KCR Election Campaign 2024 : ఎన్నికల ప్రచారంలోకి గులాబీ బాస్ కేసీఆర్ - ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ సభ
KCR Election Campaign 2024: లోక్ సభ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏప్రిల్ 13వ తేదీన చెవేళ్లలో తలపెట్టిన సభకు కేసీఆర్ హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
KCR Election Campaign 2024 : అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవటంతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్…. పార్లమెంట్ ఎన్నికల్లో(Loksabha Polls 2024) సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే 17 స్థానాలకుగానూ అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR)….ఇక ఎన్నికల ప్రచారంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా నేతలతో భేటీ అయిన కేసీఆర్… అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేసేశారు. ఇక ప్రజాక్షేత్రంలోకి దిగి ప్రచారంలో(KCR Election Campaign) స్పీడ్ పెంచే యోచనలో ఉన్నారు.
చేవెళ్లలో సభ…
అభ్యర్థులు ఖరారు కావటంతో.... పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ సభలను తలపెట్టేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్. ఇప్పటకే ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా… ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ(Chevella Lok Sabha constituency) పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ షెడ్యూల్ గురించి చెప్పారు కేటీఆర్. ఏప్రిల్ 13వ తేదీన చేవెళ్లలో పార్టీ తరపున భారీ బహిరంగ సభ ఉంటుందని… ఇందుకు కేసీఆర్ హాజరవుతారని వెల్లడించారు. ఈ సభను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్…
ఈ సందర్భంగా పార్టీని వీడిన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు. “రంజిత్ రెడ్డి ఎవరో మన పార్టీ సీటు ఇచ్చి, గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసింది. 2019లో రాజకీయాలకు కొత్త అయినా పార్టీలో ఉన్న, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారు. రంజిత్ రెడ్డికి రాజకీయంగా పార్టీలో అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చాము, నియోజకవర్గంలో స్వేచ్చ ఇచ్చాం. ఈ ఎన్నికల్లో పోటీ చేయను అని పార్టీ ముందు అశక్తతను వ్యక్తం చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి, కేవలం అధికారం, ఆస్తుల కోసమే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని విడిచి ద్రోహం చేశారు. పార్టీ సీనియర్ నాయకురాలు… రంజిత్ రెడ్డి తన సోదరి అని చెప్పుకునే కవితపైన(MLC Kavitha Arrest) కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాల పేరుతో దాడి చేసి… అరెస్టు చేసిన రోజే.. ఆయన నవ్వుకుంటు పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరిన స్వార్థపరుడు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా రంజిత్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని, పార్టీకి మోసం చేసి వెళ్ళాడు అని చర్చించుకుంటున్నారు. గతంలో ఎన్నికలకు ముందు అప్పటి మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీ కన్నా తానే ఎక్కువ అనుకొని ఇతర పార్టీలోకి వెళితే ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. ఒక పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరు. అదే నిజమైతే దేశంలో పార్టీలు ఉండవు. స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి(MP Ranjith Reddy) మనుసులు కలిసినంత మాత్రాన…. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిపోతాయనుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం. ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అయోమయం నెలకొని ఉంది. చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదు. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యం. చేవెళ్ల నియోజకవర్గంలో 13వ తేదీన కేసీఆర్ గారి బహిరంగ సభ ఉంటుంది” అని కేటీఆర్ వెల్లడించారు.
సామాజిక సమీకరణాల రీత్యా కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు సులభం అవుతుందన్నారు కేటీఆర్. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజులతోపాటు బీసీల కోసం కొన్ని దశాబ్దాలుగా అండగా నిలబడిన వ్యక్తి అని చెప్పారు. ఒకవైపు బీసీల కోసం పాటుపడుతూనే, మరోవైపు అన్ని సామాజిక వర్గాలను, మైనార్టీలను కలుపుకుపోయిన మంచి మనిషి, నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని.. అలాంటి వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు.