Bhuvanagiri Congress: భువనగిరిలో కాంగ్రెస్ కు సీపీఎం ఎఫెక్ట్.. పొంచి ఉన్న ఓట్ల చీలిక ముప్పు
Bhuvanagiri Congress: తెలంగాణలో 16 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సిపిఎం మద్దతు ఇస్తున్నా, భువనగిరిలో మాత్రం ఓట్ల చీలిక భయం తప్పడం లేదు.

భువనగిరిలో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల చీలిక భయం తప్పడం లేదు. తెలంగాణలో 16 చోట్ల మద్దతు ఇస్తున్నా.. భువనగిరిలో మాత్రమే సీపీఎం CPM అభ్యర్థి పోటీలో ఉండటంతో ఓట్లు చీలుతాయనే ఆందోళన కాంగ్రెస్‌లో ఉంది.
భువనగిరి లోక్ సభా నియోజకవర్గంలో కాంగ్రెస్ కు కొత్త తలనొప్పి తయారైంది. త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్న ఈ సీటులో తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఆ పార్టీకి అడ్డంకులు ఎదురవుతున్నాయి. 2018 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన భువనగిరికి 2009 తొలి సారి ఎన్నికలు జరిగాయి.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తొలి సారి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలుగు కాగా, బీఆర్ఎస్ విజయం సాధించింది. అపుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఎంపీగా గెలిచారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి తన సీటును దక్కించుకుంది. కోమటిరెడ్డి వెంకటెరెడ్డి ఈ స్థానం నుంచి గెలిచారు. మొత్తంగా మూడు ఎన్నికలు జరిగితే రెండు పర్యాయాలు కాంగ్రెస్ విజయాలు సాధించింది. ఇపుడు సిట్టింగ్ సీటుగా ఉన్న భువనగిరిని దక్కించుకోవాల్సిన అనివార్య పరిస్థితి కాంగ్రెస్ కు ఏర్పడింది. కానీ, ఈ సారి సీపీఎం రూపంలో ఆ పార్టీ ఓట్లకు గండిపడే ముప్పు పొంచి ఉంది.
ఇండియా కూటమిలో ఉన్నా.. భువనగిరిలో సీపీఎం పోటీ
జాతీయ రాజకీయాల్లో భాగంగా కేంద్రంలోని బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడిన ‘ఇండియా కూటమి ’ లో కాంగ్రెస్, సీపీఎం భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.
తెలంగాణలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో సైతం ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని భావించినా, సీట్ల పంపకం కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగా 15 నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్ని చోట్లా ఓటమి పాలైంది. సీపీఐ మాత్రం కొత్తగూడెం ఒక్క సీటు తీసుకుని విజయం సాధించింది.
ఈ ఎన్నికల్లో సైతం ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని భావించినా.. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నుంచి ఆ దిశలో అడుగులు ముందుకు పడకపోవడంతో సీపీఎం భువనగిరిలో తమ అభ్యర్థిని నిలబెట్టింది. ఆ తర్వాత జరిగిన కాంగ్రెస్ నాయకులు సీపీఎం నాయకత్వంతో చర్చలు జరిపి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని, భువనగిరిలో ఉప సంహరించుకోవాలని ప్రతిపాదించింది.
సీపీఎం మాత్రం మిగిలిన 16 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందని, తమ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి భువనగిరి లోక్ సభా నియోజకవర్గంలో పోటీలో ఉంటామని తేల్చి చెప్పింది.
సీపీఎం చీల్చే ఓట్లపై.. కాంగ్రెస్ ఆందోళన
టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భువనగిరి ఎన్నిక, అక్కడ అభ్యర్థి విజయం సవాలుగా మారింది. ఇక్కడ తన దగ్గరి అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్న రేవంత్ రెడ్డికి ఆయనను గెలిపించాల్సిన బాధ్యత కూడా.
గతంలో ఓ సారి గెలిచిన బీఆర్ఎస్ తోటి, ఈ సారి గెలుపు తమేదే అన్న ఊపులో ఉన్న బీజేతో కాంగ్రెస్ ఢీకొడుతోంది. ఈ పరిస్థితుల్లో సీపీఎం అభ్యర్థి కూడా పోటీలో ఉండడం కాంగ్రెస్ కు పంటికింది రాయిలా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
లోక్ సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అయిదు చోట్ల సీపీఎం గతంలో ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఆ ఓటు బ్యాంకులో మెజారిటీ ఓట్లు ఇప్పటికీ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. అంతే కాకుండా 2009లో జరిగిన లోక్ సభ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్య ఏకంగా 3,64,215 ఓట్లు సాధించారు.
ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మాత్రం సీపీఎంకు 54వేల ఓట్లు వచ్చాయి. 2019లో ఎన్నికకు దూరంగా ఉంది. ఈ మాత్రం ఓట్లు చీలిపోయినా.. అది కాంగ్రెస్ అభ్యర్థికి మైనస్ గానే భావిస్తున్నారు. దీంతో మిగిలిన 16 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం సీపీఎం అండగా నిలుస్తున్నా.. భువనగిరిలో మాత్రం ఆ పార్టీ ఎక్కడ తమ అభ్యర్థి ఓటమి కారణమవుతుందోన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, HT TELUGU నల్గొండ )