Kadiyam Vs Thatikonda : కడియంను దెబ్బ కొట్టేందుకు గులాబీ పార్టీ ప్లాన్, బీఆర్ఎస్లోకి రాజయ్యకు రీఎంట్రీ
Kadiyam Vs Thatikonda : వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించినా...కాంగ్రెస్ లోకి వెళ్లి బీఆర్ఎస్ పరువు తీశారని గులాబీ నేతలు కడియంపై రగిలిపోతున్నారు. దీంతో కడియం కుమార్తె కావ్యను ఓడించేందుకు తాడికొండ రాజయ్యను రంగంలోకి దింపారు.
Kadiyam Vs Thatikonda : కడియం శ్రీహరి(Kadiyam Srihari) విషయంలో బీఆర్ఎస్(BRS)పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్లమెంట్ టికెట్కన్ఫామ్ చేసిన తరువాత పార్టీ నుంచి బయటకు వెళ్లి పార్టీ పరువు తీశారనే ఉద్దేశంతో గులాబీ నేతలు కడియంపై మండిపడుతుండగా.. ఎలాగైనా కాంగ్రెస్ అభ్యర్థి, కడియం కూతురు కావ్యను ఓడగొట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టున్న నేత, కడియం శ్రీహరితో వైరం ఉన్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను మళ్లీ పార్టీలోకి పట్టుకొచ్చింది. ఈ మేరకు రెండురోజుల కిందట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) ‘కారు’ పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వగా.. కడియంను దెబ్బకొట్టేందుకు గులాబీ నేతలు తాటికొండకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన కడియంను ఓడగొట్టాలనే కసితో పార్టీలో చేరిన మరునాటి నుంచే యాక్షన్ స్టార్ట్ చేశారు.
మొదట్నుంచీ ఢీ అంటే ఢీ
కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య(Kadiyam vs Thatikonda) మధ్య మొదట్నుంచీ విభేదాలున్నాయి. కడియం టీడీపీ, రాజయ్య కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, చివరకు బీఆర్ఎస్ లో చేరారు. అంతకుముందే ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరి మధ్య గతం నుంచే మనస్ఫర్థలున్నాయి. ఇదిలాఉంటే స్టేషన్ఘన్పూర్నియోజకవర్గంలో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజయ్య 2023 ఎన్నికల్లో కూడా శాసనసభ టికెట్ ఆశించారు. అదే టికెట్ పై కడియం శ్రీహరి కూడా ఆశలు పెట్టుకున్నారు. కాగా 2023 ఎన్నికల సమయంలో స్టేషన్ ఘన్పూర్(Station Ghanpur) టికెట్ రాజయ్యకు దక్కకుండా కడియం శ్రీహరే తెరవెనుక రాజకీయం చేశారనే ఆరోపణలున్నాయి. అందులో ప్రధానంగా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య చేసిన లైంగిక వేధింపుల విషయం రాజయ్య ఇమేజ్ను బాగా డ్యామేజ్ చేసింది. వాస్తవానికి ఆ ఘటన 2019లో జరగగా, కడియం శ్రీహరి కావాలనే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు తెరమీదకు తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది. దీంతో కడియం తీరుపై రాజయ్యకు పీకల్దాక కోపం పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య చాలాసార్లు మాటల యుద్ధం కూడా జరిగింది. ఇదిలాఉంటే కారణాలేమైనా బీఆర్ఎస్ అధిష్ఠానం రాజయ్యకు టికెట్ నిరాకరించి, కడియంకు కేటాయించగా, ఆయన విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు.
రాజయ్య రాజీనామా, రీఎంట్రీ
ఆ తరువాత రాజయ్య ఎటూ వేగలేక ఈ ఏడాది ఫిబ్రవరి 3న బీఆర్ఎస్(BRS)కు రాజీనామా చేసి, పార్టీ నుంచి బయటకు వెళ్లారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య(Kadiyam Kavya) ఎంపిక కాగా.. రాజయ్యకు మళ్లీ నిరాశే మిగిలింది. ఇక తప్పని సరి పరిస్థితుల్లో రాజయ్య మళ్లీ బీఆర్ఎస్ వైపు చూశారు. ఆరూరి రమేశ్, కడియం కావ్య వెళ్లిన తరువాత గులాబీ పార్టీకి సరైన అభ్యర్థి దొరక్కపోవడంతో మళ్లీ బీఆర్ఎస్లో చేరి ఎంపీ అభ్యర్థిగా నిలవాలని ఆరాటపడ్డారు. కానీ పార్టీ వీడిన వాళ్లను మళ్లీ తీసుకునే ప్రసక్తే లేదని కేటీఆర్, హరీశ్‌రావు పలు సందర్భాల్లో చెబుతూ రాగా, క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా అదే కోరుకున్నారు. ఒకవేళ పార్టీ నాయకులు, కార్యకర్తల అభీష్ఠాన్ని పట్టించుకోకుండా రాజయ్యను చేర్చుకుంటే నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో ఆయనను పక్కన పెట్టారు. నాలుగు రోజుల కిందట హనుమకొండ జడ్పీ చైర్మన్డాక్టర్ మారపెల్లి సుధీర్‌కుమార్‌కు టికెట్ కేటాయించారు.
బీఆర్ఎస్వ్యూహానికి రాజయ్య తోడు
టికెట్ఇచ్చిన తరువాత పార్టీకి ద్రోహం చేసి వెళ్లాడని కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ తీవ్ర కోపంతో ఉంది. మరో వైపు తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా చేసి, పార్టీ నుంచి వెళ్లేలా చేశారని తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) కూడా కడియంపై రగిలిపోతున్నారు. ఇప్పుడు ఇద్దరి టార్గెట్ ఒక్కరే కాగా.. ఎలాగైనా కడియంను ఓడగొట్టాలని బీఆర్ఎస్ప్లాన్ చేసింది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల తరువాత రాజయ్యపై కొంత సానుభూతి పెరగగా.. ఆయనను మళ్లీ పార్టీలోకి తీసుకుని కడియంను దెబ్బకొట్టాలని ప్లాన్చేసింది, ఈ వ్యూహంలో భాగంగానే రెండు రోజుల కిందట తాటికొండ రాజయ్యను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో గత ఆదివారం రాజయ్య గులాబీ కండువా కప్పుకోగా.. ఆయనకు ప్రచారం బాధ్యతలు అప్పగించారు. దీంతో స్టేషన్‌ఘన్‌పూర్‌లో మళ్లీ యాక్టివ్ అయిన తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి తీరును ఎండ గడుతున్నారు.
వెన్నుపోటుదారుడు కడియం : తాటికొండ రాజయ్య
తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah)కు ప్రచార బాధ్యతలు అప్పగించిన అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ (Station Ghanpur)నియోజకవర్గానికి వచ్చిన ఆయన.. కడియం శ్రీహరిపై ప్రతీకారం తీర్చుకునే పనిలో పడ్డారు. ఈ మేరకు మొదట స్టేషన్‌ఘన్‌పూర్ లో తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి కడియం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వెన్నుపోటు రాజకీయాలకు కడియం శ్రీహరి(Kadiyam Srihari) కేరాఫ్అని కామెంట్స్చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు, బీఆర్ఎస్లో చేరి కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఆ తరువాత వరంగల్ (Warangla)పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటూ కడియం శ్రీహరిని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. కడియంపై పగ తీర్చుకోవడానికి బీఆర్ఎస్(BRS) రాజయ్యను రంగంలోకి దించగా.. ఆయన కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు. కానీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండటం కడియంకు కలిసొచ్చే అంశం కాగా.. ఆయన ఓడించేందుకు బీఆర్ఎస్, రాజయ్య తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఇప్పటికే కడియంపై మాటల యుద్ధం చేస్తున్న బీఆర్ఎస్, తన వ్యూహాలతో ఎంతమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం