EC Notices to KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈసీ నోటీసులు-election commission serves notices to kcr for misleading claims and derogatory comments against the congress leaders ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ec Notices To Kcr : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

EC Notices to KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 17, 2024 11:12 AM IST

EC Notices to BRS Chief KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) కు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 18వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS Party FB)

EC Notices to BRS Chief KCR : ఎన్నికల వేళ నేతల ప్రసంగలు, కామెంట్లపై ఈసీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలకు ఈసీ(Election Commission of India) నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(K Chandrasekhar Rao) కు కూడా నోటీసులు పంపింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు వచ్చాయి.

ఏప్రిల్ 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో…. కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేశారు కేసీఆర్. సిరిసిల్ల కార్మికులను ఉద్దేశించి ఓ కాంగ్రెస్ నేత నిరోధులు , పాపడాలు అమ్ముకోవాలని అన్నారంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పాలనను దుయ్యబడుతూ… ఫైర్ అయ్యారు. చవటలు, దద్దమ్మలతో పాటు పలు అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు కాంగ్రెస్ నేతలు ఈసీకి(Election Commission of India) ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం… కేసీఆర్ కు మంగళవారం నోటీసులను పంపింది. ఏప్రిల్ 18వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఎన్నికల ప్రచారంలో కేసీఆర్…

మరోవైపు కేసీఆర్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మంగళవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన జ‌హీరాబాద్, మెద‌క్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే పార్లమెంట్‌లో బీఆర్ఎస్ సభ్యులు ఉండాలన్నారు. మెదక్‌ జిల్లా ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే తెలంగాణ సాధించానన్నారు.

‘‘అంబేడ్కర్‌ను గుండెల్లో పెట్టుకోవాలనే సచివాలయం ఎదురుగా 125 అడుగుల విగ్రహం పెట్టుకున్నాం. ఆయన జయంతి రోజున విగ్రహం దగ్గరకు ఈ ప్రభుత్వం వెళ్లనేలేదు. కనీసం పూలు పెట్టలేదు..నివాళులర్పించలేదు. నేను నిర్మించానని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు వెళ్లలేదు. మరి సచివాలయం నేనే నిర్మించా.. అందులో కూర్చుంటున్నారు కదా! యాదాద్రి ఆలయం నేనే నిర్మించా.. మూసేస్తారా? అంబేడ్కర్‌ను అవమానిస్తే చూస్తూ కూర్చుందామా? అవమానించిన వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామన్నారు. నాలుగు నెలలు గడిచినా చేయలేదు. మళ్లీ.. ఆగస్టు 15లోపు అంటున్నారు. వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేయాలి. దీని కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం. రుణమాఫీ, వరికి బోనస్‌ కోసం పోస్టుకార్డు ఉద్యమం చేయాలి" అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

"హామీలు అమలు చేయాలని అడిగితే బూతులు తిడుతున్నారు. నేను పదేళ్లు సీఎంగా ఉన్నా.. ఏ నాడూ ఇలా మాట్లాడలేదు. ఎవరినీ వేధించలేదు, దౌర్జన్యం చేయలేదు. ఆలోచించకుండా ఓటు వేసి ఇప్పటికే దెబ్బతిన్నాం. ప్రజాస్వామ్యంలో బాగా ఆలోచించి ఓటు వేయాలి. మేం కడుపులో పెట్టుకుని కాపాడుకున్న రైతులు ఇవాళ ఆగం అయ్యారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, సాగుకు కరెంటు లేదు. కాంగ్రెస్‌ ఐదేళ్లు అధికారంలో ఉండాలి, అప్పుడే మంచి.. చెడుకి మధ్య తేడా తెలుస్తుంది. కానీ, ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు. ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరుతారో తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రే జంప్‌ కొడతారేమో తెలియదు. బీజేపీకి ఓటు వేసినా.. మంజీరా నదిలో వేసిన ఒకటే. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం, దాన్ని వదిలేసుకోవాలి’’ అని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

 

WhatsApp channel