Priyanka Gandhi : ప్రియాంక గాంధీ.. ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు?
Priyanka Gandhi Rae Bareli : 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా.. ప్రియాంక గాంధీ బరిలో దిగడం లేదు. అయితే.. దీని వెనక ‘బీజేపీ’ ఫ్యాక్టర్ ఉందని వార్తలు వస్తున్నాయి.
2024 Lok Sabha elections Priyanka Gandhi : ప్రియాంక గాంధీ.. ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్‌ని తన భుజాల మీద మోస్తున్న పేరు ఇది. ప్రియాంక గాంధీ.. తల్లి సోనియా గాంధీ ఆశలను మోస్తూ.. సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్‌కి పునర్వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్న ఓ మహిళ పేరు ఇది. ప్రియాంక గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై.. మాటల తూటాలు పేల్చుతూ, ఆయన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పుకొడుతున్న ఒక రాజకీయ నేత పేరు ఇది. కానీ.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. చాలా కాలం గడిచిపోయినా, ప్రియాంక గాంధీ మాత్రం ఇంకా ఎన్నికల బరిలో దిగలేదు! ఈ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటికి సైతం ఆమె దూరంగా ఉండిపోతున్నారు. కారణం ఏంటి? గాంధీలపై బీజేపీ ప్రభావం ఎంత ఉంది?
ప్రియాంక గాంధీ.. ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయరు?
మోదీ వేవ్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్‌కు.. ప్రియాంక గాంధీ ఒక వరంగా దొరికారని చెప్పడంలో సందేహం లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక ఎంట్రీతో.. 'ఇందిరమ్మ మళ్లీ వచ్చింది,' అని చాలా మంది అనుకున్నారు. మరీ ముఖ్యంగా.. ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక చేసిన సేవ అంతా ఇంతా కాదు. యూపీ కాంగ్రెస్‌కి అన్ని తానై చూసుకుంటున్నారు. అదే సమయంలో.. సోదరుడు రాహుల్ గాంధీపై బీజేపీ చేస్తున్న విమర్శల దాడిని కూడా తిప్పుకొడుతున్నారు.
కానీ.. ఎందుకో ప్రియాంక ఎన్నికల బరిలో దిగడం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనే ఆమె పోటీ చేస్తారని అందరు అనుకున్నారు. అలా జరగలేదు. ఆ తర్వాత జరిగిన ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ప్రియాంక కచ్చితంగా బరిలో దిగుతారని అందరు అనుకున్నారు. అలా జరగలేదు. ఇక.. సోనియా గాంధీ వదిలేసిన కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీలో పోటీ చేసి.. 2024 లోక్‌సభ ఎన్నికలతో ఆమె ఎలక్షన్ ఫైట్‌కి ఎంట్రీ ఇవ్వడం దాదాఫు ఖాయం అని అందరు అనుకున్నారు. ఈసారీ.. అలా జరగడం లేదు. మరి కారణం ఏంటి?
2024 Lok Sabha elections Congress : మీడియా కథనాల ప్రకారం.. ఈసారి రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని.. ప్రియంక గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే కోరారు. కానీ.. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఇందుకు కారణం బీజేపీ అయ్యుండొచ్చు.
కాంగ్రెస్ పార్టీపై బీజేపీ టీమ్ చేసే ప్రధాన, అతి ముఖ్యమైన ఆరోపణ.. 'వారసత్వ రాజకీయం'. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే.. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ.. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భావిస్తున్నట్టు సమాచారం.
2019 వరకు అమేఠీ.. కాంగ్రెస్ కంచుకోట. అయితే.. రాయ్‌బరేలీ ఇప్పటికీ.. కాంగ్రెస్‌కు కంచుకోటే! అక్కడ ఏ కాంగ్రెస్ అభ్యర్థి పోటీచేసినా.. గెలవడం ఖాయం! సోనియా గాంధీ సైతం.. 2019లో అక్కడ గెలిచారు. కానీ ఇటీవలే ఆమె రాజ్యసభకు షిఫ్ట్ అయ్యారు. ఆమె స్థానంలో ప్రియాంక గాంధీ వస్తారని అందరు అనుకున్నారు. చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది.
మే 20న ఈ ప్రాంతంలో ఎన్నికలు జరగనుండగా.. శుక్రవారంతో నామినేషన్ ప్రక్రియ పూర్తవ్వనుంది. రాయ్‌బరేలీలో ప్రియాంక గాంధీ పోటీ చేయడం లేదని శుక్రవారం ఉదయం తేలింది. రాహుల్ గాంధీ.. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు (వయనాడ్‌తో పాటు).
Priyanka Gandhi Rae Bareli : అయితే.. బీజేపీ ఏదో అంటుందని ప్రియాంక గాంధీ పోటీ చేయడం లేదన్న వార్తలపై కాంగ్రెస్ నేతలు కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఇలా చేస్తే.. ఓటర్లలో నమ్మకం పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు తీవ్రస్థాయిలో ప్రచారాలు చేస్తూ... చివరికి ఎన్నికల్లో నిలవకపోతే, ప్రజలు కూడా అయోమయంలో పడతారని అంటున్నారు. ప్రియాంక గాంధీకి ఇప్పటికే మంచి గుర్తింపు ఉందని, ఆమ పోటీ చేసి గెలిస్తే.. అది కాంగ్రెస్‌కి కూడా మంచే జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరి.. ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో ఎప్పుడు దిగుతారో? దానికి ఇంకెంత సమయం పడుతుందో? వేచి చూడాలి..
సంబంధిత కథనం