Himachal Pradesh Polls: హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం జరిగింది. మొత్తం 68 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ ముగిసింది. అయితే షిమ్లా (Shimla) జిల్లాలోని రామ్‍పూర్ ప్రాంతంలో కాంగ్రెస్ (Congress) నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‍లను (EVMs) ప్రైవేటు వాహనాల్లో తరలిస్తున్నారని ఆందోళనకు దిగారు. ఈ విషయంలో ఆ జిల్లా ఎన్నికల కమిషన్ స్పందించింది. చర్యలు చేపట్టింది.
కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేయటంతో పాటు ఫిర్యాదు నమోదు చేయటంతో ప్రైవేట్ వాహనంలో ఈవీఎంలను తరలించిన సిబ్బందిని జిల్లా ఎన్నికల కమిషన్ ఆదివారం సస్పెండ్ చేసింది. “ఓ ప్రైవేట్ కారులో ఈవీఎంలను తలరించారు. దాన్ని మేం ఫాలో చేశాం. పోలీసులకు, ఎన్నికల కమిషన్ అధికారులకు సమాచారం అందించాం” అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నంద్ లాల్.. మీడియాతో చెప్పారు.
దత్‍నగర్-49 పోలింగ్ కేంద్రానికి కేటాయించిన పోలింగ్ పార్టీ నంబర్.146 సిబ్బంది ఈవీఎం/వీవీప్యాట్‍లను ప్రైవేట్ వాహనంలో తీసుకెళుతున్నట్టు తమకు సమాచారం అందిందని షిమ్లా జిల్లా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఈ పోలింగ్ కేంద్రం రామ్‍పూర్ నియోజకవర్గం పరిధిలో ఉంది. నిబంధనల ప్రకారం, పోలింగ్ ముగిశాక ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‍కు ప్రభుత్వ వాహనంలోనే తరలించాలి.
బీజేపీకి అనుకూలంగా ట్యాంపర్ చేసేందుకే ఈవీఎంలను ప్రైవేట్ వాహనంలో తరలించారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఆందోళన నిర్వహించారు. అనంతరం పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‍కు తరలించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ బయట బీజేపీ, కాంగ్రెస్ నేతల సమక్షంలో ఈవీఎంలను బయటికి తీశారు. వాటికి సీల్స్ సరిగా ఉన్నాయని, ఎలాంటి ట్యాంపర్ కాలేదని వెల్లడించారు. ఈవీఎంలను త్వరగా అప్పగించాలనే ఉద్దేశంతోనే సిబ్బంది వాటిని ప్రైవేట్ వాహనంలో తీసుకొచ్చారని అధికారులు అన్నారు.
68 శాసనసభ స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు శనివారం జరిగాయి. మొత్తంగా 74.05 శాతం పోలింగ్ నమోదైంది. 2017తో పోలిస్తే ఇప్పుడు సుమారు ఒటిన్నర శాతం తగ్గింది. మరోవైపు, మళ్లీ అధికారం తమదేనని బీజేపీ దీమా వ్యక్తం చేస్తోంది. ప్రజలు తమనే ఆశీర్వాదించారని, తిరిగి అధికారం చేపడతామని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. డిసెంబర్ 8వ తేదీన హిమాచల్ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.