Lok Sabha elections: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చెప్పేసిన ఖర్గే-mallikarjun kharge predicts how many seats bjp will win in lok sabha elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చెప్పేసిన ఖర్గే

Lok Sabha elections: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చెప్పేసిన ఖర్గే

HT Telugu Desk HT Telugu

Mallikarjun Kharge: త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతోందో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ముందే జోస్యం చెప్పేశారు. ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీ, అమేథీ ప్రజల్లో విద్వేషాలు నాటేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఖర్గే ఆరోపించారు.

అమేథీలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే.. తదితరులు (ANI)

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి, వరుసగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నామని బీజేపీ పగటి కలలు కంటోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. కానీ, వాస్తవానికి, రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోబోతుందని ఖర్గే జోస్యం చెప్పారు. అమేథీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 400 సీట్ల కోరిక కలగానే మిగిలి పోతుందన్నారు.

100 కూడా రావు..

రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లు కూడా రావని, ఆ పార్టీని ప్రజలు అధికారం నుంచి తరిమికొడతామని ఖర్గే పేర్కొన్నారు. ‘‘400 కు పైగా సీట్లు గెలుచుకుంటామని బీజేపీ చెబుతున్నప్పటికీ ఆ పార్టీ గెలుచుకునే సీట్ల సంఖ్య 100 కూడా దాటదు. అబ్కీ బార్, సత్తా సే బహార్ (ఈసారి వారు అధికారం నుంచి దూరం)' అని ఖర్గే వ్యాఖ్యానించారు. అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన అమేథీ, రాయ్ బరేలీ ప్రజలలో విద్వేషాలు నాటేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.

ప్రాజెక్టులు నిలిపేశారు

కాంగ్రెస్ హయాంలో అమేథీలో కోట్లాది రూపాయల విలువైన ప్రాజెక్టులు మంజూరయ్యాయని, కానీ వాటిలో చాలా వరకు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయని ఖర్గే విమర్శించారు. ‘‘రాయ్ బరేలీ, అమేథీలకు మంజూరైన ప్రాజెక్టులు ఇంకా ఎందుకు అసంపూర్తిగా ఉన్నాయని బీజేపీని అడగాలనుకుంటున్నాను. అమేథీ, రాయ్ బరేలీ కోసం పనిచేయడం వారికి ఇష్టం లేదు’’ అని ఖర్గే విమర్శించారు. రాయ్ బరేలీ, అమేథీ ప్రజలలో విద్వేషాలు నాటేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. గాంధీ కుటుంబంతో అమేథీ ప్రజలకు గాఢమైన అనుబంధం ఉందని ఖర్గే అన్నారు. ‘‘రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు కష్టపడిన గడ్డ ఇది. మీకు (అమేథీ ప్రజలకు) వారితో (గాంధీ కుటుంబంతో) గాఢమైన అనుబంధం ఉంది’’ అన్నారు.

మోదీ కుట్రలు

‘‘మోదీజీ ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని ఆరోపిస్తున్నారు. కానీ, వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారు. మీ పదేళ్ల పాలనలో రాయ్ బరేలీ, అమేథీ ప్రజలకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి’’ అని ఖర్గే అన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల వరకు అమేథీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని ఓడించారు. రాయ్ బరేలీ నుంచి సోనియాగాంధీ గెలిచారు. అయితే, ఈసారి ఆమె రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఆమె రాజ్యసభ నామినేషన్ భవిష్యత్తులో కాంగ్రెస్ చవి చూసే ఓటమికి నిదర్శనమని బీజేపీ చెబుతోంది.