తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Kariminagar : ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు - ఇప్పటికే 68 కేసులు, రూ.7 కోట్లు సీజ్

Kariminagar : ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు - ఇప్పటికే 68 కేసులు, రూ.7 కోట్లు సీజ్

HT Telugu Desk HT Telugu

20 April 2024, 13:32 IST

google News
    • Loksabha Elections in Kariminagar :ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు కరీంనగర్ జిల్లా అధికారులు. ఇప్పటికే 68 కేసులు నమోదు కాగా… 7 కోట్ల రూపాయలను సీజ్ చేశారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Loksabha Elections in Kariminagar : పార్లమెంట్ ఎన్నికల(Loksabha Elections) నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కరీంనగర్ కలెక్టర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పమేలా సత్పతి. ఇప్పటివరకు కోడ్ ఉల్లంఘనపై 68 ఫిర్యాదు అందగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నామని తెలిపారు. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పోలీసు తనిఖీల్లో రూ.7.24 కోట్ల వరకు నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.‌ కరీంనగర్ లో మీడియాతో తో మాట్లాడిన కలెక్టర్ ఎన్నికలకు సంబంధించిన ఏమైనా ఫిర్యాదులు ఉంటే సి విజిల్ యాప్ ద్వారా సమాచారం అందించాలని కోరారు.

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఐదు జిల్లాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 17.92 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లు 50వేలు అధికంగా ఉండడం విశేషమన్నారు. 46 వేల మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యారని, 13,200మంది 85ఏళ్ల పైబడిన వృద్ధులు ఉన్నారని తెలిపారు. 41,500 మంది దివ్యాంగులు ఉన్నారని, వీరి కోసం ప్రత్యేకంగా వీల్ చైర్ లు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.

2194 పోలింగ్ కేంద్రాలు

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ(Karimnagar Lok Sabha constituency) పరిధిలో 2194 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అందులో 5500 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని వెల్లడించారు. 8552 ఈవీఎంలు ఉపయోగిస్తున్నామని చెప్పారు. 85ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటినుంచే ఓటు వేసేలా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. 12 వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సువిధ పోర్టల్ ద్వారా సభలు, సమావేశాలు, ప్రచారానికి అనుమతుల కోసం 168 దరఖాస్తులు వచ్చాయని, దాదాపు 105 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చామని వెల్లడించారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటికీ ఓటరు స్లిప్పులు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఓటరు స్లిప్పులు పంపిణీ చేసే సమయంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు సిబ్బందితో వెంట ఉండి ఓటరు జాబితాను చెక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో బెల్ట్ షాపులు మూసివేస్తామని అన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను రాజకీయ పార్టీల నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తామని తెలిపారు.

ఖర్చులపై ఫిర్యాదు చేయొచ్చు…

కరీంనగర్ పార్లమెంట్(Karimnagar Lok Sabha constituency) ఎన్నికల వ్యయ ఫిర్యాదులు సూచనలు, సలహాల కోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిశీలకులను సంప్రదించవచ్చని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు అశ్విని కుమార్ పాండే మొబైల్ నంబర్ 9032659531కు ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు పరిశీలకులు జిల్లాలోనే ఉండి ఎన్నికల వ్యయానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తారని తెలిపారు. కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ పమేలా సత్ఫతిని ఎన్నికల వ్యయ పరిశీలకులు అశ్వినీ కుమార్ పాండే మర్యాదపూర్వ కంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.

మొదటి ర్యాండమైజేషన్లో భాగంగా కేటాయించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఆయా నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూమ్ లకు అప్రమత్తంగా తరలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కరీంనగర్ లోని ఈవీఎం గోదాంను సందర్శించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలు, వీవీప్యాట్ల తరలింపు ప్రక్రియను పరిశీలించారు. ఈవీఎంల తరలింపులో ఎక్కడా తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు.

రిపోర్టింగ్ - HT Telugu Correspondent K V.REDDY, Karimnagar

తదుపరి వ్యాసం