Manda Krishna : మాదిగలను అణగదొక్కుతున్నారు.. ఆ నేతల ఓటమికి కడియం శ్రీహరే కారణం - మందకృష్ణ
Manda Krishna On Kadiyam Srihari : కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మందకృష్ణ మాదిగ. మాదిగలను కడియం అణగదొక్కుతున్నారని ఆరోపించారు. అరూరి రమేశ్ ఓటమికీ ఆయనే కారణమన్నారు.
Manda Krishna Madiga: మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (BRS MLA Kadiyam Srihari) మాదిగలను అణగదొక్కుతున్నాడని, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్ తో పాటు ఎంపీ పసునూరి దయాకర్ రాజకీయంగా ఎదగకుండా అడ్డుపడుతున్నాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) సంచలన ఆరోపణలు చేశారు. మాదిగల ఎదుగుదలను జీర్ణించుకోలేక అవాంతరాలు సృష్టిస్తున్నాడని మండిపడ్డారు.

హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంద కృష్ణ మాదిగ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరి మాదిగల ఎదుగుదలను అడుగడుగునా అడ్డుకుంటున్నాడన్నారు. మాదిగల ఎదుగుదల ను జీర్ణించుకోలేకపోతున్న కడియం శ్రీహరి 40 ఏళ్లుగా తను మాదిగ కులస్థుడినని నమ్మిస్తూ రాజకీయ లబ్ది పొందుతున్నాడని ఆరోపించారు. కడియం బైండ్ల కులస్తుడని, కానీ మాదిగ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగాడని విమర్శించారు. ఆయన ఎదుగుదల కోసం మాదిగలను అడ్డుకుంటూ వస్తున్నాడని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఉప ముఖ్యమంత్రి వరకు మాదిగల సహకారంతో ఎదిగాడని, కానీ మాదిగలను మాత్రం ఆయన స్థాయి ఎదగనివ్వడని మండిపడ్డారు. ఆయన వల్ల ఎదిగిన మాదిగలు ఎవరున్నారో చూపాలని డిమాండ్ చేశారు.
మాదిగలకు ఉనికి లేకుండా చేస్తున్నాడు..
ఎలాంటి ప్రోత్సాహం లేకుండా ఎదిగిన ముగ్గురు మాదిగలకు కడియం శ్రీహరి రాజకీయంగా ఉనికి లేకుండా చేస్తున్నాడని మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ను రాజకీయంగా అణగదొక్కుతున్నది ఆయనేనని మంద కృష్ణ విమర్శించారు. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను ఆరు నెలలు తిరగకముందే తొక్కేశారని ఆరోపించారు. కడియం శ్రీహరి ఎంపీగా ఉన్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి పదవిపైనా కన్నేశాడన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ రాజయ్యకు దక్కకుండా చేసి, ఆ టిక్కెట్ తానే తీసుకున్నాడని విమర్శించారు. ఎవరి అండ లేకుండా స్వతహాగా ఎదిగిన ఆరూరి రమేష్ ను కూడా కడియం శ్రీహరే అణగతొక్కాడని విమర్శించారు. మొన్నటి ఎలక్షన్స్ లో వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆరూరి రమేశ్ ఓటమికి ఆయనే కారణమనన్నారు. మాదిగల పేరు చెప్పుకొని దళిత వర్గాలపై ఆధిపత్యం చెలాయిస్తున్న నాయకుడు కడియం శ్రీహరి అని మంద కృష్ణ తీవ్ర విమర్శలు చేశారు.
మాదిగల వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ మాదిగ జాతి అభివృద్ధికి వ్యతిరేకంగా పని చేస్తోందని మంద కృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో అనేక సార్లు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాదిగలను మోసం చేసిందని విమర్శించారు. ఎస్సీలకు పార్టీలో, ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించడంలో కూడా బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరించిందన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రధాన మంత్రి మోదీతోనే సాధ్యమవుతుందని, మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఎమ్మార్పీఎస్ కృషి చేస్తుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను ఓడగొట్టేంత వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్ - హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)