KCR Campaign : ఎన్నికల ప్రచారంలోకి కేసీఆర్..! ఇవాళ చేవేళ్ల వేదికగా బీఆర్ఎస్ తొలి సభ
KCR Election Campaign 2024 : లోక్ సభ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు కేసీఆర్. ఇవాళ చేవెళ్లలో తలపెట్టిన భారీ సభకు హాజరై ప్రసంగించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ చేపట్టిన తొలి సభ ఇదే.
KCR Election Campaign 2024 : పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Election-2024) పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేసిన బీఆర్ఎస్…. ఇక ప్రచారంలోకి రానుంది. ఇప్పటికే 17 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసింది గులాబీ పార్టీ. దీంతో ప్రచారంలో దూకుడు పెంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగా…. ఇవాళ చేవెళ్ల వేదికగా తొలి సభను తలపెట్టింది. ఇందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR)హాజరుకానున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి సభ
గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్(BRS Party)… ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. ఓవైపు కీలక నేతలు పార్టీని వీడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. క్షేత్రస్థాయిలోని పలువురు లీడర్లు కూడా దారి చూసుకుంటున్నారు. దీంతో ఈ ఎన్నికలు గులాబీ పార్టీకి అతిపెద్ద సవాల్ గా మారాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో తొమ్మిది స్థానాలను గెలిచిన బీఆర్ఎస్… ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. అధికారం కోల్పోయిన తర్వాత… ఇటీవలే కేసీఆర్ పొలం బాట పేరుతో రైతుల వద్దకు వెళ్లారు. ఉమ్మడి నల్గొండతో పాటు కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఇందులో కేవలం రైతు సమస్యలపైనే మాత్రం కేసీఆర్ మాట్లాడారు.
ఇక ఇప్పుడు అభ్యర్థుల ఖరారు పూర్తి కావటంతో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది బీఆర్ఎస్(BRS). ఇప్పటికే సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో… ఇవాళ్టి నుంచి కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. చేవెళ్ల వేదికగా తలపెట్టిన భారీ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రి సబితా, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య తో పాటు ఇతర నేతలు పర్యవేక్షిస్తున్నారు.
చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్…
సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారటంతో ఇసారి చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ కు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన కాసాని… గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరారు. ఆ సమయంలో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఆయన్ను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ… ప్రచారం చేసుకుంటున్నారు కాసాని జ్ఞానేశ్వర్. మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ తరపున రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు
- కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్
- చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్
- మహబూబాబాద్ (ఎస్టీ ) – మాలోత్ కవిత
- ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు
- పెద్దపల్లి(ఎస్సీ ) – కొప్పుల ఈశ్వర్
- మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి
- మెదక్ – పీ వెంకట్రామి రెడ్డి
- నాగర్ కర్నూల్ (ఎస్సీ )- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్
- భువనగిరి – క్యామ మల్లేశ్
- నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి
- హైదరాబాద్ – గడ్డం శ్రీనివాస్ యాదవ్
- వరంగల్ (ఎస్సీ) – డాక్టర్ మారెపెల్లి సుధీర్ కుమార్
- నిజామాబాద్ – బాజి రెడ్డి గోవర్ధన్
- జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్
- ఆదిలాబాద్(ఎస్టీ ) – ఆత్రం సక్కు
- మల్కాజ్ గిరి – రాగిడి లక్ష్మా రెడ్డి