ్ కు టికెట్ ఇవ్వడంతో ముందే ఓటమిని అంగీకరించిందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో, ఓటర్లను కలుసుకోవడంలో, పర్యటనల్లో వెనకబడి ఉన్నారు. ఆయనకు సహకరిస్తున్న నియోజకవర్గ నాయకత్వం కూడా పెద్దగా లేదు. దీంతో ఎక్కడా బీఆర్ఎస్ ప్రచార హవా కనిపించడం లేదు.

ఇదీ .... లెక్క

ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక జనగామలోనే పార్టీ ఎమ్మెల్యేగా ఉండగా, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఆరు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల మెజారిటీనే ఏకంగా 2.73 లక్షలు కావడం గమనార్హం. 18 లక్షల దాకా ఓట్లున్న భువనగిరి ఎంపీ సీటును దక్కించుకోవాలంటే పోలైన ఓట్లలో కనీసం 6 లక్షల మార్కు చేరుకోవాలన్న అంచనాలు ఉన్నాయి. భువనగిరి ఎంపీ సీటును దక్కించుకున్న బీఆర్ఎస్(BRS Party) కు 4.48 లక్షలు ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన ఆ పార్టీకి 5.27 లక్షలు వచ్చాయి. ఈ సారి కనీసం 6లక్షల పైచిలుకు ఓట్లు వస్తే గెలిచే అవకాశాలు తక్కువ. ఇప్పటికే పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య జరుగుతుందని బాగా ప్రచారం అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఒక విధంగా ఆత్మరక్షణలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం వంటి కాంగ్రెస్ కు పాజిటివ్ అంశాలు. కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుందని, మోడీ మూడో సారి ప్రధాని అవుతారని మోడీ చరిష్మాపై ఆధారపడుతున్న బీజేపీ అంచనాల్లేకుండా బరిలోకి దిగినా ప్రచారంలో ఊపుమీదుంది. బీజేపీ అభ్యర్థి 2014లో ఎంపీగా గెలిచి ఉండడం, 2019 లో స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయి ఉండడం, ఎంపీ నియోజకవర్గంలో పరిచయాలు బాగా కలిగి ఉండడం బీజేపీకి పాజిటివ్ అంశాలుగా ఉన్నాయి. కానీ, బీఆర్ఎస్ కు అనుకూలమైన వాతావరణమే లేదన్న అభిప్రాయం బలంగా ఉంది.

బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు క్రాస్ అవుతాయా..?

ఈ ఎన్నికల్లో భువనగిరి(Bhuvangiri)లో వెకబడిపోయినట్లు కనిపిస్తున్న బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ అభ్యర్థికి క్రాస్ అవుతాయన్న ప్రచారం రెండు మూడు రోజులుగా ఊపందుకుంది. బీజేపీ అభ్యర్థి గతంలో బీఆర్ఎస్ కు చెందిన వాడు కావడం, ఇదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచి ఉండడం, ఆయన సామాజిక వర్గం గౌడ్లకు అత్యధిక ఓట్లు ఉండడం, బీఆర్ఎస్ అభ్యర్థికి నియోజకవర్గంలో పెద్దగా ఎక్స్ పోజర్ లేకపోవడం, కాంగ్రెస్ ను నిలవరించడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్ధి బూర నర్సయ్య గౌడ్ కు ఉన్న బీఆర్ఎస్ లో ఉన్న వ్యక్తిగత పరిచయాలతో ఆయన అన్ని పార్టీల్లోని తమ సామాజిక వర్గానికి చెందిన వారిని, మాజీ పార్టీలోని సంబంధాలను ఇప్పటికీ కొనసాగిస్తుండడంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ లోని ఒక వర్గం పార్టీతో నిమిత్తం లేకుండా బూర నర్సయ్య గౌడ్ సహకరిస్తుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి క్రాస్ అవుతాయన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, HT TELUGU  ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి )

తదుపరి వ్యాసం