INDIA bloc PM Candidate: ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరవుతారో చెప్పేసిన ఖర్గే
31 May 2024, 17:30 IST
INDIA bloc PM Candidate: ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవికి ఎవరికి లభిస్తే బావుంటుందో తన మనసులోని మాటను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అయితే, అంతిమంగా ప్రధాని ఎవరనేది ఇండియా కూటమి ఉమ్మడిగా నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే
లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. జూన్ 1న తుది దశ పోలింగ్ జరగనుంది. ప్రధాన రాజకీయ పార్టీల అగ్ర నేతలు జూన్ 4వ తేదీన వెల్లడయ్యే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగించాయి. ఈ నేపథ్యంలో ‘ఇండియా’ కూటమి (INDIA bloc) అధికారంలోకి వస్తే ప్రధాని పదవికి ఎవరికి లభిస్తే బావుంటుందో తన మనసులోని మాటను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. అయితే, అంతిమంగా ప్రధాని ఎవరనేది ఇండియా కూటమి ఉమ్మడిగా నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
నా చాయిస్ ఆయనే..
‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవికి అర్హుడైన వ్యక్తి రాహుల్ గాంధీ యేనని ఖర్గే చెప్పారు. ప్రస్తుతం కూటమి నేతల్లో దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) యేనని వివరించారు. అందువల్ల ప్రధాని పదవికి తన ఎంపిక రాహుల్ గాంధీ అని న్యూస్ చానల్ ఎన్డీ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్లిఖార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తన ఎంపిక అని, ఆయన యువతకు, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఖర్గే అన్నారు.
కూటమి నేతలదే తుది నిర్ణయం
అయితే, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి ఐకమత్యంతో పోరాడిందని, అందువల్ల గెలిచిన తర్వాత ప్రధాని ఎవరనేది కూటమి నేతలు ఉమ్మడిగా నిర్ణయిస్తారని ఖర్గే వివరించారు. తాను కూడా ప్రధాని అభ్యర్థిని కావచ్చన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ‘‘నా (సొంత) పేరును నేను ఎలా ప్రతిపాదించగలను? పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కూటమి పార్టీలు నా పేరు చెప్పి ఉండవచ్చు కానీ, మా పార్టీలో మేమంతా కూర్చొని నిర్ణయం తీసుకుంటాం... 2004 లేదా 2009లో మాదిరిగానే ఈ ప్రక్రియ ఉంటుంది’’ అని ఖర్గే వివరించారు.
ప్రియాంక గాంధీ పోటీ చేస్తే బావుండేది
ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తాను కోరుకున్నానని వెల్లడించారు. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న ఖర్గే.. బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎవరన్న మీడియా ప్రశ్నకు.. 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమంలో అడిగినట్లే ఉందని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ కు ప్రధాని అయ్యే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. ఆప్ చాలా చిన్న పార్టీ కాబట్టి అది సాధ్యం కాకపోవచ్చని తాను భావిస్తున్నానన్నారు. కూటమిలో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందో ఆ పార్టీ ప్రధాని పదవికి సహజ హక్కుదారుగా ఉంటుందని జైరాం రమేష్ అన్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడిన 48 గంటల్లో ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటిస్తామని తెలిపారు.