Warangal BRS Candidate : వ్యూహం మార్చిన బీఆర్ఎస్..! వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఊహించని పేరును ఖరారు చేసిన కేసీఆర్
Warangal Lok Sabha Constituency: వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్ కుమార్ ఖరారయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్… 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. పార్టీకి విధేయుడిగా ఉన్న నేతగా గుర్తింపు పొందిన సుధీర్ కుమార్ పేరును ఖరారు చేసేందుకు కేసీఆర్ (KCR)మొగ్గు చూపారు. సుధీర్ కుమార్ అభ్యర్థితత్వాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనల మేరకు కేసీఆర్… తుది నిర్ణయాన్ని ప్రకటించారు.
ముందుగా కావ్య పేరు…
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం(Warangal Lok Sabha Constituency) ఎస్సీ రిజర్వ్డ్(SC Reserved) కాగా ఇక్కడ స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో మొత్తంగా 18,16,428 మంది ఓటర్లు ఉన్నాయి. ఇందులో సగానికంటే ఎక్కువ స్త్రీల ఓట్లే ఉన్నాయి. పురుషులు 8,92,527 మంది ఉండగా, మహిళా ఓటర్లు 9,23,510 మంది ఉన్నారు. ఇక ఇతరులు 392 మంది ఉన్నారు. కాగా మహిళ ఓట్లే ఎక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ మార్చి 13న రిలీజ్ చేసిన క్యాండిడేట్ల జాబితాలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్యను(Kadiyam Kavya) ప్రకటించింది. కానీ మార్చి 31 ఆమె పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ లోకి చేరడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో మరోసారి సుదీర్ఘమైన కసరత్తు చేసింది బీఆర్ఎస్. ఓ దశలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య అయిన పెద్ది స్వప్న పేరును ఖరారు చేస్తారన్న వార్తలు వచ్చాయి. ఇక ఆమె పేరు కాకుండా…. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు ఖరారు కావొచ్చన్న చర్చ జోరుగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో కేసీఆర్… సుధీర్ కుమార్ పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్ తాజా ప్రకటనతో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఖరారైపోయారు. కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేశ్ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు మొన్నటి వరకు బీఆర్ఎస్ లోనే కొనసాగారు. ఇటీవలే పార్టీ మారి….ఆయా పార్టీల తరపున టికెట్లు పొంది బరిలో నిలిచారు. ఇప్పటికే కడియం టార్గెట్ గా ఆరూరి రమేశ్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు కడియం కావ్యకు వరంగల్ తో సంబంధమే లేదని… ఆమె గుంటూరు కోడలు అని విమర్శించారు. ఇక కడియ శ్రీహరి విషయంలో బీఆర్ఎస్ కూడా గుర్రుగానే ఉంది. టికెట్ తీసుకొని చివరి నిమిషంలో పార్టీని దెబ్బతీసే విధంగా కుట్ర చేశారని కోపంగా ఉంది. ఆయన్ను ఎలాగైనా ఓడించి తీరాలని భావిస్తోంది.
సంబంధిత కథనం