KCR On Dalit Bandhu: లక్షా 30 వేల మందితో దీక్షకు దిగుతా - కాంగ్రెస్ సర్కార్ కు కేసీఆర్ వార్నింగ్
KCR Election Campagin 2024 : కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అన్ని స్థానాల్లో గెలిపించాలని కోరారు. దళితబంధు స్కీమ్ కు ఎంపికైన వారితో కలిసి దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
KCR Election Campagin 2024: దళిత బంధు(Dalitha Bandhu) స్కీమ్ లో భాగంగా లక్షా 30 వేల మందికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పది లక్షలు విడుదల చేశామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR). కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ నిధులను ఆపివేసిందన్నారు. వారికి న్యాయం చేయకపోతే.... దళిత బిడ్డలతో కలిసి హైదరాబాద్ లోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ప్రభుత్వం మెడలు వంచి దళిత బంధు(Dalitha Bandhu Scheme) కోసం విడుదల చేసిన పది లక్షల రూపాయను ఎంపికైనవారికి వచ్చేలా చేస్తామన్నారు.
శనివారం చేవెళ్ల సభలో మాట్లాడిన కేసీఆర్(KCR) … కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే…. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలవాలన్నారు. మళ్లీ కాంగ్రెస్ కు ఓటేస్తే...మేము ఏం చేయకపోయినా సరే ప్రజలు మమ్మల్ని గెలిపించారంటారని, అలాంటి అవకాశం వారికి ఇవ్వొద్దని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమన్న కేసీఆర్… తన ముందే ప్రజలు ఇన్ని అవస్థలు పడుతుంటే బాధనిపిస్తోందన్నారు. తాను బతికి ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల కోసం పోరాడుతానని ఉద్ఘాటించారు.
“డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి పుణ్యమా అనే ఆర్టికల్ 3 ద్వారా మనం తెలంగాణను సాధించుకున్నాం. అంబేడ్కర్ గారికి సమున్నత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సచివాలయానికి మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి పేరు పెట్టిన గౌరవించుకున్నాం. సమస్య ఉంటే ఆదుకునే ప్రభుత్వం మాకు ఉందని ప్రజలకు ధీమా ఉండాలె. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంతులేని హామీలు, ప్రలోభాలతో కిందమీద చేస్తే కాంగ్రెస్ గెలిచింది. 4 నెలల అయిన సరే వారి చిత్తశుద్ది లేదు. ఓ పాలసీ అంటూ లేదు. ఉన్న వనరులను వాడుకునే తెలివి. 10 ఏళ్ల కింద మనం మరచిపోయిన సమస్యలన్ని మళ్లీ కనబడుతున్నాయి. అంబేడ్కర్ గారు, ఫూలే గారి ఆశయాలను గత 70 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఆచరణలో పెట్టాం. 11 వందల గురుకుల పాఠశాలలను పెట్టుకున్నాం. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్ పెట్టుకున్నాం. ప్రభుత్వం మెడలు వంచి దళిత బంధు కోసం విడుదల చేసిన పది లక్షల రూపాయల దళిత బంధు వచ్చేలా చేస్తాం. కళ్యాణ లక్ష్మి కి తులం బంగారం కలిసి ఇస్తా అన్నారు. ప్రభుత్వానికి కొనటానికి బంగారం దొరకటం లేదా..?” అని కేసీఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్ పక్కకు పోగానే 24 గంటల కరెంట్ ఉండకుండా పోతదా? అని ప్రశ్నించారు. అంటే ఇది వీళ్ల చేతగాని తనమని దుయ్యబట్టారు. “మిషన్ భగీరథ అద్భుతమైన పథకం. ఐక్యరాజ్యసమితి కూడా మెచ్చుకుంది. ఇప్పుడు కరెంట్ కు ఏం రోగం వచ్చింది. నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. ఇదేమీ లోపం? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలె. ఎందుకు పాత ప్రభుత్వం పోగానే ప్రజలకు ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చినయ్. ప్రభుత్వాన్ని ఈ అంశాల్లో నిలదీసే అంకుశం మనకు కావాలె. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే అన్ని లోక్ సభ సీట్లు బీఆర్ఎస్ గెలవాలె. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. నేను బతికి ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల కోసం పోరాడుతాను” అని కేసీఆర్ స్పష్టం చేశారు.
రంజిత్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్….
KCR On Ranjith Reddy : రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది. ఎందుకు పార్టీ మారిండు ? అని కేసీఆర్ ప్రశ్నించారు. “బీజేపీ, కాంగ్రెస్ తరపున నిలబడ్డ వ్యక్తులెవరు ప్రజలకు తెలిసిన వారు కాదు. ఎందుకు రంజిత్ రెడ్డి పార్టీ మారిండు. ఇలాంటి వ్యక్తులకు మీరే ధీటైన బుద్ధి చెప్పాలె. అన్ని పంటలు కొంటామని ప్రభుత్వం మాట ఇచ్చింది. వానాకాలం పంట కొనుగోళ్లు స్టార్ట్ అయ్యాయి. మరి రూ. 500 బోనస్ ఇస్తారా? ఇయ్యారా ? ఇస్తా అని ఇవ్వకపోతే ఓట్ల రూపంలో గుద్ది వాళ్లను ఓడగొట్టాలె. భావాద్వేగాలు లేపటం తప్పా...బీజేపీతో ఒక్క వర్గానికైనా మంచి జరిగిందా? అయితే మోడీ లేదంటే ఈడీ. ఇదేనా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధానం. ఈ బీజేపీ పరిపాలనను మన పదేళ్లుగా చూడటం లేదా? బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే మళ్లీ రైతుల మోటార్లకు మీటర్లు వస్తాయి. మీటర్లు రావద్దంటే బీజేపీని గుద్దుడు గుద్దలే. నేలకేసి కొట్టాలె. అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్లు. బలహీన వర్గాల కోసం ఆస్తిని, జీవితాన్ని ధారపోసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ . బీసీలకు దమ్ముంటే కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించి చూపించలే అని ఓ కాంగ్రెస్ నాయకుడు అన్నాడు. కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించి బీసీల శక్తి, బీసీల రాజకీయ చైతన్యాన్ని చూపించాలె” అని కేసీఆర్ పిలుపునిచ్చారు.