KCR Bus Yatra : జనం వద్దకు కేసీఆర్ - ఈ నెల 22 నుంచి బస్సు యాత్రకు శ్రీకారం
BRS KCR Bus Yatra : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. ఇందుకోసం బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించగా… తేదీలను కూడా ఖరారు చేశారు.
BRS KCR Bus Yatra : పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్(BRS) పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఈ ఎన్నికలు అతిపెద్ద సవాల్ గా మారాయి. అయితే ఈ లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన స్థానాలను గెలుచుకోని సత్తా చాటాలని భావిస్తోంది గులాబీ అధినాయకత్వం. ఇప్పటికే 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్(KCR)… పలు సభలకు కూడా హాజరయ్యారు. చేవెళ్ల, సంగారెడ్డిలో తలపెట్టిన సభలు విజయవంతం కావటంతో… మరింత దూకుడు పెంచాలని భావిస్తున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. అయితే ఆయన బస్సు యాత్ర ద్వారా జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఏప్రిల్ 22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర…
పార్లమెంట్ ఎన్నికల(Loksabha Elections 2024) నేపథ్యంలో ఏప్రిల్ 22వ తేదీ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర(BRS KCR Bus Yatra) ప్రారంభం కానుంది.మిర్యాలగూడ నుంచి ప్రారంభమై సిద్ధిపేటలో ఈ యాత్ర ముగియనుంది. మే 10వ తేదీ వరకు ఈ యాత్ర ఉంటుందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం శుక్రవారం ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ ను కూడా కలిసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి… "కేసీఆర్ బస్సు యాత్ర" పర్మిషన్ కోసం వివరాలను సమర్పించారు. ఎన్నికల సందర్భంగా అధికారులందరూ ఈసీ పరిధిలోకి వస్తారు కాబట్టి యాత్రకు సంబంధించి తగు భద్రత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాత్రలో పోలీసు సహకారం అందేలా ఆదేశాలు ఇవ్వాలని.. సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించి వాటిపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టాలని.. అవసరమైతే కేంద్ర బలగాలను మొహరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ కార్యకర్తలపై, సోషల్ మీడియా వారియర్స్ పై దాడులు చేస్తూ, తాము కడుతున్న ఫ్లెక్సీలను, బ్యానర్స్ ను తొలగిస్తుందని ఫిర్యాదు చేశారు. చేవెళ్ల సభకు సంబంధించి, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగిన బహిరంగ సభలో పెట్టిన ఫ్లెక్సీలను తొలగించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు.
ఇప్పటికే పలు సభలను నిర్వహించింది బీఆర్ఎస్. పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కేసీఆర్ బస్సు యాత్ర(KCR Bus Yatra) ఖరారు అయింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించేలా ఈ యాత్రను ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ బస్సు యాత్రలో భాగంగా ఎండి పంట పొలాలను పరిశీలించటంతో పాటు రోఢ్ షోలలో కూడా పాల్గొనున్నారు. ఉదయం 11 వరకు పొలం బాట చేపట్టాలని కేసీఆర్ యోచిస్తున్నారు. సాయంత్రం నుంచి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు మూడు చోట్ల రోడ్డు షోలు తలపెట్టాలని చూస్తున్నారు. మరోవైపు సిద్దిపేట, వరంగల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.