Warangal BRS: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబుమోహన్? అభ్యర్థుల వేటలో గులాబీ పార్టీ బాస్…-babu mohan as brs warangal parliament candidate ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Warangal Brs: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబుమోహన్? అభ్యర్థుల వేటలో గులాబీ పార్టీ బాస్…

Warangal BRS: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బాబుమోహన్? అభ్యర్థుల వేటలో గులాబీ పార్టీ బాస్…

HT Telugu Desk HT Telugu
Mar 29, 2024 11:47 AM IST

Warangal BRS: వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయలేనంటూ కడియం కావ్య ఇచ్చిన ట్విస్ట్ తో బీఆర్ఎస్ పార్టీ గందరగోళంలో పడింది. మరో నెలన్నర రోజుల్లో ఎలక్షన్ జరగనుండగా.. ఇప్పటికిప్పుడు మరో అభ్యర్థి కోసం బీఆర్ఎస్ వేట సాగిస్తోంది.

వరంగల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా బాబుమోహన్ పేరు..
వరంగల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా బాబుమోహన్ పేరు..

Warangal BRS: బీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి కడియం కావ్య Kadiyam Kavya నిరాకరించడంతో ఆ పార్టీ అభ్యర్థుల వెదుకులాటలో పడింది. నిన్నమొన్నటి వరకు బీఆర్ఎస్ BRS నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిన కొంతమంది ఉద్యమకారులు మళ్లీ టికెట్ ప్రయత్నాలు చేస్తుండగా.. తాజాగా మరో పేరు తెరమీదకు వచ్చింది.

మొన్నటి వరకు బీజేపీలో కొనసాగి, ఆ తరువాత వరంగల్ ఎంపీ టికెట్ కోసం ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్ babu mohan బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వరంగల్ Warangal MP ఎంపీ అభ్యర్థిగా బాబు మోహన్ ను ప్రకటించగా.. ఇప్పుడు ఆయన ప్రజాశాంతి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు కూడా టికెట్ ప్రయత్నాలు మళ్లీ ముమ్మరం చేశారు.

కావ్య తప్పుకోవడంతో ఖాళీ

వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించిన డాక్టర్ కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఒకట్రెండు రోజుల్లో కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య ఇద్దరూ కాంగ్రెస్ లో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది.

గురువారం దిల్లీకి వెళ్లిన ఇద్దరూ కాంగ్రెస్ అగ్రనేతలు కలిసి సాయంత్రానికి హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ కు చేరుకుని మంతనాలు జరుపుతున్నారు. కాగా నేడు పార్టీ మార్పుపై కడియం శ్రీహరి, కావ్య ప్రకటన చేయనున్నట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. కాగా కావ్య పోటీ నుంచి తప్పుకోవడంతో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని పోటీలో దింపుతారోననే చర్చ మొదలైంది.

తెరపైకి బాబుమోహన్ పేరు

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కమేడియన్ గా వందలాది సినిమాల్లో నటించిన బాబుమోహన్ 1999లో మెదక్ జిల్లా ఆందోళ్ శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా కడా పని చేశారు. ఆ తరువాత 2004లో ఓటమి చవి చూసిన ఆయన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు.

2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించినా ఫలితం దక్కకపోవడంతో బీజేపీలో చేరాడు. ఆందోళ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ చేతిలో ఓటమి పాలయ్యారు. మొన్న 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహా చేతిలో ఓడిపోయాడు. కాగా రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల హడావుడి మొదలవడంతో ఈ ఏడాది మార్చి 4న ప్రజాశాంతి పార్టీలో చేరారు.

ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బాబు మోహన్ ను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. మరి కొద్ది రోజుల్లోనే ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు రెడీ అవుతుండగా.. ఇంతలోనే బీఆర్ఎస్ టికెట్ ఖాళీ కావడంతో బాబుమోహన్ పార్టీ పెద్దల టచ్ లోకి వెళ్లినట్లు తెలిసింది.

గతంలోనే వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు బాబు మోహన్ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అధినేతల టచ్ లోకి వెళ్లినా ఫలితం దక్కలేదు. చివరికి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేసేందుకు రెడీ అయ్యారు.

కడియం కావ్య ఇచ్చిన ఊహించని షాక్ తో బాబు మోహన్ కు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫోన్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఆయననే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని వరంగల్ లో చర్చ జరుగుతోంది. రెండు రోజుల్లో టికెట్ కన్ఫామ్ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.

పోటీ పడుతున్న ఉద్యమకారులు

మొన్నటి వరకు వరంగల్ పార్లమెంట్ టికెట్ కోసం ప్రయత్నించిన ఉద్యమకారులు కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అసంతృప్తితోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కావ్య పోటీ నుంచి తప్పుకోగా.. ఆమె వేరే పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉద్యమకారులు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉద్యమకారులు కేయూ జేఏసీ నేతలు జోరిక రమేశ్, బోడ డిన్నా ఇద్దరూ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లే యోచనలో ఉన్నారు. కాగా ఇప్పటికే మాజీ మంత్రి బాబుమోహన్ పేరు తెరమీదకు రాగా.. బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ టికెట్ ను ఎవరికి కట్టబెడుతుందో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం