Mallikarjun Kharge as PM face: విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రధాని అభ్యర్థిగా మల్లిఖార్జున్ ఖర్గే!
Mallikarjun Kharge as PM face: విపక్ష కూటమి ఇండియా తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేని ప్రకటించాలన్న ప్రతిపాదన మంగళవారం ఢిల్లీలో జరిగిన కూటమి సమావేశంలో వచ్చింది.
Mallikarjun Kharge as PM face: విపక్ష కూటమి ‘ఇండియా’ సమావేశం మంగళవారం ఢిల్లీలోని అశోకా హోటల్ లో జరిగింది. ఈ సమావేశంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై ప్రాథమికంగా చర్చించారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ () ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. తమ వ్యూహాలను ఏ విధంగా మార్చుకోవాలనే విషయంలో కూటమి నేతలు చర్చించారు. అలాగే, కూటమిలోని పార్టీల మధ్య లోక్ సభ ఎన్నికల సీట్ల పంపకంపై కూడా చర్చించారు.
సస్పెన్షన్ పై తీర్మానం..
పార్లమెంటులో భద్రత వైఫల్యం ఘటనపై చర్చించాలని, దీనిపై లోక్ సభ లేదా రాజ్య సభలో ప్రధాని మోదీ కానీ, హోెంమంత్రి అమిత్ షా కానీ ప్రకటన చేయాలని కోరుతున్న విపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఇండియా కూటమి సమావేశంలో విపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు.
ప్రధాన మంత్రి అభ్యర్థిగా..
కాగా, విపక్ష కూటమి ఇండియా తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీనియర్ దళిత నేత అయిన మల్లిఖార్జున్ ఖర్గేను ప్రకటించాలని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అర్వింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. అయితే, ఆ ప్రతిపాదనపై ఖర్గే స్పందిస్తూ.. ‘ఇప్పుడు గెలవడం ముఖ్యం కానీ, పీఎం అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు’’ అని స్పష్టం చేశారని సమాచారం. కూటమి సమావేశంలో చర్చలు మంచి వాతావరణంలో జరిగాయి. సీట్ల పంపకం, ప్రచార కార్యక్రమంపై చర్చ జరిగింది. మరో 20 రోజుల్లో దీనిపై కార్యాచరణ వెల్లడవుతుంది’’ అని ఆ సమావేశంలో పాల్గొన్నఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా వెల్లడించారు.
28 పార్టీల నాయకులు..
సమావేశానికి కాంగ్రెస్ నుంచి పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీఎంకే నేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితర 28 పార్టీల నాయకులు పాల్గొన్నారు.